Ganta Srinivasa Rao : వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని మేము అంటాం
ABN , First Publish Date - 2023-04-30T12:43:57+05:30 IST
సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే సెప్టెంబర్‌లో విశాఖలో కాపురం అని జగన్ అంటున్నారన్నారు.
విశాఖ : సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే సెప్టెంబర్‌లో విశాఖలో కాపురం అని జగన్ అంటున్నారన్నారు. ఇక్కడకి వచ్చి ఏమి చేస్తారని ప్రశ్నించారు. వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని తాము అంటామని గంటా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చెసిన జగన్ ప్రభుత్వం మళ్లీ రాకూడదన్నారు. నాదెండ్ల మనోహర్ మాటకు మద్దతు పలుకుతున్నామని పేర్కొన్నారు. వైసీపీని గద్దె దింపడానికి అన్ని పార్టీలు కలవాలన్నారు. మొన్న కూడా సినీనటుడు రజనీకాంత్ .. హైదరాబాద్ అభివృద్ధి.. చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడారని గంటా గుర్తు చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబును ప్రపంచం మొత్తం కొనియాడిందన్నారు. మళ్ళీ చంద్రబాబు పాలన రావాలని అందరూ కోరుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని గంటా అన్నారు. జగన్ 4 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారు. ఎన్నికలువస్తున్నాయని... ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్, అదాని డేటా సెంటర్‌లకు శంకుస్థాపనలకు చేయడానికి రెడీ అవుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు, అదాని డేటా సెంటర్‌లకు శంకుస్థాపనలు చేసిన పోటోలను గంటా ప్రదర్శించారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించారన్నారు. మీకు 22 ఎంపీలు వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాలు కోసంఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. మీరే మెడలు వంచారని గంటా విమర్శించారు. దేశంలో ఏపీలో కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయన్నారు. కోర్టులు అంటే... ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. అవినాష్ రెడ్డి టాపిక్‌ను డైవర్డ్ చేయడానికే.. శంకుస్థాపన డ్రామాలు ఆడుతున్నారన్నారు. జగనన్న నువ్వే నమ్మకం సిక్కర్లు అంటిస్తున్నారని.. అసలు ఎందుకు నమ్మాలని గంటా ప్రశ్నించారు.