Share News

India vs Australia final: ఇంతబాగా ఆడేస్తున్నారేంటి?

ABN , First Publish Date - 2023-11-19T02:11:46+05:30 IST

ఒకటా...రెండా... మాది పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ. ఒక్కటైనా ఐసిసి ట్రోఫీ దక్కకుండా పోతుందా అన్న ఎదురు చూపులతో మా కళ్ళు కాయలు కాశాయి. బోలెడంత ఫ్రస్ట్రేషన్, అంతకు మించి...

India vs Australia final: ఇంతబాగా ఆడేస్తున్నారేంటి?

షమీ ఒక్కడేనా హీరో? మనది మల్టీ స్టారర్ బ్లాక్‌బస్టర్ బొమ్మ కదా. బౌలర్లను హిట్‌మ్యాన్ రోహిత్ కుళ్ళబొడుస్తుంటే, కింగ్ కోహ్లీ మరోవైపు రికార్డులు కొల్లగొడుతున్నాడు. సోషల్ మీడియా ట్రోలర్లకు కొంగు బంగారం లాంటి కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్

చేత కాదేమో అనుకుంటే అతను కాస్తా కీపింగ్, బ్యాటింగ్ రెండూ అదరగొట్టేస్తున్నాడు. బౌన్సర్లు ఆడలేడనుకున్న అయ్యర్ సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. బ్యాటింగ్‌లో జడేజా వేస్ట్ అని డిసైడయ్యాం కానీ అతను కూడా సిక్సర్లు, ఫోర్లు దంచుతున్నాడు. బౌలింగ్ దళ నాయకుడు బుమ్రా గారి బ్రహ్మాస్త్రాల సంగతి సరే సరి.

మై డియర్ టీమిండియా,

ఒకటా...రెండా... మాది పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ. ఒక్కటైనా ఐసిసి ట్రోఫీ దక్కకుండా పోతుందా అన్న ఎదురు చూపులతో మా కళ్ళు కాయలు కాశాయి. బోలెడంత ఫ్రస్ట్రేషన్, అంతకు మించి మీమీద ఆగ్రహం, ఆవేశం. ఈ పదేళ్ళలో ఎన్ని టైటిల్స్ మిస్సయ్యామో తెలుసా? రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు, రెండు వన్‌డే ప్రపంచ కప్‌లు, నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ – మొత్తం తొమ్మిది. పోనీ టీమ్ బాగా లేదా అంటే, కోహ్లీ, ధోనీ, రోహిత్, బుమ్రా, షమీ, పాండ్యా, జడేజా, అశ్విన్ లాంటి యోధానుయోధులున్నారక్కడ. మరే ఇతర జట్టులోనైనా ఇంత మంది సూపర్ స్టార్లు కనిపిస్తారా? ప్రతి టోర్నమెంటులో ఆరంభంలో చెలరేగిపోయి మాకు బోలెడు ఆశలు కల్పిస్తారు. కానీ శిఖరాగ్రం సమీపించేసరికి మీ అడుగులు తడబడతాయి. సెమీ ఫైనల్లోనో, ఫైనల్లోనో నాకౌటై పోయి ఉస్సూరుమనిపిస్తారు. టెస్టు సిరీస్‌లు, వన్‌డే సిరీస్‌లు మాత్రం ఎడాపెడా గెలిచేస్తుంటారు. ప్రపంచ ర్యాంకింగుల్లో కూడా అన్నిటా మీరే టాప్‌లో ఉంటారు. అంగట్లో అన్నీ ఉన్నా... అన్నట్టుగా టోర్నమెంట్లు మాత్రం మనకు దక్కవు. అయినా సరే మేము అల్పసంతోషులం కాబట్టి మీరు ఏ మ్యాచ్ ఆడుతున్నా సరే ఎగబడి కళ్ళప్పగించేస్తుంటాం. బోర్డు ఖజానాలో కాసులు గలగలలాడుతూనే ఉంటాయి.

అందుకే ఈసారి ప్రపంచకప్ మనదేశంలోనే జరుగుతున్నా మాకు పెద్దగా ఆశలు లేవు. పదేళ్ళ అనుభవం నేర్పిన పాఠం అది. హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసు, క్రితం మూడుసార్లూ ఆతిథ్య జట్టే నెగ్గిందని కూడా తెలుసు. కానీ మాకు నమ్మకం లేదు దొరా... పైగా టీమ్ మాకు నచ్చలేదు. బుమ్రా, రాహుల్, శ్రేయస్ ఆరునెలలుగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్నారు. అయినా ఇంత పెద్ద దేశం గొడ్డుపోయిందన్నట్టుగా వాళ్ళకోసం వెయిట్ చేసి మరీ జట్టులో చేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సంజు శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వరా? శిఖర్ పైన ఎందుకు శీతకన్నేశారు? తిలక్ వర్మను తీసుకోలేదేం? లెఫ్టామ్ పేసర్ లేడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేడు. ఈ చెత్త టీమ్‌తో వాల్డ్‌కప్ కాదు కదా టీ కప్పు కూడా రాదు అనుకున్నాం.

