‘డ్రంక్ అండ్ ఓట్’కూ బ్రీత్ ఎనలైజర్లు కావాలి కదా?
ABN , First Publish Date - 2023-08-29T03:54:37+05:30 IST
ఎనభైల ఆరంభానికి తెలంగాణ గ్రామీణ జీవితం కొన్ని సుఖాల్ని అనుభవిస్తుండేది. ఎన్నికలు వచ్చాయంటే ఓటు ఎవరికి వేయాలనే శషభిష ఉండేది కాదు...
ఎనభైల ఆరంభానికి తెలంగాణ గ్రామీణ జీవితం కొన్ని సుఖాల్ని అనుభవిస్తుండేది. ఎన్నికలు వచ్చాయంటే ఓటు ఎవరికి వేయాలనే శషభిష ఉండేది కాదు. ఉన్నది ఒకటే పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ. జనం పొలోమని వెళ్లి హస్తం గుర్తుకు ఓటు గుద్ది వచ్చేవారు. జనతా పార్టీ ఉండీ ఉండనట్టుగా ఉండేది. పగుళ్లుబారిన మట్టిగోడలపై ఆ పార్టీ ‘నాగలిపట్టిన రైతు గుర్తు’ మాత్రం దాని ఉనికిని గుర్తు చేసేది. పార్టీలు పెరిగిన కొద్దీ గుర్తుల హడావిడి పెరిగింది. ఏ ఆటవిడుపూ లేని గ్రామీణ ప్రాంతాల బడి పిల్లలకు ‘ఓట్ల పండగ’ మరిచిపోలేని సంబరంగా ఉండేది.
తెలుగుదేశం పార్టీ గ్రామాల్లోకి ప్రవేశించాక పరిస్థితి క్రమంగా మారింది. ఎన్నికల్లో పరస్పర ఉద్రిక్తత ఈ కాలంలోనే ప్రవేశించింది. రెడ్ల ప్రాబల్యంలోని కాంగ్రెస్ పార్టీకి బోయలు సైన్యంగా ఉండేవారు. దళితులు వారిని అనుసరించేవారు. వృత్తి కులాలు సమయానుకూలంగా వ్యవహరించేవారు. వారి వృత్తి అభిప్రాయ ప్రకటనను నిరోధిస్తుంది.
టీడీపీ, బీజేపీ సుమారు ఒకే కాలంలో గ్రామాలను తట్టినా బీజేపీకి అంత సులువుగా ప్రవేశం దొరకలేదు. అందుకు కారణలనేకం. టీడీపీ పెట్టింది ఎన్టీఆర్ కావడం వల్లో, జనాదరణ సులభంగా రావడం వల్లో టీడీపీ గ్రామాల్లోకి సులభంగా వచ్చిందని కాదు, దాని వెనుకా ఓ మతలబు ఉంది. ఓ మోస్తరు చదువుకుని వ్యవసాయం నుంచి క్రమంగా దూరమవుతున్న మున్నూరు కాపు యువతకు స్వతంత్రత ప్రకటించుకోవడానికి టీడీపీ ఒక ఊతంగా ఉపయోగపడింది. ఇది అన్ని గ్రామాల్లోని అనుభవమని కాదు, కొన్ని గ్రామాల్లో అయినా ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది నా వైయక్తిక అభిప్రాయం.
ప్రచారంలోనూ, ఓటింగ్‌లోనూ పోటాపోటీతత్వం పెరిగిన కొద్దీ కల్లు దుకాణాల దగ్గర రద్దీ పెరిగింది. అప్పటికింకా ‘వైనుషాపులు’ గ్రామాల తలుపు తట్టలేదు. కొని తాగగల తాహతు ఉన్న గ్రామీణులకూ, టెండర్లు వేసి షాపులు దక్కించుకోగల సంపన్నులకు పల్లెల్లో ఆనాటికి ఇంకా చోటు లేదు. పంటకోతల కాలంలో ‘చీటీ’ల పరపతితో గౌండ్లు కల్లు పోసేవారు. ఎన్నికల రాజకీయాల ఉధృతి మూలంగా క్రమంగా రొక్కం చెలామణీ పెరుగుతూ వచ్చింది. ఒక పాత పార్టీ, ఒక కొత్త పార్టీ మధ్య కులాలు చీలిపోయిన తర్వాత ‘ఘర్షణ’ చెలరేగడం మొదలైంది.
