వైసీపీకి షాక్‌

ABN , First Publish Date - 2023-04-17T00:25:52+05:30 IST

వివేకా హత్య కేసు విచారణ ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పాటు విచారణ అధికారి రాంసింగ్‌ను మార్చాలని సూచించింది. సుప్రీం సూచనల మేరకు రాంసింగ్‌ను తొలగించి డీ ఐజీ కేశవరావు

వైసీపీకి షాక్‌

వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

ఎంపీ అవినాశ్‌రెడ్డికి మరోసారి నోటీసు

నేడు మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరు కావాలంటూ వాట్సప్‌కు మెసేజ్‌

వైసీపీలో కలవరం

మరికొంతమంది అరెస్టు అంటూ ప్రచారం

పార్టీకి డ్యామేజీ అంటున్న వైసీపీ నేతలు

సీబీఐకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు

సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వైసీపీని షాక్‌కు గురిచేశాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని ఆదివారం ఉదయం పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాదు సీబీఐ కోర్టులో మధ్యాహ్నం హాజరుపరచగా 14 రోజులు రిమాండు విధించింది. ఆ షాక్‌ నుంచి వైసీపీ శ్రేణులు తేరుకోకముందే ఎంీపీ అవినాశ్‌రెడ్డిని మరోసారి విచారణకు రావాలంటూ సీబీఐ అధికారులు ఆయనకు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాదు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని సమాచారం అందించారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. ఉద యాన్నే తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, రాత్రిలోపే కొడుకు అవినాశ్‌రెడ్డిని విచారణకు రావాలంటూ వాట్సప్‌ ద్వారా సమాచారం అందించడంతో వైసీపీ శ్రేణులు షాక్‌ గురయ్యారు.

(కడప - ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసు విచారణ ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పాటు విచారణ అధికారి రాంసింగ్‌ను మార్చాలని సూచించింది. సుప్రీం సూచనల మేరకు రాంసింగ్‌ను తొలగించి డీ ఐజీ కేశవరావు చౌరాసియా నేతృత్వంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. కొత్త డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్పీ వికాస్‌కుమార్‌, అదనపు ఎస్పీ ముఖేష్‌శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంకిత్‌ యాదవ్‌ సభ్యులుగా నియమించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండడంతో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే ఈ నెల 14న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసింది. రెండురోజుల వ్యవధిలోనే ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చే యడం వైసీపీ శ్రేణులను షాక్‌కు గురి చేసింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి అజాతశత్రువులా పేరొందారు. ఆయనను పార్టీలకతీతంగా ప్రేమిస్తారు. అయితే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయాన 2019 మార్చి 15న ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురయ్యారు. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ హాలీవుడ్‌ సినిమాను తలపించే విధంగా మలుపులు తిరిగింది. హత్యజరిగిన రోజు తొలుత గుండెపోటు, రక్తవాంతులుగా చిత్రీకరించారు. తరువాత చంద్రబాబు హత్య చేయించారంటూ నారాసుర రక్తచరిత్ర అంటూ జగన్‌ సొంత మీడియాలో ప్రచారం చేశారు. తరువాత బెంగళూరులో ల్యాండ్‌ సెటిల్‌మెంటు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదాలు, ముస్లిం మహిళతో సంబంధం ఇటీవల సునీల్‌యాదవ్‌ తల్లిని లైంగికంగా వేధించినందుకే హత్య చేశారంటూ.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. వివేకా హత్య జరిగి నాలుగేళ్లు దాటినా హత్యకు సూత్రధారి, కుట్రదారులు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దూకుడు పెంచింది.

మరికొందరు అరెస్టు అంటూ ప్రచారం

వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత అలుపెరగని పోరాటం చేశారు. సీబీఐ విచారణ చేపట్టాలంటూ హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు అనేకమార్లు న్యాయస్థానం మెట్లెక్కారు. దీంతో విచారణలో వేగం పెరగడంతో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్టు అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిట్‌ బృందం ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని 2019 మార్చి 28న అరెస్టు చేసింది. అయితే 90 రోజుల్లోపు చార్జిసీట్‌ దాఖలు చేయకపోవడంతో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. ఇక సీబీఐ విచారణ తరువాత ఏ-4గా ఉండి అప్రూవర్‌గా ఉన్న డ్రైవరు దస్తగిరికి బెయిలు మంజూరు చేసింది. ఏ-2 సునీల్‌కుమార్‌యాదవ్‌, ఏ-3 ఉమా శంకరరెడ్డి, ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, ఏ-6 ఉదయ్‌కుమార్‌రెడ్డి హైదరాబాదులోని చంచలగూడ జైలులో ఉన్నారు. ఇక వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఆదివారం అరెస్టుచేయడంతో ఈ సంఖ్య 7కు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల చివరి నాటికి విచారణ పూర్తి కావాల్సి ఉండడంతో అంతకు ముందే ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతోందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పులివెందులకు చెందిన మరికొందరు వైసీపీ నేతల అరెస్టు జరగవచ్చంటూ చెబుతున్నారు. ఈ ప్రచారం వైసీపీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వైఎస్‌ ఫ్యామిలీని అరాధించే కొందరు హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ వివేకా హత్యను జీర్ఫించుకోలేకపోతున్నారు. అయితే ఈ కేసులో పలు ముఖ్య నేతల పేర్లు బయటికి రావడం వారి అరెస్టు కూడా తప్పదంటూ ప్రచారం జరుగుతుండడంతో జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలే డీలా పడ్డారని అంటున్నారు. జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జనమంతా వైఎస్‌ వివేకా హత్య విచారణపై లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అందరి చూపు వివేకా హత్య కేసు విచారణపైనే ఉంది. ఈ సమయంలో వివేకా హత్య కేసులో వైసీపీ నేతల అరెస్టుతో అది పార్టీకి తీవ్ర డ్యామేజీ అవుతుందంటూ కొందరు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ హత్య కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళనలో ఉన్నారు. కాగా.. సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. జగన్‌కు వరుసకు చిన్నాన్న, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి అయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిరసనలు తెలపాలని వైసీపీ సోషల్‌ మీడియా పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని పలు చోట్ల వైసీపీ నేతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కాగా.. పులివెందులలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో దుకాణాలన్నీ మూసివేశారు. ర్యాలీ అయిపోయిన పదినిమిషాలకే పులివెందులలో దుకాణాలన్నీ తిరిగి తెరుచుకోవడం విశేషం.

Updated Date - 2023-04-17T00:25:52+05:30 IST