Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

ABN , First Publish Date - 2023-08-08T11:32:25+05:30 IST

పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు.

Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

విజయవాడ: పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ (NTR) ఆశయమని టీడీపీ నేత కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) అన్నారు. మంగళవారం కృష్ణలంక ఐస్ ఫాక్టరీ వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో (MLA Gadde Rammohan) కలిసి కేశినేని చిన్ని ప్రారంభించారు. మెడికల్ క్యాంపుకు పెద్దఎత్తున పేదప్రజలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులకు విశేష స్పందన అందుతోందన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.


పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాదని.. వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి వైద్యం కూడా అందిస్తామని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీలకతీతంగా కొనసాగుతాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-08T11:32:25+05:30 IST