ఎనభైల ఉత్తరార్ధానికి పరిస్థితి మారిపోయింది. బోయల్లోని బలమైన వర్గం టీడీపీతో జమకూడింది. ప్రాబల్యం కోల్పోతున్న రెడ్ల నాయకత్వంలో దళితులు ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారింది. కొత్త మార్పులకు అంకురార్పణ జరిగింది. బస్సు, కరెంటు, ఆయిలింజను, ప్లాస్టిక్ బిందె అనే కొత్త మాటలు గ్రామీణ నిఘంటువులోకి చేరుతూ వచ్చాయి. అడదడపా వచ్చే బస్సుల మూలంగా కల్లు స్థానాన్ని ‘మందు’ భర్తీ చేయడం మొదలుపెట్టింది. తొంభైల ఆరంభం నాటికి వైనుషాపు రంగప్రవేశం చేసింది. వానాకాలపు కష్టాలు గట్టేందుకు రోడ్లు పడ్డాక బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. పొరుగున ఉన్న పట్టణాల్లోని బారుషాపులు పల్లెల్లో మత్తుకోసం ఉబలాటపడే యువతను ఆకర్షించాయి. అంటే ఎన్నికల రాజకీయాల్లో మత్తు ప్రాబల్యం పెరగడం, గ్రామాల్లో వ్యవసాయం ఒట్టిపోవడం సుమారుగా ఒకేసారి జరిగిన పరిణామంగా చూడాలి.
ఎన్టీఆర్ పుణ్యమా అని ‘వారుణి వాహిని’ పథకం పేరిట కల్లు కన్నా సారా చవకగా దొరకడం మొదలైంది. అప్పుడప్పుడే వచ్చిన వైను షాపులు, పాతకాలం నుంచి వస్తున్న కల్లుదుకాణాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారాపథకం గ్రామాల స్వరూప స్వభావాలను క్రమంగా మార్చేస్తూ వచ్చాయి. ఈ మార్పులో ఎన్నికల రాజకీయాలు విడదీయలేని భాగంగా మారుతూ వచ్చాయి.
తొంభైల తర్వాత గ్రామీణ వాతావరణంలో తాగడం అనేది కొంతమందికి విలాసమైంది. సేద్యగాళ్లు మత్తు ఊబిలో కూరుకుపోయారు. తొంభైల ఉత్తరార్ధంలో జరిగిన అన్ని ‘ఎన్నికల్లో పోలైనవి ఓట్లు కాదు. మత్తిల్లిన ఓటర్లు డబ్బాల్లో విసిరేసిన ఖాళీసీసాలు’ అనే మాట వామపక్ష పార్టీల పాటల్లో వినిపించేది. అందులో పిసరు అతిశయోక్తి ధ్వనించవచ్చు కానీ, ప్రయాణం అటువైపుగా మొదలైందని చెప్పడానికి ఆ పాట చరణం సూచనప్రాయమైన హెచ్చరిక అని ఇప్పుడర్థమవుతోంది. మద్యపానం, రాజకీయాల ప్రవేశం కులాల మధ్య వైషమ్యాన్ని మరింత పెంచింది. తెలుగునాట మిగతా ప్రాంతాల్లో గ్రామీణ వాతావరణం ఎట్లా మారిందో తెలియదు కానీ, తెలంగాణలో మాత్రం సుమారుగా ఇదే తరహాలో మారుతూ వచ్చిందని చెప్పవచ్చు.
