YCP Leader : చెత్త నా కొ.. సీఐపై దౌర్జన్యం
ABN , First Publish Date - 2023-05-25T02:26:46+05:30 IST
కర్నూలు నగరంలో వైసీపీ మార్కు దౌర్జన్యం, అరాచకం కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు కడప జిల్లా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున కర్నూలులో మకాం వేసిన సంగతి తెలిసిందే.

కర్నూలు సీఐపై వైసీపీ నేత దూకుడు!
అవినాశ్ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని అన్నందుకు ఆగ్రహం
పోలీసు అధికారిపైకే వెళ్లిన వైనం.. తలదించుకుని వెళ్లిపోయిన సీఐ
నిశ్చేష్టులైన అధికారులు, పోలీసులు.. కర్నూలులో వైసీపీ మార్కు దాడి!
విశ్వభారతి ఆస్పత్రి వద్ద కడప కార్యకర్తల తిష్ఠ.. రోడ్డుపై బైఠాయింపు
అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడు టీ హైకోర్టులో విచారణ
కర్నూలు, మే 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో వైసీపీ మార్కు దౌర్జన్యం, అరాచకం కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు కడప జిల్లా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున కర్నూలులో మకాం వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారంతా కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రి వద్ద షిఫ్టులవారీగా ఆందోళన చేస్తున్నారు. ఆ ఆస్పత్రి ఉన్న గాయత్రి ఎస్టేట్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్క్ ఆస్పత్రి కూడలి వద్ద విధుల్లో ఉన్న కర్నూలు నగరానికి చెందిన ఓ సీఐ.. మాటల సందర్భంలో అవినాశ్ తల్లి ఆర్యోగం బాగానే ఉందని, టెన్షన్ పడక్కర్లేదని వ్యాఖ్యానించారు. దీంతో కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడొకరు రెచ్చిపోయాడు. ‘చెత్త నా కొ..’ అంటూ రాయడానికి వీలుకాని మాటలతో దూషించాడు. ‘పెతోడూ కామెంట్ చేసేటోడే.. మళ్లీ ఆ మాటలనూ..’ అంటూ సీఐ మీదకు వెళ్లబోయాడు. చేసేది లేక ఆ సీఐ తలదించుకుని ఆర్క్ ఆస్పత్రిలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో అక్కడే విధులు నిర్వరిస్తున్న సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది నిశ్చేష్టులయ్యారు.
ఇలాంటివారికా తాము బందోబస్తు కల్పిస్తోంది అంటూ వారు చర్చించుకోవడం కనిపించింది. సీఐని దూషించిన వైసీపీ నాయకుడు ఆ తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక గాయత్రి ఎస్టేట్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కడప జిల్లా వైసీపీ కార్యకర్తలే. ఆ పరిసరాల్లో ఎలాంటి ఫొటోలు తీయకుండా పులివెందులకు చెందిన కొందరు ప్రత్యేక నిఘా పెట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎవరైనా సెల్‌ఫోన్ పైకెత్తగానే.. పదుల సంఖ్యలో మూకుమ్మడిగా వారిని చుట్టుముడుతున్నారు.
వారి తీరుతో సామాన్య జనంపాటు వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు బెంబేలెత్తుతున్నారు. కాగా.. అవినాశ్‌రెడ్డి బుధవారం కూడా ఆస్పత్రి నుంచి బయటకు రాలేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, డాక్టరు సుధాకర్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, వివేకా చెల్లెలు వైఎస్ విమలమ్మ తదితరులు ఆయన్ను కలిశారు. మరోవైపు.. ‘అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మానవత్వంతో ఆలోచించండి.. అరెస్టు చేయకుండా కొంత సమయం ఇవ్వండి..మేం కూడా సీబీఐకి పూర్తిగా సహకరిస్తాం’ అంటూ కర్నూలు,కడప జిల్లాల నగర పాలక సంస్థలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆస్పత్రి ముందు ప్లకార్డులతో ధర్నా చేయడం కొసమెరుపు. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందంలో ఇద్దరు మినహా అంతా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఇక కర్నూలులో లాడ్జిలన్నీ నిండిపోయాయి.