కర్నూలు రైల్వేస్టేషన్‌కు మహర్దశ..!
ABN , First Publish Date - 2023-08-05T23:19:24+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరిచి, అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’లో కర్నూలు ఎంపిక
రూ.42.62 కోట్లతో పునరుద్ధరణ పనులు
వెంకటరమణ కాలనీ వైపు రెండో ద్వారం
రాష్ట్రంలో 18 స్టేషన్లు ఎంపిక
నేడు వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన
ఏర్పాట్లు పూర్తి చేసిన రైల్వే అఽధికారులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరిచి, అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 19 స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. అందులో కర్నూలు రైల్వే స్టేషన్‌కు కూడా చోటు దక్కింది. రూ.42.62 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా కర్నూలు రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు.
కర్నూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు రైల్వే స్టేషన్‌కు మహర్దశ రానుంది. నగరవాసుల దశాబ్దాల స్వప్నం వెంకటరమణ కాలనీ వైపు రెండు ప్రధాన ద్వారం (సెంకెడ్ గేట్) ఏర్పాటు కానుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో 508 స్టేషన్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 స్టేషన్లు ఎంపిక చేసి ఈ పథకం కింద రూ.2,079.29 కోట్లు భారతీయ రైల్వే శాఖ ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద కర్నూలు రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి రూ.42.62 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ముఖచిత్రం ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఆధునికీరణ చేశారు. రెండో మార్గం కూడా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఈ పనులను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దశాబ్దాల స్వప్నం సాకారం
రైల్వే స్టేషన్ వెనుక వైపు వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్, లేబర్‌కాలనీ, సంతోష్ నగర్, బాలాజీ నగర్, కప్పలనగర్ వంటి కాలనీలు విస్తరించి ఉన్నాయి. ఇదేక్రమంలో కర్నూలు సిటీ కూడా రోజురోజుకూ విస్తరిస్తోంది. రైల్వే ప్రయాణికులు స్టేషన్‌కు రావాలంటే అశోక్‌నగర్ వద్ద నున్న రైల్వే లైన్ అండర్ బిడ్జి దిగువ నుంచి లేదంటే ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఐదు రోడ్ల కూడలి మీదుగా రావాలి. వర్షం వస్తే రైల్వే లైన్ అండర్ బిడ్జిలో వర్షపు నీరు నిండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వెంకటరమణ కాలనీ వైపు ఓ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు ఎన్నో ఏళ్లుగా విన్నవిస్తున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా సెకండ్ ఎంట్రీ గేట్ ఏర్పాటు చేస్తున్నారు. పునరుద్ధరణ పనుల్లో ఇది ఎంతో కీలకమైనది. ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో రెండో ద్వారం ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఆయా సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరిచేందుకు ఏడాదినుంచి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నేడు వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోదీ శంకుస్థాపన
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద ఎంపికైన 508 రైల్వే స్టేషన్లలో పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్ పనులకు కూడా శ్రీకారం చుడతారు. ఈ మేరకు సీనియర్ డీఈఎన్ ఆధ్వర్యంలో ప్ల్లాట్ ఫారం-1లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదిక, అతిథులు కూర్చోడానికి కుర్చీలు తదితర ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ సహా జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరవుతారని రైల్వే అధికారులు వెల్లడించారు.
రాయలసీమలో కర్నూలు మాత్రమే ఎంపిక
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. రూ.42.62 కోట్లుతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు సహా అనకాపల్లి, భీమవరం టౌన్, దొనకొండ, ఏలూరు, కాకినాడ టౌన్ జంక్షన్, నరసాపురం, నిడదవోలు జంక్షన్, ఒంగోలు, పిడుగురాళ్ల, రేపల్లె, సింగరాయ్‌కొండ, తాడేపల్లి గూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి రూ.369.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాయలసీమలో జిల్లాల్లో కర్నూలు ఒక్కటే ఎంపిక కావడం విశేషం.
రోజువారి సగటు ఆదాయం రూ.2 కోట్లు
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో కర్నూలు ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వమే రైల్వేస్టేషన్ ఏర్పాటైంది. 118 ఏళ్ల చరిత్ర కలిగిన స్టేషన్ ఇది. 2013-14లో ఆనాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌గా మార్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కొలువుదీరాక రూ.28 కోట్లతో ఆధునికీకరించారు. స్టేషన్ రూపురేఖలు మార్చేశారు. ప్రస్తుతం రోజుకు 12 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సగటున నెలకు రూ.2.10 కోట్లు ఆదాయం రైల్వే శాఖకు వస్తోంది.
‘అమృత్ భారత్ స్టేషన్’తో అభివృద్ధి ఇలా...
నగరవాసుల దశాబ్దాల స్వప్నం సాకారం చేస్తూ వెంకటరమణ కాలనీ వైపు రెండవ ప్రధాన ప్రవేశ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) నిర్మాణం. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు.
తూర్పు, పడమర ద్వారాలు కలుపుతూ ఫుట్ ఓవర్ బిడ్జి నిర్మాణం. ప్రయాణికులు వివిధ ప్లాట్‌ఫారంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు.
రైల్వే స్టేషన్‌లో అనవసర నిర్మాణాలు తొలగించి సర్క్యూలేటింగ్ ప్రాంతం, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాల ఏర్పాటు.
ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు
ట్రాఫిక్ సర్య్కులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్.. వంటి పనులు చేపట్టనున్నారు.
ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ట్రాక్‌ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు, ఆధునిక ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు.
ఎంట్రన్స్‌లో ర్యాంపులు, కేఫ్ ఏరియా, రెస్ట్‌రూమ్స్ ఏర్పాటు చేస్తారు.
ఆధునిక లైటింగ్‌తో సహా స్పీడ్ వైఫై 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు.