Telugu: తెలుగు రాదు.. అంకెలు తెలియవు!

ABN , First Publish Date - 2023-01-19T03:39:31+05:30 IST

ఇంగ్లీష్‌ మీడియంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న మమకారంతో రాష్ట్ర విద్యార్థులు తెలుగును మర్చిపోయే దుస్థితికి తీసుకొచ్చింది.

Telugu: తెలుగు రాదు..  అంకెలు తెలియవు!

ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి పిల్లల దుస్థితి

తెలుగు అక్షరాలు కూడా గుర్తుపట్టలేని దైన్యం

1 నుంచి 7వ తరగతి వరకూ ఇదే పరిస్థితి

తెలుగు కంటే ఇంగ్లీషులోనే స్వల్పంగా మెరుగు

తీసివేతలు రాని 3వ క్లాసు విద్యార్థులు 46.7%

ప్రభుత్వ విద్యార్థులకూ పెయిడ్‌ ట్యూషన్లు: అసర్‌

ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి పిల్లల దుస్థితి

వారంతా తెలుగు విద్యార్థులే. నూటికి నూరు శాతం మందికి తెలుగే మాతృభాష. అయినా వారిలో కొందరికి తెలుగు చదవడమే రాదు. మరికొందరయితే అసలు తెలుగు వర్ణమాలను కూడా గుర్తించలేరు. వీరికున్న ఆంగ్ల పరిజ్ఞానమూ అంతంతమాత్రమే. 1 నుంచి 9 వరకూ అంకెలు తెలియనివారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇక తీసివేతలు, భాగాహారాల సంగతి సరేసరి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రతి క్లాస్‌లోనూ ఇలాంటి పిల్లలు ఉన్నారని ప్రముఖ అధ్యయన సంస్థ అసర్‌ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామంటూ వైసీపీ సర్కారు చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేటతెల్లమైంది.

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఇంగ్లీష్‌ మీడియంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న మమకారంతో రాష్ట్ర విద్యార్థులు తెలుగును మర్చిపోయే దుస్థితికి తీసుకొచ్చింది. ఆంగ్లంతో పోలిస్తే మాతృభాష తెలుగును చదవడంలో ఏపీ విద్యార్థులు వెనుకబడిపోయారు. ప్రముఖ అధ్యయన సంస్థ యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌(అసర్‌) బుధవారం విడుదల చేసిన వార్షిక విద్యా స్థితి నివేదిక-2022లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి విద్యార్థులు 43.3 శాతం మంది తెలుగు అక్షరాలు చదవలేకపోతున్నారు. రెండో తరగతిలో 21శాతం, మూడులో 12.6శాతం, నాలుగులో 6.9శాతం, ఐదులో 3.8 శాతం, ఆరులో 4.6శాతం, ఏడులో 4.6శాతం, ఎనిమిదో తరగతిలో 2.7శాతం మందిది సైతం ఇదే పరిస్థితి. ఇంగ్లీషులో... ఒకటో తరగతిలో 36.5శాతం, రెండులో 18.7 శాతం, మూడులో 11.6శాతం, నాలుగులో 5.3శాతం, ఐదులో 3.8శాతం, ఆరులో 3.2శాతం, ఏడులో 1.6శాతం, ఎనిమిదో తరగతిలో 1.8శాతం మంది ఇంగ్లీష్‌ అక్షరాలను చదవలేని వారున్నారు.

ఇలా దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు. ఇక మూడో తరగతి విద్యార్థులను తీసుకుంటే 24.3శాతం మంది అక్షరాలను చదవగలిగినా, పదాలు చదవలేకపోతున్నారు. 36.2 శాతం మంది పదాలు చదివినా, ఒక మోస్తరు వాక్యాలను, 10.4 శాతం మంది పేరాలు చదవలేని స్థితిలో ఉన్నారు. అదే లెక్కలు తీసుకుంటే మూడో తరగతిలో... 7.2శాతం మంది విద్యార్థులు 1 నుంచి 9 వరకు అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు. 12.4 శాతం మందికి 99 వరకు అంకెలు తెలియడం లేదు. 46.7శాతం తీసివేతలు చేయలేకపోతున్నారని, 29.5శాతం మందికి భాగాహారాలు ఎలా చేయాలో తెలియదని నివేదిక తెలిపింది. ఇక 8వ తరగతిలోనూ 9వరకు అంకెలను గుర్తించలేనివారు 1.7శాతం మంది ఉన్నారు.

ఇంగ్లీషు... కొన్ని బడుల్లోనే...

రాష్ట్రంలో ఎక్కడో ఒక పాఠశాలలో విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడటం చూపించి రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రచారమంతా అవాస్తవమని తాజా నివేదికతో తేలిపోయింది. రాష్ట్రంలోని విద్యార్థులు తెలుగు కంటే ఇంగ్లీషులోనే మెరుగ్గా ఉన్న విషయం వాస్తవమే అయినా వారి సంఖ్య కూడా అంతంతమాత్రమే అని అసర్‌ తేల్చింది. ఒకటో తరగతిలో ఇంగ్లీషులో చిన్న అక్షరాలను గుర్తించలేని విద్యార్థులు ఏకంగా 20.1శాతం,. రెండో తరగతిలో 16శాతం, మూడులో 11.4 శాతం మంది ఉన్నారు. ఇక సులభమైన పదాలను గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు. ఒకటో తరగతిలో 28.4శాతం, రెండులో 29.1శాతం, మూడులో 24.3శాతం మందికి చిన్న పదాలు చదవలేక పోతున్నారు. సులభమైన పదాలు తెలిసినా సులభమైన వాక్యాలు తెలియని వారు ఒకటో తరగతిలో 13శాతం, రెండులో 28.3శాతం, మూడులో 37.6శాతం, నాలుగులో 38.3శాతం, ఐదులో 35శాతం, ఆరులో 28.7శాతం, ఏడులో 24.4శాతం, ఎనిమిదిలో 18.9శాతం మంది ఉన్నారు. దీంతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఇంగ్లిష్‌ ప్రచారం కొన్ని పాఠశాలలకే పరిమితమైందని అర్థమవుతోంది.

భారీగా ప్రైవేటు ట్యూషన్లకు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా చాలామంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారు. ఒకటో తరగతిలో 15.7శాతం మంది, రెండులో 17.6శాతం, మూడులో 15.7శాతం, నాలుగులో 17.3శాతం, ఐదులో 18.2శాతం, ఆరులో 14.9శాతం, ఏడులో 16.9శాతం, ఎనిమిదిలో 15.1శాతం మంది నగదు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఇక 14.1శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20.3శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని ఆ నివేదిక వివరించింది. 14.5శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయని తెలిపింది. 19.6శాతం పాఠశాలల్లో లైబ్రరీలు లేవని, 75.9శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు లేవని, 18.5శాతం పాఠశాలల్లో పీఈటీలు లేరని అసర్‌ నివేదిక వివరించింది.

Updated Date - 2023-01-19T04:16:31+05:30 IST