రైతుబంధు పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2023-02-26T00:16:02+05:30 IST
రైతుబంధు పథకాన్ని ఏఎంసీలో పునరుద్ధరించాలని తిరువూరు ఏఎంసీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి కోరారు.

తిరువూరు, ఫిబ్రవరి 25: రైతుబంధు పథకాన్ని ఏఎంసీలో పునరుద్ధరించాలని తిరువూరు ఏఎంసీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి కోరారు. మార్కెట్ కమిటీలో శనివారం ఏఎంసీ పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గంలో సుమారు 24 పనులకు సంబంధించి రూ.6 కోట్లతో పనులకు ప్రతిపాదనలు పంపామని, వాటికి సంబంధించి ఎటువంటి అనుమతులు రాలేదు. ప్రస్తుతం 16 పనులకు సంబంధించి రూ.6 కోట్లతో పలు పనులకు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నిధులతో రైతులకు అవసరమైన ప్రాంతాల్లో రహదారులు వేసేందుకు అనుమతించాలని తీర్మానించారు. మార్కెట్ కమిటీకి ఆదాయం ఉన్నా ఎటువంటి అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం లేకుండా పోతుందని, కమిటీలకు చెక్ పవర్ లేకుండా చేయటంతో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయన్నారు. గతంలో రైతులు మార్కెట్‌లో ధాన్యం రేటు సక్రమంగా లేకపోతే ఏఎంసీ గోడౌనుల్లో నిల్వ ఉంచుకునే వారు. వారికి గోడౌనులో ఉన్న సరుకును బట్టి మూడునెలల వరకు వడ్డిలేని రుణం ఇచ్చేవారన్నారు. ధాన్యం ధర పెరిగినప్పుడు రైతులు గోడౌనులో ధాన్యం అమ్ముకొని గిట్టుబాటు ధర పొందేవారు. ప్రస్తుతం ఏఎంసీలో ఈ పథకం నిలిపివేయటంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని నాగనర్సిరెడ్డి కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.