వెన్నెలపాలెంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-10-03T01:58:26+05:30 IST
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు నేపథ్యంలో ఆయన స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
అరెస్టు చేస్తారనే సమాచారంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రాక
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు చేయడానికి వచ్చినట్టు సీఐ వెల్లడి
నోటీసులు ఇవ్వకుండా అరెస్టు ఎలా చేస్తారంటూ నేతలు నిలదీత
పలుమార్లు పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం
సాయంత్రం గుంటూరు నుంచి పోలీసులు రాక
బండారుకు నోటీసులు, అరెస్టు
ఆయన వాహనంలోనే గుంటూరు తరలింపు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు నేపథ్యంలో ఆయన స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వందలాది మంది పోలీసులు బండారు ఇంటిని చుట్టుముట్టడం, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నడుమ పలుమార్లు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. చివరకు గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు రాత్రి ఎనిమిది గంటలకు బండారును అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో సుమారు 20 గంటలపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే...
బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెన్నెలపాలెం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ సురేశ్, పోలీసు సిబ్బందితో బండారు నివాసానికి చేరుకున్నారు. తొలుత బండారు మొబైల్‌కు ఫోన్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ప్రధాన గేట్లు తట్టారు. కొద్దిసేపటి తరువాత డీఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో బండారు సత్యనారాయణమూర్తి...టీడీపీకి చెందిన పలువురు నాయకులకు ఫోన్లు చేసి, తన ఇంటికి పోలీసులు వచ్చారని సమాచారం ఇచ్చారు. మరో గంటసేపటికల్లా పలువురు నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి చేరుకున్నారు. అక్కడ వున్న పోలీసులను చూసి ఈ సమయంలో ఎందుకు వచ్చారని వాకబు చేశారు. మంత్రి ఆర్‌కే రోజాను ఉద్దేశించి ఇటీవల బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు వేరే ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, దీంతో ఆయనను అరెస్టు చేయడానికి వచ్చినట్టు చెప్పారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, పైగా అర్ధరాత్రిపూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో పోలీసు అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు..అక్కడి నుంచి వెళ్లలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయానికి వందలాది మంది కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు సైతం అదనపు బలగాలను రప్పించారు. సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, మండలస్థాయి నాయకులు వెన్నెలపాలెం రావడం మొదలుపెట్టారు. మరోవైపు బండారు ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా మహిళలు, కార్యర్తలు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. బండారును అరెస్టు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సీఎం డౌన్ డౌన్, సైకో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు (మంత్రి రోజూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని బండారు సత్యనారాయణమూర్తిపై గుంటూరు నగరంలోని రెండు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి) బండారు ఇంటిలోకి వెళ్లి ఆయనతోపాటు టీడీపీ నేతలతో చర్చించారు. అనంతరం 41బీ, 41ఏ నోటీసులు అందజేయగా వాటిని బండారు పరిశీలించారు. తరువాత అరెస్టు చేస్తున్నట్టు చెప్పి రాత్రి ఎనిమిది గంటల సమయంలో బండారు వాహనంలోనే ఆయనను ఎక్కించుకుని గుంటూరుకు బయలుదేరారు. ఈ సమయంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళలు అడ్డుకోవడానికి యత్నించగా పోలీసులు నెట్టివేశారు.
అంబులెన్స్‌ను అడ్డుకున్న పోలీసులు
ఇదిలావుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బండారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బీపీ 250కిపైగా పెరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బండారుకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లో సిబ్బంది వచ్చారు. కానీ పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకుని బండారు ఇంటిలోకి వెళ్లనివ్వలేదు. వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ వైద్యులకు సమాచారం ఇవ్వాలన్నారు. దీంతో బండారు ఇంటి లోపల వున్న అయ్యన్నపాత్రుడు, బుద్ద నాగజగదీశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జీ, తదితరులు బయటకు వచ్చి పోలీసుల తీరుపై నిరసన వ్యక్తంచేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గంటల తరబడి బండారు సత్యనారాయణమూర్తిని, కుటుంబ సభ్యులను గృహనిర్బంధం చేయడం ఏమిటని ప్రశ్నించారు.