Vijayawada Court: రిప్లై వాదనలపై వాగ్యుద్ధం.. ఆవేశంతో వెళ్లిపోయిన..!
ABN , First Publish Date - 2023-10-06T04:30:59+05:30 IST
విచారణ సందర్భంగా ఏఏజీ, చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వాగ్యుద్ధానికి దిగారు.
నువ్వెంత అంటే నువ్వెంత
కోర్టులో ఏఏజీ వర్సెస్ దూబే రిప్లై వాదనలపై వాగ్యుద్ధం
విచారణ సందర్భంగా ఏఏజీ, చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వాగ్యుద్ధానికి దిగారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలకు తాను రిప్లై వాదనలు వినిపిస్తానని ఏఏజీ చెప్పడంపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీ పిటిషన్‌పై తాము వాదనలు ప్రారంభించక ముందు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో చెప్పేది ఏముందని ప్రశ్నించారు. సీఐడీ తరపున సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించాక తాను వాదనలు వినిపించానని.. తిరిగి రిప్లై వాదనలు ఎలా వినిపిస్తారని అడిగారు. అయితే తాను వాదనలు వినిపించి తీరతానని, తనకు 15 నిమిషాలు సమయమివ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. దూబే అభ్యంతరం చెబుతూ.. తాను ఢిల్లీ నుంచి వచ్చానని, అక్కడి కేసులకూ తాను హాజరు కావలసి ఉందని చెప్పారు. ఈ సమయంలో పొన్నవోలు.. ‘యూ ఆర్ నథింగ్ బిఫోర్ మీ’ అని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. దూబే దీటుగా ప్రతిస్పందించారు. ‘మీరు డబుల్ ఏజీ’ అన్నారు. అనంతరం ఏఏజీ ఆవేశంగా కోర్టు హాలు నుంచి వెళ్లిపోయారు. దీనితో న్యాయాధికారి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.