మట్టి దొంగలు!

ABN , First Publish Date - 2023-02-10T01:38:25+05:30 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 55 కిలోమీటర్లకుపైగా పొడవునా పోలవరం కాలువ ఉంది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం కాలువలో తీసిన మట్టిని ఇరువైపులా సుమారు 30 అడుగుల ఎత్తు కొండల్లా నిల్వ ఉంచారు. ప్రభుత్వం మారిన తర్వాత మట్టి మాఫియాకు ఆదే కోట్లు కురిపించే గనిలా కనిపించింది.

మట్టి దొంగలు!

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 55 కిలోమీటర్లకుపైగా పొడవునా పోలవరం కాలువ ఉంది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం కాలువలో తీసిన మట్టిని ఇరువైపులా సుమారు 30 అడుగుల ఎత్తు కొండల్లా నిల్వ ఉంచారు. ప్రభుత్వం మారిన తర్వాత మట్టి మాఫియాకు ఆదే కోట్లు కురిపించే గనిలా కనిపించింది. జిల్లా పునర్విభజన తర్వాత నూజివీడు మండలానికి చెందిన ఎం.ఎన్‌.పాలెం నుంచి పరిధి కొంత మేర తగ్గినా, అక్కడ కూడా తవ్వకాలు మాత్రం ఆగలేదు. 30 అడుగుల ఎత్తు కొండలా ఉండే పోలవరం మట్టికట్టలు ఇప్పుడు నేలబారుమీదకు దిగిపోయాయి. ఏలూరు, గుడివాడ, పెనమలూరు చుటుపక్కల ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే గ్రావెల్‌, మట్టి లారీలు క్యూ కడుతున్నాయి.

జగనన్నకాలనీలకు తరలింపు పేరుతో.బండారిగూడెంలో జరుగుతున్న తవ్వకాలను కొందరు స్థానికులు అడ్డగిస్తే జగనన్న కాలనీల కోసం తరలిస్తున్నామని పోలవరం కట్టలను కరిగించారు. బాపులపాడు మండలంలోని జగనన్న కాలనీల్లో ఇంత వరకు మెరక చేసిందేలేదు. జాతీయ రహదారి పక్కన పెరికీడు ప్రజలకు పంపిణీ చేసిన స్థలాలు ఇప్పుడు కూడా బురదతో నిండి ఉండటమే ఉదాహరణ. ఇదే కారణంతో బిళ్లనపల్లి, రేమల్లె, వీరవల్లి, వేలేరు తదితర గ్రామల్లో స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో త్వరలోనే చెరువులు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదాయానికి గండి

నిబంధనల ప్రకారం క్యూబిక్‌ మీటరుకు గనులశాఖకు కొంత, జలవనరులశాఖకు కొంత రాయల్టీ రూపంలో చెల్లించాలి.మట్టి తవ్వకాలకు అనుమతులివ్వలేదని అధికారులు చెప్పడాన్ని బట్టి ఎక్కడా చెల్లింపులు జరగట్లేదనేది తెలుస్తోంది. గ్రావెల్‌ తవ్వకాల్లో కూడా 2 ఎకరాలకు అనుమతి తీసుకోవడం 5 నుంచి 7 ఎకరాల వరకూ తవ్వుకోవడం అనవాయితీగా మారింది. అసలు అనుమతి ఉన్న ప్రాంతంలో కొంత మేరకే తవ్వకాలు జరిపి మిగిలినదంతా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు.

మామిడి రైతుల నోట్లో మట్టి

అక్రమంగా తవ్విన మట్టి, గ్రావెల్‌ను వందలాది భారీ లారీల్లో తరలిస్తుండటంతో చుట్టుపక్కల మామిడి తోటలపై దుమ్ముపడి దిగుబడిపై ప్రభావం చూపుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తెల్లవారుజామున మంచు పడటంతో లారీలు వెళ్లేటప్పుడు లేచిన దుమ్ము ఆకులకు, పిందెలకు అతుక్కుపోతోందని, దానివల్ల దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత కూడా ఉండదని రైతు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ నిర్వాహకులను అడిగితే తమకు తెలియదంటూ సమాధానం చెబుతున్నారని, ఎదురు తిరిగితే కేసులు పెడతారనే భయంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని కొందరు మామిడి రైతులు వాపోతున్నారు. ఇంత పెద్దఎత్తున పోలవరం మట్టి, మల్లవల్లి గ్రావెల్‌ తరలిపోతున్నా జలవనరులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు తిట్టిపోస్తున్నారు.

Updated Date - 2023-02-10T01:38:27+05:30 IST