Budget2023: రాకెట్లలా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్‌లో ఈ ఒక్క ప్రకటనే కారణం!
ABN , First Publish Date - 2023-02-01T13:16:28+05:30 IST
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బడ్జెట్ 2023-24 (Budget2023-24) జోష్ నింపింది. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుతోపాటు ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకపోవడంతో సూచీలు రాకెట్లలా దూసుకెళ్తున్నాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బడ్జెట్ 2023-24 (Budget2023-24) జోష్ నింపింది. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి (personal tax exemption) పెంపుతోపాటు ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకపోవడంతో సూచీలు రాకెట్లలా దూసుకెళ్తున్నాయి. ట్యాక్స్ స్లాబుల సవరణ సానుకూలమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1200 పాయింట్లకుపైగా లేదా 2 శాతం మేర వృద్ధి చెంది 60,750 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. మరో సూచీ ఎన్ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) ఏకంగా 300 పాయింట్లు లేదా 1.70 శాతం ఎగబాకి 17,965 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఎల్‌అంట్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌బీసీసీ, గెయిల్, ఎస్‌బీఐఎన్, పీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, ఎన్ఎల్‌సీఐఇండియా, నేషనల్ అల్యూమినియం వంటి షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బడ్జెట్ 2023-24లో (Budget 2023-24) వేతన జీవులకు గొప్ప ఊరట కలిగించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు...
- 0 నుంచి రూ. 3 లక్షలు - సున్నా
- రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు - 5 %
- రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు - 10%
- రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు - 15%
- రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు - 20%
- రూ. 15 లక్షల పైబడిన ఆదాయం - 30%