వైసీపీకి మరో కార్పొరేటర్ షాక్
ABN , First Publish Date - 2023-12-10T01:00:23+05:30 IST
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక కార్పొరేటర్ రాజీనామా చేశారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ రాజీనామా
ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ పదవికి కూడా...
ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలుపు...ఆ తరువాత అధికార పార్టీలో చేరిక
అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీలో లేఖ ఇస్తే అవి జరగకుండా ఎమ్మెల్యే వాసుపల్లి అడ్డుకుంటున్నారని ఆరోపణ
ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదు
అభివృద్ధి జరగని, మాటకు విలువలేని పార్టీలో ఉండలేనని వ్యాఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక కార్పొరేటర్ రాజీనామా చేశారు. 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ వైసీపీ సభ్యత్వానికి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి అందజేయనున్న లేఖను శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందిన తాను...తర్వాత వార్డును అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానన్నారు. పార్టీలో చేరిన తర్వాత తనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నామినేటెడ్ పోస్టు కూడా కేటాయించారన్నారు. అయితే తన వార్డు పరిధిలోనూ, వన్‌టౌన్‌లోనూ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీలో లేఖలు అందజేస్తుంటే అందుకు వ్యతిరేకంగా లేఖలు ఇచ్చి ఆ పనులు జరగకుండా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వాసుపల్లి తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలి కారణంగా పార్టీ కేడర్ కూడా ఇబ్బందులు పడుతోందన్నారు. దీనిపై ఎన్నోసార్లు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు ఫిర్యాదు చేశానన్నారు. అయినా ఇంతవరకూ ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీ పట్ల విసుగుచెందానన్నారు. మాటకు విలువలేనిచోట, వార్డులో కనీసం అభివృద్ధి చేయలేని పార్టీలో ఉండడం వల్ల ఉపయోగం లేదనే భావనతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. నియోజకవర్గంలోని మరికొందరు కార్పొరేటర్లు కూడా త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. దక్షిణ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ముస్లింలు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, కానీ ఇప్పుడు కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు.
అదే బాటలో మరికొందరు కార్పొరేటర్లు
మరికొంతమంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. కందుల నాగరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన తర్వాత వైసీపీలో చేరారు. రెండున్నరేళ్లు గడిచిన తర్వాత ఆ పార్టీలో ఇమడలేక జనసేనలో చేరారు. తాజాగా 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ కూడా వైసీపీకి రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే వాసుపల్లి వ్యవహారశైలితోపాటు అతనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధిష్ఠానం పట్టించుకోకపోవడం, వార్డులో అభివృద్ధి చేసే పరిస్థితి లేకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదిలావుండగా దక్షిణ నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, పశ్చిమ నియోజక వర్గానికి చెందిన ఒక కార్పొరేటర్ త్వరలో వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తుండడమే దీనికి కారణంగా వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులు భారీగా ఉండవచ్చునని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.