గతించిన కాలాన్ని నెమరేసుకుంటూ, మొన్నామధ్య ఉమ్మడి నల్లగొండలో జరిగిన మునుగోడు ఉపపోరు ప్రాంతాలను సందర్శిస్తుంటే తెలంగాణ గ్రామీణ జీవితంలో మద్యం మోతాదు ఎంత అనే ప్రశ్న వచ్చింది. ప్రజాస్వామ్యపు కీర్తి కిరీటమైన ‘ఓటు’కు, మత్తులో ముంచి చైతన్యాన్ని చంపే మద్యానికీ సాపత్యం ఏంటి అనే సందేహం మనసును వికలం చేసింది. మునిమాపు వేళల్లో మునుగోడు గ్రామాల్లో తిరుగుతుంటే క్రిక్కిరిసిపోయిన మద్యం దుకాణాలు, వాటి ముందు బారులు తీరిన జనం, పద్ధతిలేకుండా పార్క్ చేసిన వాహనాలు, అల్లంత దూరాన పంటపొలాల్లో మిణుగురుల్లా మెరుస్తోన్న సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో రణగొణధ్వనులూ, మంటల్లో కాలుతున్న నాటు కోళ్లు, చిత్రిక పట్టగలవాడుంటే... అదో విషాదబీభత్స కాన్వాస్. ఉద్యమ కలను సాకారం చేసుకున్న నవ తెలంగాణ చిత్తరువు అది.
ఎన్నికల ఋతువు సమీపిస్తున్నవేళ తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. రికార్డు స్థాయిలో లక్షా పాతికవేల దరఖాస్తులు వచ్చాయని, వీటివల్ల ఖజానాకు మూడువేల కోట్ల ఆదాయం సమకూరిందని పత్రికలు వార్తలు రాశాయి.
వ్యవసాయ ఆధారిత బడ్జెట్ కాస్తా మద్య ఆధారిత బడ్జెట్‌గా రూపాంతరం చెందింది. కొత్తగా ‘లిక్కర్ విడో’లు పుట్టుకొచ్చారు. లిక్కర్ విడోకు తెలుగేమిటీ అని ఓ పాత్రికేయ సోదరుడు వెటకారంగా అడిగాడు. లిక్కర్ విడో సంగతి పక్కన పెడితే ‘లిక్కర్ ఓటర్’ సంగతేంటో తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
ఓట్ల తేదీలు ఖరారైంది లగాయతూ మద్యం మన గుమ్మం ముంగిట వాలిపోతుంది. వారాల తరబడి ఒంట్లోకి ప్రవేశించే మత్తు ఓటరు నిర్ణయాన్ని లోలకంలా మార్చుతూ ఉంటుంది. గుర్తులు కనపడవు. రంగులు వెలిసిపోయి దర్శనమిస్తాయి. సింగిడిని పోలిన అన్ని రంగుల పార్టీలు బరిలో ఉన్నప్పుడు గుర్తించడం కష్టంగా మారిపోతుంది. తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించే మత్తు దీర్ఘకాలిక పాలనా యంత్రాంగాన్ని ఎంచుకునే చైతన్యాన్ని పులిలా రక్కేస్తుంది. మందుసీసాల ముందు చట్టసభల ఔన్నత్యం ఓటమి పాలవుతుందని గాబరా పడనక్కలేదు. శాసనకర్తల అవతారమెత్తుతున్నవారంతా మద్యం వ్యాపారంలోని రొక్కాన్నే ఎన్నికల్లో మదుపుగా పెడుతున్నారు.
నేడు అధికార యుద్ధ క్రీడలో ‘ఓటు’ అణగారిన ఆయుధం. రెండు క్వార్టర్ల ఖరీదు కడితే పరిగెత్తుకు వచ్చే ‘నిశాచరి’ పేరు ఓటరు. డ్రంకన్ డ్రైవ్‌లో మందుబాబులను గుర్తించినట్టే ఎన్నికల రోజు ఓటు కోసం బారులు తీరిన ఓటరు మహాశయులకు కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే మన ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లుతుందో తేలిపోదూ?
సంజన జోషి
రీసెర్చ్ స్కాలర్