Budget-2023: ప్రత్యేకహోదా ప్రస్తావన లేదు.. రైల్వేజోన్ ఊసే లేదు... బడ్జెట్‌పై తులసిరెడ్డి
ABN , First Publish Date - 2023-02-02T12:19:03+05:30 IST
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
అమరావతి: కేంద్ర బడ్జెట్ (Union Budget - 2023)పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (Congress Leader TulasiReddy) తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల, గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఏపీ (Andhrapradesh State)కు టోపీ పెట్టిన బడ్జెట్.. అప్పుల మీద ఆధారపడ్డ బడ్జెట్ అంటూ విరుచుకుపడ్డారు. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో 2.77 శాతం మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం దురదృష్టకరమని తెలిపారు. ఎరువుల సబ్సిడీలో ఒకేసారి రూ.50120 కోట్లు కోత కోయడం శోచనీయమని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులో రూ.5013 కోట్లు కోత కోయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
అలాగే ఆహార సబ్సిడీలో ఒకేసారి రూ.89844 కోట్లు భారీ కోత విధించడం గర్హనీయమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదన్నారు. ఇప్పటికే దేశం అప్పుల కుప్ప అయిందని అన్నారు. ‘‘2023-24లో రూ.15.40 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేస్తుందట.. అంటే మొత్తం బడ్జెట్‌లో అప్పులు 34 శాతమ’’ని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రత్యేక హోదా (AP Special Status) ప్రస్తావనే లేదని.. రైల్వే జోన్(Railway Zone) ఊసే లేదన్నారు. పోలవరాన్ని పట్టించుకోలేదని, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) ప్రస్తావనే లేదని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.