Share News

సీమకు ఇంతకన్నా ద్రోహం మరొకటుందా?

ABN , First Publish Date - 2023-10-18T03:49:00+05:30 IST

శ్రీ శైలం జలాశయం నుంచి నికర జలాలు ఏకంగా 90 టిఎంసీలు కాజేసే తెలంగాణ ప్రయత్నాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా లేదు. సీమ వాసుల చెవిలో పువ్వులు...

సీమకు ఇంతకన్నా ద్రోహం మరొకటుందా?

శ్రీ శైలం జలాశయం నుంచి నికర జలాలు ఏకంగా 90 టిఎంసీలు కాజేసే తెలంగాణ ప్రయత్నాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా లేదు. సీమ వాసుల చెవిలో పువ్వులు పెట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదానికి కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏపీ వేసిన మధ్యంతర పిటిషన్ కొట్టివేసిందో, వెంటనే న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని తాము సమర్పించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదించమని తెలంగాణ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ సెప్టెంబర్ ఆఖరులో కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన అటుంచి, కొత్త ట్రిబ్యునల్ నియమించి తాము తెలంగాణకు మేలు చేశామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఆమోదిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జన్మ ఇచ్చిన రాయలసీమకు ఇప్పుడే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా సరిదిద్దలేని అపకారం సంభవిస్తుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కనుక ఆమోదం పొందితే ముంచుకొచ్చే ప్రమాదంపై రాయలసీమ సమాజం కూడా సరిగా స్పందించకపోవడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల ముందు అప్పర్‌భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. పోనీ కనీసం తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ గురించి కించిత్తు చర్యలు చేపట్టలేదు. రాయలసీమలో 51 శాసనసభ స్థానాలుంటే, 49 మందిని గెలిపించినందుకు ఇది బహుమతా? లేక శిక్షా?

2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టని, నిర్మాణం నిలుపుదల చేయాలని చేసిన తీర్మానం మన ముందు ఉంది. ఒకవేళ 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి మౌనం పాటించినా, ఇప్పుడైనా వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఎందుకు కోరడం లేదు? ఈ దశలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగి అడ్డుకొంటే, కేంద్ర జలసంఘం కూడా విధిగా డీపీఆర్‌ను పక్కన బెట్టే అవకాశం ఉంది. మొన్న ట్రయల్ రన్ సందర్భంగా శ్రీశైలం నుంచి అక్రమంగానే నీటిని ఎత్తి పోశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 34 టీఎంసీలు ఏపీ తీసుకొనేట్టు కట్టడి చేస్తేనే శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్‌పై సంతకం చేస్తానని మొండికేస్తున్న తెలంగాణకు వ్యతిరేకంగా ఈ అంశంపై నిరసనగా ఏపీ నుంచి యాజమాన్యం బోర్డుకు లేఖ కూడా వెళ్లలేదంటే ఈ ఫెవికాల్ బంధం ఎంత పటుత్వమైనదో అవగతం చేసుకోగలం. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని డిమాండ్ చేసే స్థితిలో ఉన్నట్లు లేదు.

సీమ వాసుల నుంచి వచ్చే అసంతృప్తి నివారణకు ఎట్టి అదనపు నీరు లభించని రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదం కోసం యత్నాలు మొదలుపెట్టారు. ఈ పథకం ఆనుపానులు పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో కనీస పరిజ్ఞానం ఉన్నవారు కూడా ముక్కు మీద వేలు వేసుకోవలసిందే.

ఏ రాష్ట్రంలో గాని ఎన్ని వ్యవస్థలు తారుమారు అయినా, ధ్వంసమైనా తదుపరి కాలంలో వచ్చే ప్రభుత్వాలు పునరుద్ధరించుకోవచ్చు. కాని సాగునీటి రంగంలో ఒకసారి నీటి కేటాయింపులు జరిగితే దీర్ఘకాలికంగా భవిష్యత్తు తరాలు కోలుకోలేని విధంగా ఉంటుంది. కృష్ణ–పెన్నార్ ప్రాజెక్టు పోయిన దుష్ఫలితం తరాలు మారినా ఇంకా మిగిలే వున్నది. ఇప్పుడు జాగరూకత లేకపోతే రాయలసీమతో పాటు ఇతర మెట్ట ప్రాంతాల్లో తాగునీటికి కూడా వలసలు పోవలసి వుంటుందేమో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా సాగునీటి రంగంపై ఎంతవరకు అవగాహన వుందో ఏమో గాని ఆయన చుట్టూ వున్న అధికారులు, ఇంజనీర్లు, సలహాదారులయినా ఎందుకు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదో? అదే తెలంగాణలో రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నెముకగా వ్యవహరిస్తోంది. ఇక్కడ కూడా ఇంజనీరింగ్ నిపుణులు వున్నా వినే వారు ఉండాలి కదా?

