Share News

‘మునుగోడు ముప్పు’లో ఎన్నికల భారతం!

ABN , First Publish Date - 2023-10-27T01:09:24+05:30 IST

డబ్బుకు ఓటరు దాసోహం. గమనించారా? ఈ చిన్న వాక్యానికి చివర నేను ఆశ్చర్యార్థకం పెట్ట లేదు. ఎందుకంటే ఆ వాక్యం చాటుతున్న సత్యం ఏ మాత్రం విస్మయకరం కానంతగా లోకరీతి అయిపోయింది కదా...

‘మునుగోడు ముప్పు’లో ఎన్నికల భారతం!

డబ్బుకు ఓటరు దాసోహం. గమనించారా? ఈ చిన్న వాక్యానికి చివర నేను ఆశ్చర్యార్థకం పెట్ట లేదు. ఎందుకంటే ఆ వాక్యం చాటుతున్న సత్యం ఏ మాత్రం విస్మయకరం కానంతగా లోకరీతి అయిపోయింది కదా. తెలంగాణలో ఉన్నాను. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికను తప్పనిసరిగా గుర్తు చేసుకోవల్సిన సందర్భమిది. ప్రతీ సంభాషణ డబ్బు విషయంగా మొదలవుతుంది, డబ్బు పరంగానే ముగుస్తుంది. ఎన్నికల రాజకీయాలలో డబ్బు ప్రమేయాన్ని అర్థం చేసుకోవడంలో మా ఉద్యమ స్నేహితుల బోళాతనం నాకు నవ్వు తెప్పించింది. నేటి రాజకీయాలలో ధన బలం సాధిస్తున్న విజయాల గురించి నా స్నేహితులు ‘దిగ్భ్రాంతికర’ వాస్తవాలను ఏకరువు పెడుతున్నప్పుడు నేను ప్రతీ అభ్యర్థీ కోటి రూపాయలకు పైగా ఖర్చు (ఇది, ఎన్నికల సంఘం విధించిన అధికారిక పరిమితికి అనేక రెట్లు అధికం) పెట్టాడని బిహార్‌కు చెందిన నా మిత్రుడు గుండెలు బాదుకున్నాడు. తమ రాష్ట్రంలో పరిస్థితి అంతకంటే ఘోరమని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక స్నేహితుడు వాపోయాడు. కనీసం రూ.2 కోట్లు ఖర్చు చేయలేని వ్యక్తికి టిక్కెట్ ఇచ్చే విషయాన్ని ఏ పార్టీ కూడా అసలు పరిగణనలోకి తీసుకోదని అతడు వివరించాడు. నేను నవ్వాను. నవ్వనూ మరి? కొన్ని నెలల క్రితం నేను కర్ణాటకలో ఉన్నాను. ప్రధాన రాజకీయ పక్షాలలో ఒకదాని తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించి ఘోరంగా ఆశాభంగానికి గురైన ఒక రాజకీయవేత్తను నేను యాదృచ్ఛికంగా కలవడం జరిగింది. అతడెంతో నైరాశ్యంలో ఉన్నాడు. తనకీ గతి పట్టించిన ప్రతీ ఒక్కరి మీద ఆగ్రహిస్తున్నాడు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత అనేది ఏ కోశానా లేకుండా పోయిందని మండిపడ్డాడు. అతడికి నా సానుభూతి వ్యక్తం చేశాను. అనునయించాను. ‘పెట్టిన పెట్టుబడినంతా ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి?’ అని ఆ విఫల అభ్యర్థి ఆక్రోశించాడు. నేనేదో గొణిగాను. రాజకీయాలు ఒక సుదీర్ఘ క్రీడా కలాపమని నచ్చచెప్పాను. రాజకీయాల్లో ఉన్నతికి చేసే ఏ వ్యయమూ వృధా అవబోదని అన్నాను. ‘మీరు నా బాధను అర్థం చేసుకోవడం లేదు. టిక్కెట్ దక్కించుకోకపోవడం ద్వారా నేనొక తీవ్ర సమస్యలో చిక్కుకున్నాను. ఓటర్లకు పంపిణీ చేసేందుకై 40 వేల కలర్ టీవీ సెట్లను కొనుగోలు చేశాను. ఎన్నికలు సమీపించిన కొద్దీ వాటి ధరలు మరీ పెరిగిపోతాయని చెప్పారు. అందుకే ముందుగానే ఒక భారీ డిస్కౌంట్‌పై వాటిని కొనుగోలు చేశాను’. ఒక్కో టీవీ సెట్ రూ.10 వేలకే లభించిందనుకున్నా 40వేల టీవీ సెట్లను కొనుగోలు చేసేందుకు ఎంత వెచ్చించి ఉంటాడు? లెక్కకట్టాను. కనీసం 40 కోట్లు!

