దివికేగిన కార్మిక నేత
ABN , First Publish Date - 2023-02-19T00:42:55+05:30 IST
ఆర్టీసీ కార్మిక ఉద్యమ నేత యలమంచిలి వెంకటేశ్వరరావు (వైవీ రావు) మృతితో కార్మికలోకం కంటతడి పెట్టింది. మూడు దశాబ్దాలకుపైగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నాయకుడిగా ఆయన చెరగని ముద్ర వేశారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి కీలక ప్రస్థానం
మృతితో కంటతడి పెట్టిన కార్మికలోకం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీ కార్మిక ఉద్యమ నేత యలమంచిలి వెంకటేశ్వరరావు (వైవీ రావు) మృతితో కార్మికలోకం కంటతడి పెట్టింది. మూడు దశాబ్దాలకుపైగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నాయకుడిగా ఆయన చెరగని ముద్ర వేశారు. ఈయూలో క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్రస్థాయిలో అగ్రనాయకుడిగా ఎదిగారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద జేఏసీల్లో ఒకటైన ఏపీ జేఏసీ అమరావతికి కుడి భుజంగా వ్యవహరించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, సంస్థ మనుగడ కోసం ఏకకాల పోరాటం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నిరాదరణకు గురయ్యే ఆర్టీసీని బతికించటానికి , కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి తన వంతు పాత్ర పోషించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులకు బాసటగా నిలిచారు. ఈయూను గెలిపించిన ఘనత కూడా వైవీ రావుదే. ఆర్టీసీలో సంస్కరణల కోసం ఆయన అనేక సూచనలు చేశారు. అప్పట్లో ఎండీ సురేంద్రబాబు నిర్ణయాలను స్వాగతించేవారు. ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉండటం, కార్మికుల సంక్షేమం.. ఈ రెంటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో విలీనం చేయటం తప్ప మరో మార్గం లేదని భావించారు. విలీనానంతర సమస్యలపై కూడా ఆయన సమరశంఖం పూరించారు. గతంలో ‘ఉద్యోగుల చలో విజయవాడ’ కార్యక్రమ విజయవంతంలో ఆయన వ్యూహమెంతో ఉంది. ప్రస్తుతం మరో ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధమవుతున్న సమయంలో ఆయన మృతి తీరని లోటేనంటున్నారు. గొల్లపూడిలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించిన వైవీ రావు భౌతికకాయాన్ని చూసేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ అగ్రనేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, విద్యాసాగర్‌తో పాటు అనేక ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.