జగనన్న లేఔట్లలో అనుమతిలేని ఇళ్లు
ABN , First Publish Date - 2023-07-25T00:31:34+05:30 IST
జగనన్న లేఔట్లలోని ఖాళీ స్థలాలు కొందరు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పొజిషన్ పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని వాటిని విక్రయిస్తున్నారు. జగనన్న లేఅవుట్ల పేరిట ప్రభుత్వం భారీగా స్థలాలను సేకరించింది. వీటిలో కొన్నిచోట్ల ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా.. చాలాచోట్ల ఖాళీగా ఉన్నాయి.

స్థలాలను అమ్ముకున్న కొందరు వైసీపీ నేతలు
సారికలో గృహ నిర్మాణాల కూల్చివేత
బి బ్లాక్‌లో అమ్మకాలు జరిగినట్లు ఆరోపణలు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
‘విజయనగరం నియోజకవర్గంలో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాలు, పొజిషన్ పట్టాల చెలామణిలో ఉంటున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు సమగ్ర సమగ్ర దర్యాప్తు చేయాలి’
- ఈనెల 22న విజయనగరం నియోజకవర్గ సమీక్షలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రకటన ఇది.
జగనన్న లేఔట్లలోని ఖాళీ స్థలాలు కొందరు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పొజిషన్ పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని వాటిని విక్రయిస్తున్నారు. జగనన్న లేఅవుట్ల పేరిట ప్రభుత్వం భారీగా స్థలాలను సేకరించింది. వీటిలో కొన్నిచోట్ల ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా.. చాలాచోట్ల ఖాళీగా ఉన్నాయి. ఇవే కొందరు వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న గ్రామాలు, ప్రధానరోడ్లను ఆనుకుని ఉన్న లేఔట్లలో సెంటు రూ.3 లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు పలుకుతోంది. కొనుగోలు చేసేవారికి అధికారికంగా హక్కు ఉండదు. దీంతో తాను ప్రజాప్రతినిధినని, పొజిషన్ పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శృంగవరపుకోట నియోజకవర్గంలో రియల్‌ఎస్టేట్ వెంచర్లలో ప్రభుత్వ భూముల చిట్టా వ్యవహారంపై అధికార పార్టీ నాయకుల మధ్య వివాదం నడిచింది.
సారిక గ్రామంలో కూల్చివేత
విజయనగరం నియోజకవర్గం సారిక గ్రామంలో లబ్ధిదారుల కోసం సేకరించిన మిగులు భూమిలో అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమైంది. దీంతో ఈ ఇళ్లను సోమవారం రెవెన్యూశాఖ వారు కూల్చివేశారు. విజయనగరానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. విజయనగరం మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పనాయుడు స్వగ్రామం కూడా. ఇక్కడి ఇంటి స్థలాలకు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడి జగనన్న లేఅవుట్లో ఏ, బీ బ్లాకులు ఉన్నాయి. బీ బ్లాక్‌లో స్థలం ఖాళీగా ఉంది. ఇక్కడే స్థానికేతరులకు వైసీపీ నాయకులు అమ్ముకున్నట్లు సర్పంచ్ ఈశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ రివ్యూలో అనధికార ఇళ్ల నిర్మాణాలపై చర్చించారు. అయితే సారిక గ్రామాన్ని ప్రస్తావించలేదు. ఎమ్మెల్యేనే ఈ ఇళ్ల విషయం ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ఉంటారని చర్చసాగుతోంది. అయితే సారిక గ్రామం ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఇంకా రానివి చాలానే ఉంటాయని తెలుస్తోంది. స్వగ్రామం సారిక గ్రామం. అయితే దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు.