ఒకటో నెంబర్ కుర్రాడు
ABN , First Publish Date - 2023-06-15T00:09:07+05:30 IST
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో మోతమోగింది. జిల్లాలోని నందిగామకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని సృష్టించాడు. ప్రముఖ వ్యాపారి చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి దంపతుల కుమారుడు ఉమేష్ వరుణ్ ఏపీ ఎంసెట్‌లో టాపర్‌గా నిలిచి అందరి మన్ననలు పొందాడు. ఆనందంతో నందిగామ ప్రజలు పులకించిపోయారు.

ఎంసెట్ టాపర్‌గా నందిగామ విద్యార్థి ఉమేష్
పులకించిన నందిగామ
నందిగామ, జూన్ 14 : ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో మోతమోగింది. జిల్లాలోని నందిగామకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని సృష్టించాడు. ప్రముఖ వ్యాపారి చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి దంపతుల కుమారుడు ఉమేష్ వరుణ్ ఏపీ ఎంసెట్‌లో టాపర్‌గా నిలిచి అందరి మన్ననలు పొందాడు. ఆనందంతో నందిగామ ప్రజలు పులకించిపోయారు.
నందిగామ, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో విద్యనభ్యసించిన ఉమేష్ హాజరైన ప్రతి పరీక్షలోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చాడు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది పాయింట్లు సాధించిన ఉమేష్ ఇంటర్‌లో 983 మార్కులు సాధించాడు. ఏపీ, తెలంగాణా ఎంసెట్‌లకు హాజరైన ఉమేష్ రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలో ప్రతిభ కనబరిచాడు. తెలంగాణా ఎంసెట్‌లో మూడో ర్యాంక్ సాధించగా, ఏపీ ఎంసెట్‌లో ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచాడు. జెఈఈ మెయిన్స్‌లో కూడా 263 ర్యాంక్ సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 160 మార్కులకుగాను 158.3 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచి అందరినీ అబ్బురపరిచాడు. దీంతో నందిగామ చరిత్రలో ఉమేష్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఇంత వరకూ స్టేట్ టాపర్‌గా ఎవరూ లేరు. ఉమేష్ సాధించిన ఈ విజయం నందిగామ ప్రజలను సంతోషంలో ముంచింది. ఉమేష్ తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు, దేవకీదేవి, సోదరి జయంతిల ఆనందానికి అవధులు లేవు. తన కుమారుడు సాధించిన విజయానికి విశ్వేశ్వరరావు దంపతులు ఉద్వేగానికి లోనయ్యారు. చిన్నతనం నుంచి చదువు తప్ప వేరే వ్యాపకం లేని తమ కుమారుడు స్టేట్ టాపర్‌గా నిలిచి తమతో పాటు నందిగామ ప్రతిష్టను కూడా పెంచాడని ఆనందం వ్యక్తం చేశారు.
టాప్ యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్ కావడమే లక్ష్యం
ఈ విజయంతోనే ఆగను. దేశంలోనే టాప్ యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం. ఎంసెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలవడంలో నా సాధన వెనుక నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో విలువైనది.
- ఉమేష్, ఎంసెట్ టాపర్
పామర్రు విద్యార్థికి 12వ ర్యాంకు
పామర్రు : ఏపీ ఎంసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా పామర్రు విద్యార్థి సత్తా చాటాడు. పట్టణ పేరును ఇనుమడింపజేశాడు. పట్టణానికి చెందిన కె.సిరిధరన్ ఏపీ ఎంసెట్‌లో 12వ ర్యాంకు సాధించి శెభాష్ అనిపించుకున్నాడు. స్థానిక చల్లపల్లి రోడ్డులో నివాసముంటున్న అంగలూరు డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ, శివలత దంపతుల కుమారుడు సిరిధరన్ హైదరబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీయట్ పూర్తిచేసి తెలంగాణా ఎంసెట్‌లో 61వ ర్యాంకు, ఎన్‌ఐటీలో 147వ ర్యాంకుతోపాటు బిట్స్ పిలానీలో 358 మార్కులు సాధించాడు. ఒలింపియాడ్ కెమిస్ర్టీ విభాగంలో ఇండియాలోనే 30వ ర్యాంకు సాధించి ఐఐటీ అడ్వాన్సుకు సెలెక్ట్ అయ్యాడని తల్లిదండ్రులు చెప్పారు. సిరిధరన్ ముంబై ఐఐటీ లేదా ఢిల్లీ ఐఐటీలో విద్యనభ్యసించి గూగుల్‌లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించాడు.
ఏపీ ఈఏపీ సెట్‌లో చల్లపల్లి యువకుడి సత్తా
చల్లపల్లి : చల్లపల్లి పొట్టి శ్రీరాములు వీధికి చెందిన కాకరపర్తి హేమ వెంకట నాగగోపాల్ - లక్ష్మీ అర్పిత దంపతుల చిన్న కుమారుడు ఉమేష్ శ్రీచంద్ర నీట్‌లో 534 మార్కులతో అఖిలభారత స్థాయిలో 77,526వ ర్యాంకు సాధించాడు. బుధవారం విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో 283వ ర్యాంకు సాధించాడు.