మేం అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియాతో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లోనే 2 పరుగులకే మూడు వికెట్లు పోయాయి. మళ్ళీ కథ మొదటికొచ్చిందిగా అని నిట్టూర్చాము. సైకిల్ స్టాండ్‌లో సైకిళ్ళు పడే మాదిరి వరసగా మిగతా వాళ్ళు కూడా పెవిలియన్‌కి క్యూకడతారనుకుంటే కోహ్లీ, రాహుల్ కలిసి భలే గెలిపించేశారు. అదంతా ఆరంభ శూరత్వంలే అని లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆఫ్ఘన్లను ఓ ఆటాడుకున్నారు. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ మొదలయ్యేంత వరకే మాకు టెన్షన్. కానీ మ్యాచ్ స్టార్టయ్యాక ఆ టెన్షన్ వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేసేశారు మీరు. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందన్నట్టు, కప్పు ఎలానూ రాదు, పాకిస్థాన్ వాళ్ళని ఓడగొట్టాం, అదే పదివేలు అనుకున్నాం. అయితే బాంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌కు గాయమయ్యేసరికి మళ్ళీ మళ్ళీ మాకు వర్రీస్ మొదలయ్యాయి. అతను లేకపోతే ఎలాగబ్బా అని తెగ బెంగపడిపోయాం. సరిగ్గా అప్పుడే కథ మరో మలుపు తిరిగింది.

కొన్ని సినిమాల్లో సెకండాఫ్‌లో హీరో ఎంట్రీ ఇస్తాడు. అలాగే ఐదో మ్యాచ్‌లో వచ్చాడయ్యా షమీ! ఇదివరకు అతని నిక్‌నేమ్ ‘సెకండ్ ఇన్నింగ్స్ షమీ’, ఇప్పుడది సెకండాఫ్ షమీగా మారింది. అతను సంధించే నిప్పు కణికెలకు క్లూ దొరక్క బ్యాటర్లు తమ వికెట్లు వరసపెట్టి సమర్పించేసుకున్నారు. అయితే షమీ ఒక్కడేనా హీరో? మనది మల్టీ స్టారర్ బ్లాక్‌బస్టర్ బొమ్మ కదా. బౌలర్లను హిట్‌మ్యాన్ రోహిత్ కుళ్ళబొడుస్తుంటే, కింగ్ కోహ్లీ మరోవైపు రికార్డులు కొల్లగొడుతున్నాడు.

ఇక సైడు హీరోలు మా అనుమానాలు నివృత్తి చేసే పనిలో పడ్డారు. సోషల్ మీడియా ట్రోలర్లకు కొంగు బంగారం లాంటి కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ చేత కాదేమో అనుకుంటే అతను కాస్తా కీపింగ్, బ్యాటింగ్ రెండూ అదరగొట్టేస్తున్నాడు. బౌన్సర్లు ఆడలేడనుకున్న అయ్యర్ సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వన్‌డేలకు సూర్య పనికిరాడని కదా మా గట్టి నమ్మకం! కానీ అతను కూడా అవసరమైనప్పుడు బ్యాట్ ఝుళిపిస్తూనే ఉన్నాడు. బ్యాటింగ్‌లో జడేజా వేస్ట్ అని డిసైడయ్యాం కానీ అతను కూడా సిక్సర్లు, ఫోర్లు దంచుతున్నాడు. పార్ట్‌నర్‌షిప్‌లు కూలగొట్టడం కుల్‌దీప్ పనైతే, బౌలింగ్ దళ నాయకుడు బుమ్రా గారి బ్రహ్మాస్త్రాల సంగతి సరే సరి. లేటుగానైనా గిల్ కూడా ఫామ్ అందుకున్నాడు. లీకు వీరుడనుకుంటే మా సిరాజ్ మియా ముఖ్యమైన వికెట్లు తీస్తూనే ఉన్నాడు.

ఇంత బాగా ఆడేస్తున్నారేంటి? లీగ్ మ్యాచ్‌లు ఇలానే ఆడతారు లేబ్బా, నాకౌట్‌లో కదా అసలు రంగు బయటపడేది... క్లాసులో టీచర్ అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్లు చెప్పడం వేరే, ఎగ్జామ్స్‌లో టాప్ మార్కులు కొట్టడం వేరే... కానీ నాకౌట్‌లో మన డేంజర్ టీమ్ న్యూజీలాండ్‌ని మీరు దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకున్నాక ఇప్పుడు మా ఫ్యాన్స్ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మా సకల అనుమానాలు, నెగటివ్ థాట్స్ పటాపంచలైనాయి. ఈ టీమ్ డిఫరెంట్ అని అర్థమయింది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇదే జోష్‌తో, అదే జోరుతో ఫైనల్ కూడా గెలిచేస్తారన్న గట్టి నమ్మకం ఏర్పడింది. కానీ క్రికెట్ ఓ ఫన్నీ గేమ్. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. పొరపాటున మీరు పరాజయం పాలైనా కూడా ఇంత చక్కగా ఆడిన మిమ్మల్ని మేము ప్రేమిస్తూనే ఉంటాం. అయినా మీకు ఫైనల్లో తిరుగుండదన్నది మా గట్ ఫీలింగ్. కప్పు గెలుచుకుని రండి, కలిసి పార్టీ చేసుకుందాం. ‘ఇండియా విన్స్ ది వాల్డ్ కప్ అఫ్టర్ 11 ఇయర్స్ అండ్ ది పార్టీ స్టార్ట్స్ ఇన్ ది డ్రెస్సింగ్ రూం’ అని ఎలుగెత్తి చాటడానికి రవి శాస్త్రి సిద్ధంగా ఉన్నాడు.

ఇట్లు

సగటు భారత క్రీడాభిమాని

సి.వెంకటేశ్‌

క్రికెట్‌ వ్యాఖ్యాత

Updated Date - 2023-11-19T07:38:07+05:30 IST