పదవి చేపట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధంగా లేరు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చూపెట్టి, ఒకటి, రెండు జిల్లాల్లో ఓట్లు రాల్చుకొనేందుకు ప్రస్తుతం కేసీఆర్ విఫలయత్నాలు చేస్తున్నారు. కేవలం 1.5 టీఎంసీలు ఎత్తి పోసి ప్రాజెక్టు పూర్తయిందని ప్రచారం చేస్తున్నారు. ఈ యత్నాలకు గండిపడే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జగన్మోహన్ రెడ్డి కోరుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

తొలుత పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ఉండకూడదు. కొత్త ప్రాజెక్టు అని దాని ఉనికినే ప్రశ్నించి ఉండాలి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టని ట్రిబ్యునల్ మన ముఖాన చెప్పింది. అయినా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలగలేదు. అంతేకాదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు వున్నా మరో పక్క కేంద్రం నుంచి వివిధ శాఖల వద్ద ఆరు అనుమతులు తెలంగాణ పొందింది. ఇక మిగిలింది డీపీఆర్ ఆమోదం ఒక్కటే. తుదిగా జూలై 24న జరిగిన కేంద్ర మంత్రివర్గ పర్యావరణ శాఖ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టుగా అపెక్స్ కౌన్సిల్ అధికార ముద్ర లేకుండా ఇంత తతంగం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖాధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు?

ఇదిలావుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే చెబుతున్నట్లు అదనంగా చుక్క నీరు తీసుకోవడం లేదు. పైగా ఈ ఎత్తిపోతల పథకానికి అప్రోచ్ చానల్ 17.59 కిలోమీటర్లుగా ఉంది. కృష్ణలో కలిసే భవనాసి నదినే దాదాపు అప్రోచ్ చానల్‌గా డీపీఆర్ తయారుచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండితే ఈ అప్రోచ్ ఛానల్ మొత్తం ముంపు ప్రాంతంగా ఉంటుందని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండి ఎక్కువ రోజులు నీరు నిల్వ వుంటే అప్రోచ్ చానల్‌లో సిల్ట్ పేరుకుపోతుంది కదా? ఇన్ని కిలోమీటర్లు ప్రతి ఏటా తిరిగి సిల్ట్ తొలగించుకొంటూ ఉండాలి. ఇది ఎంత వ్యయప్రయాసలతో కూడుకొన్నదో ఊహకందని అంశమే. భూసేకరణ నుంచి తప్పించుకొనేందుకు ఒక కాంట్రాక్టు సంస్థ తయారు చేసిన డీపీఆర్‌ను అధికారులు సంతకం చేసి కేంద్ర జల సంఘానికి పంపారని చెబుతున్నారు. గతంలో ముచ్చుమర్రి అనుభవం ఇంజనీరింగ్ అధికారులు గమనంలోకి తీసుకున్నట్లు లేదు. ముచ్చుమర్రి అప్రోచ్ చానల్ సిల్ట్ తీయలేక యంత్రాలు బురదలో కూరుకుపోగా కొంత భాగం వదిలేశారని చెబుతున్నారు. అదే పరిస్థితి రాయలసీమ ఎత్తిపోతలకు ఎదురయ్యే ప్రమాదముంది. అందుకే ఈ ఎత్తిపోతల వ్యయం 3,279 కోట్లు కాగా, అప్రోచ్ చానల్ నిర్మాణ వ్యయం సింహభాగం 1360 కోట్లుగా ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్‌పై నిత్యం కాలు దువ్వే తెలంగాణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో ఈ ఉదాహరణ చాలు.

శ్రీశైలం జలాశయం నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు గాని ఈ కేసు విచారణకు రాలేదు. సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన కేసు గురించి ఇన్నాళ్లూ తత్సంబంధిత అధికారులు గాని, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గాని ఎందుకు పట్టించుకోలేదో ప్రత్యేకంగా చెప్ప పనిలేదు. ఏళ్లు గడచిపోయాయి. ఈ లోపు తెలంగాణ శ్రీశైలానికి చేరిన వందలాది టీఎంసీల నీళ్లను కింద అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి చేస్తూ సముద్రం పాలు చేసింది. కేసు త్వరగా విచారణకు వచ్చేలా ఎవరూ పట్టించుకోలేదు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-10-18T03:49:00+05:30 IST