Bharti Airtel: వినియోగదారులకు ఎయిర్‌టెల్ షాక్!
ABN , First Publish Date - 2023-03-13T21:48:06+05:30 IST
దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) వినియోగదారులకు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) వినియోగదారులకు షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ టారిఫ్ రేట్లను పెంచేసింది. మిగిలిన మూడు సర్కిళ్లు.. గుజరాత్, కోల్‌కతా, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ సర్కిళ్లలో తాజాగా ఎంట్రీ లెవల్ టారిఫ్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రూ. 155 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్న మొత్తం సర్కిళ్ల సంఖ్య 22కు పెరిగింది. గతేడాది నవంబరులో హర్యానా, ఒడిశా సర్కిళ్లలో మొదటిసారి టారిఫ్ పెంపును అమలు చేసింది. అక్కడ అప్పటి వరకు ఉన్న రూ.99 రీచార్జ్ ప్యాక్‌ను ఉపసంహరించుకుంది.
తొలుత రెండు సర్కిళ్లలో ప్రారంభించిన పెంపు ఆ తర్వాత 15 సర్కిళ్లకు, ఇప్పుడు 22 సర్కిళ్లకు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్ర, కేరళలో రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపసంహరించుకుని ఎంట్రీలెవల్ రీచార్జ్ ప్లాన్ రూ. 155ను ప్రవేశపెట్టింది. రూ. 99 ప్లాన్‌తో వినియోగదారులకు 28 రోజల కాలపరిమితి లభించేది.
రూ. 155 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ ప్రయోజనాలు, 1జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు 24 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అలాగే, వింక్ మ్యూజిక్, ఫ్రీ హలో ట్యూన్స్ అదనంగా లభిస్తాయి. 300 ఎస్సెమ్మెస్‌లను వినియోగించుకున్న తర్వాత ఒక్కో లోకల్ ఎస్సెమ్మెస్‌కు రూపాయి, ఎస్టీడీ ఎస్సెమ్మెస్‌లకు అయితే రూ. 1.50 వసూలు చేస్తుంది. డేటాకైతే ఒక్కో ఎంబీకి 50 పైసలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు ఇప్పుడు 265 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. జమ్ము నుంచి కన్యాకుమారి వరకు దాదాపు ప్రతి పెద్ద పట్టణంలోనూ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.