యువ క్రేజ్
ABN , First Publish Date - 2023-07-29T01:06:56+05:30 IST
‘జై యువగళం.. జైజై లోకేష్’ అన్న నినాదాలు మిన్నంటాయి. యువగళం పాదయాత్రకు శుక్రవారం అనూహ్య స్పందన లభించింది.

లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన
ఒంగోలులో మిన్నంటిన నినాదాలు
సెల్ఫీ కోసం యువత, మహిళలు పోటీ
గ్రానైట్ పరిశ్రమ వర్గాలతో సమావేశం
శభాష్ అంటూ దామచర్లకు అభినందన
త్రోవగుంట వద్ద 2,200కి.మీ శిలాఫలకం ఆవిష్కరణ
ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి హామీ
ఏడుగుండ్లపాడు వద్ద ఎస్‌ఎన్‌పాడు శ్రేణుల వినూత్న స్వాగతం
పూలజల్లు కురిపించిన మహిళలు
ఒంగోలు ఏఎంసీ, కొష్టాలు వద్ద రైతులతో భేటీ
‘జై యువగళం.. జైజై లోకేష్’ అన్న నినాదాలు మిన్నంటాయి. యువగళం పాదయాత్రకు శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. 168వ రోజు యాత్ర ఒంగోలు నుంచి 19 కిలో మీటర్ల దూరం సాగి రాత్రి గుండ్లాపల్లి విడిది కేంద్రంలో బసకు వెళ్లే వరకు హోరెత్తింది. హైవేపై యాత్ర సాగుతున్న సమయంలో రెండో వైపున వెళ్లే వాహనాలు 95శాతం ఆగి అందులోని ప్రయాణికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు లోకేష్‌కు అభివాదం చేస్తూ చేతులూపుతున్న దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి. ఆరంభంలో గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధులు, ఆపై యువత.. 2,200 కి.మీ శిలాఫలకం ఆవిష్కరణ తర్వాత దళితవర్గం, అనంతరం రైతులు, మహిళలు.. చివర్లో కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలు పాదయాత్రకు ఎదురేగి వారివారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. సెల్ఫీల కోసం పోటీపడ్డ అభిమానులను సమయాభావంతో లోకేష్ సంతృప్తిపరచలేకపోయారంటే యువనేత క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ అందుకు కేటాయించిన గంట సమయాన్ని రెండు గంటలకు పెంచినా ఇంకా వేలమంది మిగిలిపోయారు. ఇంత రద్దీలోనూ చెరగని చిరునవ్వుతో అందరినీ పలుకరించారు. గ్రానైట్ పరిశ్రమకు పూర్వవైభవం తేవడంతోపాటు జిల్లాను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని లోకేష్ ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
యువగళం పాదయాత్ర 168వ రోజైన శుక్రవారం ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాలలో కొనసాగింది. ఒంగోలు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంలో కీలకభూమిక పోషించిన దామచర్ల జనార్దన్‌ను లోకేష్ అభినందిస్తూ శభాష్ డీజే అంటూ కొనియాడారు. ఆ తర్వాత తిరిగి ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించగానే మద్దిపాడు, ఎన్‌జీపాడు మండలాలకు చెందిన పార్టీశ్రేణులతో విజయకుమార్, ఆయన వెంట మండవ రంగారావు, వీరయ్య, జయంత్‌బాబు ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వరకు అశేష జనసందోహం మధ్య యాత్ర సాగింది. ఈ మొత్తం యాత్రలో లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో కలిసి వారి సమస్యలను వివరించారు. పార్టీ, తరతమ భేదాలకు అతీతంగా ఆయావర్గాల ప్రతినిధులు లోకేష్‌ను కలిసిన వారిలో కనిపించడం విశేషం. గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధుల సమావేశంలోనూ అలా తరతమబేధాలకతీతంగా హాజరవడం కనిపించింది. సీతారాంపురం కొష్టాలు వద్ద పొగాకు, ఇతర పంటల రైతుల సమావేశం లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇక త్రోవగుంట, ఏడుగుండ్లపాడుల వద్ద దళితవర్గానికి చెందిన వారు అధికంగా పాదయాత్రకు ఎదురేగి లోకేష్‌ను కలిశారు. దొడ్డవరప్పాడు, వెల్లంపల్లి వద్ద మహిళలు పెద్దసంఖ్యలో యువనేత లోకేష్‌పై పూలవర్షం కురిపించారు. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ వద్దకు వెళ్లేసరికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా లోకేష్‌కు స్వాగతం చెప్పినవారిలో ఉండటాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
గ్రానైట్ ప్రతినిధులతో భేటీ
ఒంగోలులోని విడిది కేంద్రంలో జరిగిన గ్రానైట్ ప్రతినిధుల భేటీలో లోకేష్ వారి సమస్యల పరిష్కారంపై నిర్ధిష్టమైన హామీలిచ్చారు. శ్రీనివాసరావు అనే ఒక చిన్నపరిశ్రమ యజమాని విద్యుత్ వినియోగానికి బదులు డీజిల్ వాడుతున్నామన్న కారణాన్ని చెప్పి రూ.14 కోట్ల జరిమానా విధించిన అంశాన్ని లోకేష్ దృష్టికి తెచ్చారు. రాంబాబు అనే ట్రాన్స్‌పోర్టు లారీల యజమాని వైసీపీ ప్రభుత్వం మార్చిన విధానాలతో లారీలు అమ్మేసుకుని వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని వివరించారు. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో పాలిషింగ్ యూనిట్లు, ఇతర అనుబంధ పరిశ్రమలు నడిపే బసవన్నపాలెంకు చెందిన పలువురు విద్యుత్‌చార్జీల పెంపు, శ్లాబ్ విధానం, ఇప్పుడు మరో కొత్త విధానం పేరుతో పరిశ్రమ ఎలా కునారిల్లుతుందో సవివరంగా తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పాత పాలసీలనే అమలుచేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి వేలమంది హాజరయ్యారు.
శిలాఫలకం ఆవిష్కరణ
ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద పాదయాత్ర 2,200 కిలోమీటర్లు దూరం పూర్తయినందుకు గుర్తుగా శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఒంగోలుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ హామీ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆ పథకాన్ని చేపడతామని లోకేష్ ప్రకటించారు.
సమస్యలు విన్నవించిన రైతులు
సీతారాంపురం కొష్టాలు వద్ద పొగాకు రైతులు లోకేష్‌ను కలిశారు. జయంత్‌బాబు, అబ్బూరి శేషగిరిరావు తదితరుల ఆధ్వర్యంలో పొగాకు పంటను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలోకి చేర్చాలని కోరారు. అంతకు ముందు ఒంగోలు ఏఎంసీ వద్ద కలిసిన రైతు ప్రతినిధులు సుబాబుల్, జామాయి ల్ రైతులను ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ ప్రభు త్వం రాగానే టన్నుకి రూ.5వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఫార్మా హబ్‌గా జిల్లా
పాదయాత్ర ఆరంభంలో యువతీ యువకులు కలిసి నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. లోకేష్ మాట్లాడుతూ ప్రకాశంను ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో దొడ్డవరప్పాడు, వెల్లంపల్లి వద్ద మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి లోకేష్‌పై పూలవర్షం కురిపించారు. కార్మికులు ఎదురేగి స్వాగతం పలికారు. ఏడుగుండ్లపాడు వద్ద లోకేష్ పాదయాత్ర తిరిగి ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడ దళితులు పెద్దసంఖ్యలో హాజరై ఎదురేగి స్వాగతం పలికారు. దళితవాడకు చెందిన ప్రజలు లోకేష్‌కు, విజయ కుమార్‌కు కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మండల కేంద్రమైన మద్దిపాడులోనూ అఖండ స్వాగతం లభించింది.