TRAI: దేశంలోని టెలికం ఆపరేటర్ల ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌లకు కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2023-02-18T20:17:15+05:30 IST
టెల్కోలతో శుక్రవారం సమావేశమైన ట్రాయ్ సేవల్లో మెరుగుదల పెంచాల్సిందేనని, అందుకు అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలని
న్యూఢిల్లీ: జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel), వొడాఫోన్ ఐడియా (Vi)లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. సేవల్లో నాణ్యతను అర్జెంటుగా పెంచాలని అందులో పేర్కొంది. టెల్కోలతో శుక్రవారం సమావేశమైన ట్రాయ్ సేవల్లో మెరుగుదల పెంచాల్సిందేనని, అందుకు అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలని కోరింది.
ఫోన్ మాట్లాడుతుంటే మ్యూట్ అయిపోవడం, కాల్ మధ్యలో కట్ అవడం, ఒకవైపే వినిపిస్తుండడం వంటి సమస్యలను ఖాతాదారులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దేశంలో 5జీ(5G) సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (TSPs)తో సమావేశమైన ట్రాయ్ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని, సేవల్లో నాణ్యత పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది.
దీర్ఘకాలిక నెట్‌వర్క్ అంతరాయాలు వినియోగదారుల నెట్‌వర్క్ అనుభవాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొన్న ట్రాయ్.. ఏదైనా రాష్ట్రం, లేదంటే జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తమకు ఆ విషయాన్ని నివేదించాలని ప్రొవైడర్లను కోరింది. సేవల నాణ్యతను 24x7 ప్రాతిపదికన పర్యవేక్షించే అంతర్గత వ్యవస్థలను తీసుకురావాలని ఆదేశించింది.