ఆ కన్నడ రాజకీయవేత్త వెల్లడించిన విషయాలు నన్ను దిగ్ర్భాంతిపరిచాయని చెప్పడం చాలా తక్కువగా చెప్పడమే సుమా! నా ఈ అనుభవం గురించి రాజకీయ వర్గాలలో ఆరా తీశాను. సదరు నాయకుడు ఆ స్థాయిలో ఖర్చుపెట్టగల స్తోమతు ఉన్నవాడేనని ప్రతీ ఒక్కరు చెప్పారు. అయితే ఆ స్థాయి వ్యయం చాలా సాధారణ ఖర్చు మాత్రమేనని కూడా స్పష్టంగా చెప్పారు. కర్ణాటకలోని గ్రామీణ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థి అయినా సరే రూ.20 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టడం చాలా సాధారణమేనని ఎంతో మంది చెప్పారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో వ్యయం అంతకు కొంచెం తక్కువగా ఉంటుందని, సంపన్న ప్రాంతాలలో అయితే కొంచెం అధికంగా ఉంటుందని కూడా చాలా మంది చెప్పారు. పట్టణ ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా బెంగళూరు పరిసర నియోజకవర్గాలలో ప్రతీ అభ్యర్థి వ్యయం రూ.40 నుంచి 50 కోట్ల మేరకు ఉంటుందట. రూ.150 కోట్ల మేరకు ఖర్చు పెట్టిన అభ్యర్థులు కూడా ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది.

తెలంగాణలో ఉండగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల భారీ వ్యయాల విషయమై నా దిగ్భ్రాంతిని నా మిత్రులకు చెప్పాను. ఈ సారి వారు నా అజ్ఞానానికి నవ్వారు. ‘కేవలం రూ.20 నుంచి 30 కోట్లు మాత్రమేనా? మీరు జోక్ చేయడం లేదు కదా? మీరు మునుగోడు ఉప ఎన్నిక గురించి వినలేదా?’ అని ప్రశ్నించారు. 2022లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో జరిగిన ఆ ఉప ఎన్నిక వైనం గురించి నాకు అస్పష్టంగా గుర్తున్నది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే కొత్త పేరు సంతరించుకున్న తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా కష్టపడ్డారన్న విషయమై వినవచ్చిన గాథలన్నిటినీ గుర్తు చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అనేక విధాల ప్రయత్నించింది. అప్పుడప్పుడే ప్రజల్లో ఆదరణను పెంచుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించాలని ఆరాటపడింది.


మునుగోడులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ తీవ్ర పర్యవసానాలకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల వ్యయాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయన్నది ఒక బహిరంగ సత్యం. ఆ వ్యయాలు ప్రజలను ఎన్నికల ప్రచార సభలకు తీసుకువచ్చేందుకు లేదా బిర్యానీ, సారా, చీరలు పంపిణీ చేసేందుకు పరిమితమైనవి కావు. ఒక అభ్యర్థి అయితే ప్రతీ కుటుంబానికీ ఒక తులం (11 గ్రాములు) బంగారాన్ని కానుకగా ఇచ్చాడని వార్తలు వెలువడ్డాయి. ఒక ర్యాలీకి హాజరయినందుకు, ఒక రోజు ప్రచారంలో పాల్గొన్నందుకే కాకుండా ఒక రోజు పాటు పార్టీ కండువా వేసుకున్నందుకు సైతం ఒక నిర్దిష్ట మొత్తంలో డబ్బు ఇచ్చారు. తమకు నగదు పంపిణీ సరిగా జరగనందుకు అలిగిన కొన్ని గ్రామాల వారు పోలింగ్ రోజున ‘డబ్బు ఇవ్వకపోతే ఓటు వెయ్యం’ అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని ధర్నా చేశారు. వారిని బుజ్జగించి, పోలింగ్‌లో పాల్గొనేందుకు అంగీకరింపచేయడంలో చాలా సమయం గడచిపోయింది. తత్కారణంగా సదరు గ్రామాల్లో పోలింగ్ మధ్నాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగింది! మునుగోడులో గెలుపునకు అధికార బీఆర్ఎస్ పార్టీ రూ.400 కోట్లు ఖర్చు పెట్టిందని తెలంగాణ ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు. ఇదొక రాజకీయ వదంతి కావచ్చునేమో కానీ అందులో సత్యం పాలు తక్కువేమీ కాదు. ఆ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు మొత్తం రూ.617 కోట్ల మేరకు ఖర్చు పెట్టాయని ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ అనే ఎన్‌జీఓ ఒకటి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో ఎన్నికల వ్యయాలకు ‘బంగారు’ ప్రమాణాలను నెలకొల్పింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రతీ నియోజకవర్గంలోనూ ఏ అభ్యర్థీ రూ. 100 కోట్లకు తక్కువగా ఖర్చు పెట్టబోడని ఖాయంగా చెప్పవచ్చు. ఇది అతిశయోక్తి అనుకున్నా, సాధారణ నియోజకవర్గంలో ప్రతీ అభ్యర్ధి రూ.50 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నాడనేది అందిరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో ఎన్నికల రాజకీయాల భవిష్యత్తును మునుగోడు స్పష్టంగా సూచించింది. ఎన్నికల పోటీ క్షేత్ర స్థాయిలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య సంబంధం ఇంకెంత మాత్రం కన్పించడం లేదు. ఎందుకని? ఇప్పుడు రాజకీయాలు అనేవి చాలా మందికి ఒక్క ‘పక్క వ్యాపారం’ అయిపోయాయి. గనులు, ఎగుమతులు, విద్యా సంస్థల ద్వారా మీరు కోట్లకు పడగలెత్తుతారు. ఆ తరువాత మీ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజకీయాలలోకి ప్రవేశిస్తారు, లేదా మీడియా రంగంలోకి అడుగిడుతారు.

