Share News

‘కార్బన్ మార్కెట్ ’ ఎలా ఉండాలి?

ABN , First Publish Date - 2023-10-27T01:06:41+05:30 IST

వాతావరణ మార్పు సంక్షోభం ప్రతీ దేశాన్ని కల్లోలపరుస్తోంది. ప్రతీ సమాజానికి అలవికాని సమస్యలు సృష్టిస్తోంది. శీతోష్ణస్థితులు సమ స్థాయిలో ఉండడం లేదు. ఋతువుల సహజ ధర్మాలు వికటిస్తున్నాయి...

‘కార్బన్ మార్కెట్ ’ ఎలా ఉండాలి?

వాతావరణ మార్పు సంక్షోభం ప్రతీ దేశాన్ని కల్లోలపరుస్తోంది. ప్రతీ సమాజానికి అలవికాని సమస్యలు సృష్టిస్తోంది. శీతోష్ణస్థితులు సమ స్థాయిలో ఉండడం లేదు. ఋతువుల సహజ ధర్మాలు వికటిస్తున్నాయి. ఈ వాతావరణ వైపరీత్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు పరుస్తున్నాయి... అని చెప్పడం చాలా తక్కువగా చెప్పడమే అవుతుంది. భూ వాతావరణాన్ని అంతకంతకూ వేడెక్కిస్తోన్న హరిత గృహ వాయు ఉద్గారాల తగ్గింపు విషయమై నిర్దేశించుకున్న లక్ష్యాలను పరిపూర్తి చేయడంలో ప్రతీ సమాజమూ వెనుకబడి పోతోంది, కాదు, విఫలమవుతోంది. ఇది నేటి ప్రపంచ విస్పష్ట వాస్తవం. ఈ అనివార్య పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఒక సువ్యవస్థిత కార్బన్ మార్కెట్‌ను అభివృద్ధిపరచడమే కాదూ?

కార్బన్ మార్కెట్ అనేది కార్బన్ ఉద్గారాలకు ఒక ధర నిర్ణయించే సాధనం. ఇది, లోకోపకార పనులు – విస్తారంగా మొక్కలు నాటి పెంచడం, కాలుష్యానికి తావివ్వని వంట గ్యాస్ స్టవ్‌లను పేద కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయడం, పునరుత్పాదక ఇంధన సమృద్ధికి మరింతగా పెట్టుబడులు పెట్టడం మొదలైనవి– చేయడం ద్వారా దేశాలు, కార్పొరేట్ కంపెనీలు కార్బన్ క్రెడిట్స్‌ను కొనుగోలు చేసుకునేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది. కార్బన్ క్రెడిట్ అంటే వ్యాపార లైసెన్స్ లేదా ధ్రువీకరణ. ఒక టన్ను బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్), లేదా ఇతర హరిత గృహ వాయువులను ఒక టన్ను మేరకు ఉద్గారించేందుకు ఈ లైసెన్స్ ద్వారా పారిశ్రామిక కంపెనీలకు సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. సంగ్రహించి చెప్పాలంటే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గించివేయడమే కార్బన్ క్రెడిట్ లక్ష్యం. వేర్పాటు చేసి నిల్వ చేసిన కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్యకారక వాయువులకు ఇదొక ధరను నిర్ణయిస్తుంది. తద్వారా, భూతాప ఉద్గారాల తగ్గింపునకు తోడ్పడిన దేశాలు, కంపెనీలకు పరిహారం చెల్లించడం జరుగుతుంది. వాతావరణ మార్పు అనేది ప్రపంచ పరిణామం కనుక దేశదేశాలలో ఎక్కడైనాసరే కార్బన్ క్రెడిట్స్ ద్వారా కాలుష్యకారక వాయువులు ఉద్గారాలను అరికడితే సమస్త ధరిత్రిపై వాతావరణ స్వచ్ఛత, సంరక్షణకు దోహదం జరుగుతుంది.

కార్బన్ మార్కెట్ రెండు రకాలుగా ఉంటుంది. అవి: ఒకటి– నిబంధనాత్మక అనువర్తన (రెగ్యులేటరీ కంప్లియన్స్) విపణి; రెండు – స్వచ్ఛంద కార్బన్ విపణి (వాలంటరీ కార్బన్ మార్కెట్ – వీసీఎమ్). మొదటి రకం మార్కెట్‌ను కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి. ఈ మార్కెట్‌పై కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో పనిచేసే జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థల నియంత్రణ ఉంటుంది. ఇక రెండోరకం మార్కెట్ వాతావరణ మార్పుకు కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్, ఇతర హరిత గృహ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో కొత్తగా ప్రభవిస్తున్న వ్యవస్థ. క్రమబద్ధీకరణ కాని గ్లోబల్ మార్కెట్ ఇది. ఈ కారణంగానే అధికారిక కార్బన్ మార్కెట్ ఏర్పాటుకై ఒక అంతర్జాతీయ ఒడంబడిక కోసం దేశ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఆ ఒప్పందం ఎలా ఉండాలనే విషయమై నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయిలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 28)లో చర్చలు జరగనున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన పరివర్తనను సాధించేందుకు రూపొందించిన వీసీఎమ్‌లోని లోపాలు, లొసుగులు పునరావృతం కాకుండా జగ్రత్తపడవలసిన అవసరం ఉన్నది.


