CM Jagan: కార్పొరేట్ బడులతో.. ప్రభుత్వ బడులు పోటీ పడేలా చేస్తా...
ABN , First Publish Date - 2023-03-19T15:18:54+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన సభ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న (Jagananna) విద్యాదీవెన సభ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 9.86 లక్షల విద్యార్థులకు మేలు జరిగేలా వారి తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్లు వేస్తున్నామన్నారు. మనిషి పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఉండాలన్నారు. విద్యార్థులు కోసం జగనన్న విద్యా దీవెన పథకం గొప్పగా అమలు చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు ఉన్నా... వారి ఫీజులు తామే చెల్లిస్తామని స్పష్టం చేశారు.
పిల్లలకు నూటికి నూరు శాతం ఫీజు రీయంబర్స్ (Fee Reimbursement) ఇస్తూ ఈ ఒక్క పధకం ద్వారా రూ. 9,947 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. టీడీపీ హయాంలో చంద్రబాబు (Chandrababu) ఎగ్గొట్టి ... బకాయిలు పెడితే... ఆ డబ్బు కూడా తామే కట్టామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే 1092కు ఫోన్ చేస్తే ఆ కాలేజ్ వాళ్లతో సీఎంవో (CMO) అధికారులు మాట్లాడేలా చేశామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన రెండు పథకాల కింద అక్షరాలా రూ. 13,311 కోట్లు ఖర్చు చేశామన్నారు. రెండేళ్ల సమయం ఇస్తే... కార్పొరేట్ బడులతో.. ప్రభుత్వ బడులు పోటీ పడేలా చేస్తామన్నారు. వైద్య విద్య రంగంలో ఎప్పుడూ లేని విధంగా 17 కొత్త మెడికల్ కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గతాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుని.. 45 నెలల తన పాలనపై ఆలోచన చేయాలని అన్నారు.
ప్రతిపక్షాలకు మరోసారి సవాల్
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు మరోసారి సవాల్ విసిరారు. మంచిచేసే ఈప్రభుత్వం నిత్యం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా... కుటుంబ విలువలు, మానవత్వంలేని దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తోందన్నారు. దోచుకో, పంచుకో, తినుకో అని గత ప్రభుత్వం పాలన చేసిందని విమర్శించారు. మనది డైరెక్ట్ ట్రాన్సఫర్ బెన్ ఫిట్ (DTB) విధానమని అన్నారు. ఈనాడు (Eenadu), ఆంధ్రజ్యోతి (Andhra Jyoty), టీబీ 5 (TV 5), చంద్రబాబు, వీరికి తోడు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అని అన్నారు. బాబు, దుష్ట చతుష్టయానికి సవాల్ విసురుతున్నాన్నారు. వైకాపా ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే పొత్తు కోసం వారికి ఎందుకు ఆరాటం.. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయని అడుగుతున్నానన్నారు. 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి వైకాపాను ఎదుర్కొనే సత్తా ఉందా? అని సవాల్ చేశారు.
‘‘నీచ రాజకీయం ఎంత చేసినా... ప్రజలే నా ధైర్యం, నా నమ్మకం.. నా ప్రయాణంలో నేను ఆధారపడేది ఆ దేవుడు, ప్రజల మీదే.. వాళ్లలాగా నేను పొత్తుల గురించి ఆధారపడను, పెట్టుకోను.. 175 నియోజకవర్గాలలో ఒంటరిగా వెళుతున్నా.. మీకు ఒంటరిగా వచ్చే దమ్ము, ధైర్యం ఉందా? అని అడుగుతున్నా.. మీరు ఎంత చేసినా చివరికి మంచే గెలుస్తుంది.. అదే బైబిల్, ఖురాన్, భగవద్గీత చెబుతున్నాయి.. ఏ సినిమా చూసినా అందులో చివరికి మంచి చేసే వారే గెలుస్తారు.. ప్రజలంతా నిండు మనసుతో నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
కాగా తిరువూరులో సీఎం సభ కోసం అధికారుల తెగ పాట్లు పడ్డారు. సభ కోసం 60 బస్సుల్లో 3 వేల మంది విద్యార్థులను తరలించారు. తిరువూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్స్ నుంచి విద్యార్థులను తరలించారు. జ్వరంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను కూడా... సీఎం జగన్ సభ కోసం బలవంతంగా తరలించారు. విద్యార్థుల తరలింపుపై తల్లిదండ్రులు, విపక్షాలు మండిపడుతున్నాయి.