ఫిలిప్పైన్స్ నుంచి యనమలకుదురుకు వైద్య విద్యార్థి జయసూర్య మృతదేహం
ABN , First Publish Date - 2023-09-02T01:47:19+05:30 IST
ఫిలిప్పైన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ గత నెల 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యనమలకుదురుకు చెందిన అయోధ్య జయసూర్య (23) మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరింది.

పెనమలూరు, సెప్టెంబరు 1: ఫిలిప్పైన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ గత నెల 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యనమలకుదురుకు చెందిన అయోధ్య జయసూర్య (23) మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరింది. భారత ఎంబసీ అధికారులు ఫిలిప్పైన్స్ విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. మృతదేహాన్ని చూడగానే గ్రామస్థులు, బంధువులు, తల్లి శోభారాణి, తండ్రి సత్యనారాయణ, బాబాయి శ్రీనివాసరావు కన్నీరుము న్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల రోదనలతో జయసూర్య ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం జయసూర్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుటుంబంలో అందరూ ఆర్‌ఎంపీలే
జయసూర్య ముత్తాత, తాత, తండ్రి, బాబాయి అందరూ ఆర్‌ఎంపీలే. ఒక్కగానొక్క వారసుడు జయసూర్యను ఎంబీబీఎస్ చదివిద్దామని ఫిలప్పైన్స్‌లోని యూవీ గుల్లాస్ యూనివర్సిటీలో చేర్పించారు. మరో రెండు నెలల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకుని స్వదేశానికి కుమారుడు రానున్న నేపథ్యంలో తండ్రి సత్యనారాయణ ఇంటి మరమ్మతులు చేయించి ఇంటిని ముస్తాబు చేశారు. ఇంతలో బైకు ప్రమాదం శాపంలా మారి యువ వైద్యుడిని కబళించింది. ఫిలిప్పైన్స్‌లో స్థానికంగా ఉన్న ఓ హిల్ రెస్టారెంటుకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా కొండవాలు మార్గంలో స్తంభానికి తగిలి, ద్విచక్రవాహనం అదుపు తప్పి ప క్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గత నెల 20న సంఘటన జరగ్గా 12 రోజులకు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించగలిగారు. స్థానికులు, బంఽధువులు, ఆర్‌ఎంపీ సంఘం ప్రతినిఽధులు జయసూర్య కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.