ప్రస్తుత కార్బన్ మార్కెట్లు కాలుష్యకారక వాయు ఉద్గారాల పెంపుదలకే వెసులుబాటు కల్పిస్తున్నాయనేది ఒక కఠోర వాస్తవం. కార్బన్ క్రెడిట్‌లు కొనుగోలు చేసినవారు యథావిధిగా ఉద్గారాలను కొనసాగనిస్తున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేశామని చెబుతూ ఆ ఉద్గారాలను మరింతగా పెంచుతున్నారు! ఈ క్రెడిట్లను అతిగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ కారణంగా ఉద్గారాల తగ్గింపు అనేది ఊహాత్మకమైనదిగా మిగిలిపోతోంది. దీనివల్ల రెట్టింపు అపాయం సంభవిస్తోంది. దీన్ని నివారించడం ఒక తక్షణ ఆవశ్యకత. ఇందుకు ఏమి చేయాలి? కార్బన్ మార్కెట్ వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చేయడం తొట్టతొలుత చేపట్టవలసిన చర్య. కార్బన్ మార్కెట్ లక్ష్యాలను నిర్ణయించి, వాటి పరిపూర్తికి కచ్చితమైన నిబంధనలను రూపొందించడం రెండో చర్య. ఉద్గారాలకు కారణమవుతున్న కంపెనీల ప్రయోజనాలకు కాకుండా సామాజిక సముదాయాల సంక్షేమానికి దోహదం చేకూరేలా జాగ్రత్త వహించడం మూడో చర్య. ప్రస్తుతం కార్బన్ మార్కెట్ల ద్వారా లభిస్తున్న ఆదాయాన్ని సమాజ శ్రేయస్సుకు చెప్పుకోదగిన స్థాయిలో వినియోగమవడం లేదు. ఈ పరిస్థితి మారాలి. కార్బన్ మార్కెట్ తన లాభాలను సామాజిక సముదాయాల పరిస్థితులను మెరుగుపరిచేందుకు పారదర్శకంగా, ప్రయోజనకరంగా వినియోగించి తీరాలి.

వంట స్టౌవ్‌లు మొదలైన గృహ సంబంధ ఉపకరణాల విషయాన్నే తీసుకోండి. వీటి వ్యాపారం సహజంగానే భారీ స్థాయిలో ఉంటుంది. వంట స్టౌవ్‌ల కొనుగోలుదారులకు కార్బన్ క్రెడిట్‌ల పరంగా సమకూరుతున్న లబ్ధి వాటి ఉత్పత్తి దారులు ఆర్జిస్తున్న లాభాలలో కనీసం 20 శాతంగా కూడా ఉండడం లేదు. మిగతా 80 శాతం కార్బన్ ఆదాయం ఆయా ఉపకరణాల ఉత్పత్తిదారులకే దక్కుతోంది. పైగా ప్రభుత్వాలు ఆయా ఉపకరణాలను గృహస్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటాయి. అయినప్పటికీ కార్బన్ ఆదాయం ప్రజల లబ్ధికి వాస్తవంగా వినియోగమవడం లేదు. నిజానికి పేద కుటుంబాలు ఈ వంట స్టౌవ్‌లకు తమ సొంత సొమ్మును చెల్లిస్తున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఉత్పత్తిదారులు తొలగించబడిన ఉద్గారాలకు పరిహారంగా పొందేందుకు పేదలు కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారనేది ఒక నిష్ఠుర సత్యం.

మరి కార్బన్ ఉద్గారాలు వాస్తవంగా ఏ మేరకు తగ్గుతున్నాయి? గృహ సంబంధ ఉపకరణాల విషయంలో ఉద్గారాల తగ్గింపును వంట స్టౌవ్‌ల పంపిణీ ప్రాతిపదికన లెక్కించడం జరుగుతోంది. దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఉద్గారాల తగ్గింపుపై అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందుకు కేవలం ఉత్పత్తిదారులను మాత్రమే తప్పు పట్టలేము. ఈ అంచనాలను కచ్చితంగా రూపొందించేందుకు ఒక సువ్యవస్థితమమైన యంత్రాంగమొకటి ఉండి తీరాలి.

వాస్తవమేమిటంటే ప్రస్తుత స్వచ్ఛంద కార్బన్ మార్కెట్ చౌక ప్రత్యామ్నాయాలపై ఆధారపడి ఉన్నది. మరింత స్పష్టంగా చెప్లాంటే తమకు మొత్తంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండే విధంగా ఉద్గారాల తగ్గింపునకు అనేక దేశాలు అంగీకరిస్తున్నాయి. అయితే తమ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలకు ఏ ఉద్గారాల తగ్గింపు లాభదాయకం కాదో, వాటి తగ్గింపును ఉపేక్షిస్తున్నాయి. ఇదిగో, ఈ బాథ్యతారాహిత్యమే కార్బన్ ఉద్గారాల పరిమాణం యథాతథంగా ఉండేలా చేస్తోంది. మరి ఈ పరిస్థితులలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడం ఎలా సాధ్యమవుతుంది?

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - 2023-10-27T01:06:41+05:30 IST