ఈ పరిణామాలను ఎవరైనా గమనిస్తున్నారా? ఎన్నికల వ్యయాల తీరుతెన్నులను నిశితంగా గమనించేందుకు ఎన్నికల సంఘంలో ఒక ప్రత్యేక విభాగమే ఉన్నది. పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయాల విషయంలో ఏమి చేయవచ్చో, ఏమి చేయకూడదో నిర్దేశిస్తున్న నియమ నిబంధనలూ చాలా ఉన్నాయి. ఎన్నికలలో చేసే ప్రతి ఖర్చు వివరాలను ప్రతీ అభ్యర్థి సమగ్రంగా ఎన్నికల సంఘానికి నివేదించవలసి ఉన్నది. బహిరంగ సభలలో నాయకులకు వేసే పూలదండలు మొదలైన వాటికి అయ్యే వ్యయం వివరాలను కూడా సమర్పించవలసి ఉన్నది. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ప్రతీ నియోజకవర్గంలోనూ ఐఆర్ఎస్ అధికారులను నియమిస్తారు. స్థానిక అధికారులు వారికి తోడ్పడుతారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆకస్మిక దాడులతో ఎన్నికలలో అక్రమాలు జరిగేందుకు అవకాశం లేకుండ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ అభ్యర్థి అయినా సరే రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదనే కఠిన నిబంధన ఒకటి ఉన్నది. ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల వివరాలను సమర్పించేందుకు ఒక నిర్దిష్ట గడువు కూడా ఉన్నది. ఆ గడువులోగా సదరు వివరాలను సమర్పించని వారిని మళ్లీ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తారు.

నియమ నిబంధనలు గట్టిగా ఉన్నాయి. వాటిని కచ్చితంగా అమలుపరిచేందుకు ఎన్నికల సంఘం అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితేనేమి, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు సమర్పించినందుకుగాను ఎన్నికైన ఏ ఎమ్మెల్యేను, ఎంపీని వారి వారి సభ్యత్వ కాలంలో అనర్హులుగా ప్రకటించడమనేది ఇంతవరకు జరగలేదు. ఒక ఎమ్మెల్యేను ఆమె సభ్యత్వ కాలం ముగిసిన తరువాత అనర్హురాలుగా ప్రకటించారు. వ్యయాల వివాదాలకు సంబంధించి కొన్ని కేసులు కోర్టు విచారణల్లో ఉన్నాయి. అంతే. ఎన్నికల వ్యయాల పర్యవేక్షణ తతంగాలు సాధించే నికర ఫలితం ఇంత మాత్రమే. సరే, మళ్లీ మునుగోడుకు వద్దాం. ఆ ఉప ఎన్నికలో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థీ తన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. చేసిన అత్యధిక వ్యయం రూ. 34.5 లక్షలు మాత్రమే! జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఒక్కో నియోజకవర్గానికి ప్రతీ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ. 40 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. వ్యయ పరిశీలకుల నియామకాన్నీ ప్రకటించారు... నవ్వుకున్నాను. ఎన్నికల వ్యయాలపై పరిమితి విధించడం, ఆ వ్యయాల తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం అంతా ఒక ప్రహసనం కాదా? వ్యయ పరిమితులను రద్దుచేయడం ద్వారా మనం కొంత డబ్బును ఆదా చేసుకోలేమా?

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-10-27T01:09:24+05:30 IST