ఆక్యుపెన్సీలో మాచర్ల డిపోకు మొదటి స్థానం
ABN , First Publish Date - 2023-02-24T00:36:21+05:30 IST
ఆక్యుపెన్సీలో మాచర్ల ఆర్టీసీ డిపో మొదటి స్థానంలో ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

మాచర్ల - హైదరాబాద్ రూట్‌కు ఆదరణ ఫ ఏపీఎ్‌సఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుి
పిడుగురాళ్ల, ఫిబ్రవరి 23: ఆక్యుపెన్సీలో మాచర్ల ఆర్టీసీ డిపో మొదటి స్థానంలో ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోను సందర్శించిన తిరుమలరావు మాట్లాడుతూ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పల్నాడులో డిపోల స్థితిగతులను పరిశీలిస్తున్నామన్నారు. గురువారం మాచర్ల, గురజాల డిపోలను పరిశీలించానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, మాచర్ల సమీపంలోని బుద్ధవనం ప్రాజెక్టు వరకు తెలంగాణ సర్వీసులు ఉన్నాయని, గుంటూరు, విజయవాడ నుంచి కూడా బుద్ధవనం ప్రాజెక్టు వరకు, నాగార్జునకొండ వరకు వెళ్లే పర్యాటకులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అక్కడి ప్రయాణికులు తమదృష్టికి తెచ్చారన్నారు. పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడిందని, బస్సు సౌకర్యాలు కల్పించడం కాస్త ఆలస్యమవుతాయన్నారు. మాచర్ల నుంచి శ్రీశైలం వరకు 180 కి.మీ. వరకు నడుస్తున్న పల్లెవెలుగు బస్సుకు మంచి స్పందన వస్తుందన్నారు. బెంగుళూరు సర్వీసును నడిపేలా చూస్తామని తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటు తరువాత అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యాలను నేరుగా ఏర్పాటుచేసేందుకు వీలుపడదని, ఎక్కడికక్కడ లింకు సర్వీసులు ఏర్పాటుచేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఆదాయంతో పనిలేకుండా ప్రయాణికుల మన్ననే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, ఆదాం, డిపో మేనేజర్ ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పిడుగురాళ్ల డిపోను అభివృద్ధి చేయండి: ఎమ్మెల్యే కాసు
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు దూరప్రాంతాలకు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కోరారు. గురువారం సాయంత్రం పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోను సందర్శించిన ద్వారకా తిరుమలరావును ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి డిపోలో కలిశారు. పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్, శ్రీశైలం, బెంగుళూరుతో పాటు దూరప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు డిపో అభివృద్ధిపై ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్యారేజిని సందర్శించి సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు.
మాచర్ల డిపో సందర్శన
మాచర్ల: మాచర్ల - హైదరాబాద్ రూట్ సర్వీసులకు మంచి ఆదరణ ఉన్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ వీసీ, ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండే మార్గాలలో బస్సు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొన్ని చోట్లకు ఆక్యుపెన్సీ లేకపోయినప్పటికీ సర్వీసులను నడుపుతున్నామన్నారు. టూరిస్టు ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలకు బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు బస్సులు నడపాలని చాలా మంది కోరుతున్నారని, రూట్‌మ్యా్‌పను ప్రస్తుతం పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బస్టాండ్‌లో తాగునీరు, టాయిలెట్స్ వంటి వసతులు మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
బుద్ధవనం సందర్శన
విజయపురిసౌత్, ఫిబ్రవరి 23: నాగార్జున సాగర్‌లో బుద్ధవనంను గురువారం ఏపీఎ్‌సఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు సందర్శించారు. ఈయనకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధచరితవనం, ధ్యానవనం, జాతక పార్కు, స్థూప పార్కులను సందర్శించారు. మహాస్థూపంను సందర్శించి అంతర్భాగంలోని ధ్యానమందిర నిర్మాణాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది తీరాన అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశ పర్యాటకులను ఆకట్టుకుంటుందన్నారు. బౌద్ధ వారసత్వ శిల్ప సంపదను గొప్పగా నిర్మించిన ప్రత్యేక అధికారి లక్ష్మయ్యను అభినందించారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నిర్మాణ విశేషాలను వివరించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి, గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్, సీఐలు షమివుల్లా, బాలకృష్ణ, విజయపురిసౌత్ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి, బుద్ధవనం పర్యవేక్షకులు నరసింహారావు, విష్ణు తదితరులు ఉన్నారు.