బెడిసిన వైసీపీ వ్యూహం!

ABN , First Publish Date - 2023-02-23T23:47:43+05:30 IST

బెడిసిన వైసీపీ వ్యూహం!

బెడిసిన వైసీపీ వ్యూహం!

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవానికి సన్నాహాలు

వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ మధుసూదన్‌ నామినేషన్‌

చివరి వరకు ఒక్క నామినేషనే ఉంటుందని ఆశ

సమరానికి సై అన్న ఏపీ సర్పంచుల సంఘం నాయకులు

మధ్యాహ్నం తరువాత ముగ్గురి నామినేషన్‌

పరిశీలనలో ఉంచుతారా.. కొర్రీ పెట్టి తొలగిస్తారా..?

మరో వైపు విత్‌డ్రా చేయించేందుకూ కసరత్తు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లలో 1,022 మంది వైసీపీ వాళ్లే.. సంఖ్యా బలం లేనందున టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఇక నామినేషన్‌ వేసేదెవరని ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేల ధీమా. ఏకగ్రీవం చేసి కానుకగా ఇస్తామని సీఎం జగన్‌కు చెప్పిన అధికార పార్టీ నాయకుల వ్యూహాలకు ఏపీ సర్పంచుల సంఘం బ్రేకులు వేసింది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తే.. సర్పంచుల గోడును ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో వినిపించలేదని...శాసన మండలిలో సర్పంచులు, ఎంపీటీసీల గళం వినిపిస్తామంటూ ఏపీ సర్పంచుల సంఘం నాయకులు పెద్దల పోరుకు సై అన్నారు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. నామినేషన్ల చివరి రోజు వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ సహా స్వతంత్ర అభ్యర్థులుగా సర్పంచులు భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, కె. శ్రీనివాసులు యాదవ్‌, ఎన్‌. మోహన్‌రెడ్డి గురువారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు వేశారు.

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి కర్నూలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, గూడూరు, బేతంచర్ల మున్సిపాలిటీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 1,178 ఓటర్లలో 1,022 మందికి పైగా వైసీపీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులే. టీడీపీ పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవం అవుతుందని.. ఎవరూ పోటీ చేయకుండా వైసీపీ కీలక నేతలు వ్యూహాలు రచించారు. ఈ నెల 16 నుంచి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి నామినేషన్లు స్వీకరిస్తున్నా.. బుధవారం వరకు ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు. సోమవారం విజయవాడలో వైసీపీ అభ్యర్థిగా ఆదోనికి చెందిన డాక్టరు ఎ.మధుసూదన్‌ను ఎంపిక చేసి బీ ఫారం అందజేశారు. గురువారం చివరి రోజు ఆయన ఒక్కరే నామినేషన్‌ వేస్తారని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆశించారు. వారి వ్యూహాలకు చెక్‌ పెడుతూ సమరానికి మేము సైతం అంటూ ఏపీ సర్పంచుల సంఘ నేతలు ముందుకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, సుధాకర్‌, ఆర్థర్‌, మేయర్‌ బీవై రామయ్యలతో కలిసి వైసీపీ అభ్యర్థి మధుసూదన్‌ జేసీ చాంబర్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటుగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడికి వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటల్లోగా వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేశారు. అప్పటి వరకు ఒకే నామినేషన్‌ వచ్చింది. మధ్యాహ్నం 1.15 గంటల తరువాత సాధారణ వ్యక్తుల్లా ఏపీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, బేతంచర్ల మండలం అంబాపురం సర్పంచ్‌ కె.శ్రీనివాసులు యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, ఓర్వకల్లు మండలం గుట్టపాడు సర్పంచ్‌ ఎన్‌.మోహన్‌రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లి సర్పంచ్‌ భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి ఒక్కొక్కరుగా రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి చాంబర్‌కు చేరుకొని నామినేషన్‌ పత్రాలు అందజేశారు. దీంతో ఏకగ్రీవం చేసుకోవాలనే వైసీపీ నాయకుల వ్యూహానికి చెక్‌ పడినట్లయింది.

ఆమోదిస్తారా.. తిరస్కరిస్తారా?

స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన సర్పంచులు కె.శ్రీనివాసులుయాదవ్‌, ఎన్‌.మోహన్‌రెడ్డి, భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌లో జారీ చేసిన నిబంధనల ప్రకారమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన ఈ ముగ్గురూ ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన ఓటరు సర్టిఫైడ్‌ పత్రం జత చేయలేదు. నామినేషన్ల పరిశీలన రోజు శుక్రవారం 11 గంటల్లోగా ఆ పత్రాన్ని ఆర్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. ఈఆర్‌ఓలు సర్టిఫైడ్‌ పత్రం ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా ఆ పత్రాలు ఇవ్వని పక్షంలో అభ్యర్థుల నామినేషన్లను ఆమోదిస్తారా..? తిరస్కరిస్తారా అన్నది సర్పంచుల సంఘం నాయకులను వెంటాడుతున్న ఆందోళన. అంతేకాదు.. బెదిరింపులు.. బుజ్జగింపులు, బేరసారాలు.. ఎలాగైనా సరే స్వతంత్రులుగా నామినేషన్లు వేసిన సర్పంచులను విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. మరో పక్క పోలీసులను కూడా రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ సమాచారం.

నలుగురు... ఆరు సెట్ల నామినేషన్లు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం చివరి రోజు వైసీపీ అభ్యర్థి సహా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన వైసీపీ అభ్యర్థి మధుసూదన్‌ ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసి వారితో పాటే వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1.45 - 2 గంటల మధ్యలో ఒక్కడే వచ్చి రెండో సెట్‌ నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడం గమనార్హం.

పంచాయతీలను నిర్వీర్యం చేశారు

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసింది, సర్పంచులు, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. వీధి లైట్లు, తాగునీటి పైపులు మరమ్మతులు చేసేందుకు ఒక్క పైసా నిధులు లేవు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం కేంద్రం ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేస్తోంది. ఇందులో భాగంగానే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,660 కోట్లు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు జమ చేస్తే.. సర్పంచులకు కనీస సమాచారం లేకుండా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదు. శాసన మండలిలో సర్పంచులు, ఎంపీటీసీల గోడు వివిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాం.

- కె.శ్రీనివాసులు యాదవ్‌, ఎన్‌.మెహన్‌రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు

Updated Date - 2023-02-23T23:47:54+05:30 IST