British Royal Family: బ్రిటీష్ రాజవంశంలో ఇంత దారుణంగా ఆలోచిస్తారా..!
ABN , First Publish Date - 2023-03-10T13:43:15+05:30 IST
ప్రజలు శాంతి, సామరస్యాలతో మెలిగేలా నడపవలసిన రాజ కుటుంబీకులు నలుపు, తెలుపు తేడాలను సహించలేకపోతున్నారు.
న్యూఢిల్లీ : ప్రజలు శాంతి, సామరస్యాలతో మెలిగేలా నడపవలసిన రాజ కుటుంబీకులు నలుపు, తెలుపు తేడాలను సహించలేకపోతున్నారు. నల్ల (Black) జాతీయురాలికి, శ్వేత (White) జాతీయుడికి పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు యువరాజును సైతం దూరంగా ఉంచారు. సగం నల్ల జాతి యువతికి పుట్టబోయే సంతానం చర్మపు రంగు ఎలా ఉంటుందోనని గాబరాపడ్డారు. అతి సాధారణ వ్యక్తుల్లాగానే గట్టిగా అరుచుకుంటూ, చేయి చేసుకున్నారు. ఈ ఆధునిక యుగంలో ఈ జగడాలను చూసినవారు నివ్వెరపోతున్నారు.
బ్రిటన్‌లోని విండ్సర్స్ ఫ్రాగ్మోర్ కాటేజీని వేసవి కాలం వచ్చేనాటికి ఖాళీ చేయాలని ప్రిన్స్ హ్యారీని కింగ్ ఛార్లెస్-3 కోరడంతో వీరి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. క్వీన్ ఎలిజబెత్-2 ఈ నివాసాన్ని హ్యారీ దంపతులకు బహుమతిగా ఇచ్చారు.
ప్రిన్స్ హారీ, మేఘన్ మార్క్‌లే దంపతులు 2020 జనవరిలో రాయల్ డ్యూటీస్‌ను వదిలిపెట్టి, రాజకుటుంబానికి దూరంగా అమెరికాలో నూతన జీవితాన్ని ప్రారంభించారు. నల్ల జాతీయురాలికి, శ్వేత జాతీయునికి పుట్టిన, ఆధునిక తరానికి చెందిన మేఘన్ పట్ల కాలం చెల్లిన బ్రిటిష్ రాజవంశం తీవ్రంగా విరుచుకుపడిందని, జాత్యహంకారాన్ని ప్రదర్శించిందని వీరి మద్దతుదారులు ఆరోపిస్తుంటారు. ఓ వార్తా పత్రికలో మేఘన్ గురించి ప్రచురితమవడంతో ఆమెను రాజవంశం ఎగతాళి చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తన నడవడికపై ఈ దాడిని మేఘన్ తట్టుకోలేకపోతున్నారని, చాలా విచారిస్తున్నారని ఆమె ప్రతినిధి ఒకరు చెప్పారు.
సాదాసీదా వ్యక్తినే...
నల్ల జాతీయురాలికి, శ్వేత జాతీయుడికి జన్మించిన మేఘన్ మార్క్‌లే (Meghan Markle), ప్రిన్స్ హ్యారీ (Prince Harry) వివాహం 2018 మే 19న బ్రిటన్‌లోని విండ్సర్ కేజిల్, సెయింట్ జార్జి చాపెల్‌లో జరిగింది. మేఘన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజ కుటుంబంలోకి అడుగు పెట్టేసరికి తాను సాదాసీదా వ్యక్తినని, సహాయం కోసం అర్థించినప్పటికీ, ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని, అక్కడి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను ప్రేరేపించాయని చెప్పారు.
పుట్టబోయే బిడ్డ చర్మపు రంగుపై ఆందోళన
తనకు పుట్టబోయే బిడ్డ గురించి రాజ వంశంలో మాట్లాడుకునేవారని, తనకు పుట్టబోయే బిడ్డకు యువరాజు లేదా యువరాణి బిరుదును ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదని చెప్పారు. తాను గర్భిణిగా ఉన్న సమయంలో ‘‘నీకు భద్రత ఇవ్వరు, నీకు బిరుదు ఇవ్వరు’’ అని అనేవారని తెలిపారు. పుట్టబోయే బిడ్డ చర్మపు రంగు తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? అనే ఆందోళనతో మాట్లాడుకునేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సంభాషణలు ఎవరు ఎవరితో జరిపేవారో చెప్పడానికి ఆమె నిరాకరించారు. ‘‘మీరు మౌనంగా ఉన్నారా? మీ నోరు మూయించారా?’’ అని అడిగినపుడు మేఘన్ సమాధానం చెప్తూ, ‘‘రెండోదే’’ అన్నారు.
పెళ్లితోనే కష్టాలు
‘‘మాకు పెళ్లయింది, పరిస్థితులు దయనీయంగా మారడం మొదలైంది. తప్పుడు ఆరోపణల నుంచి నన్ను కాపాడటంలో రాజకుటుంబం విఫలమవుతోందని నాకు అర్థమైంది. అంతేకాకుండా కుటుంబంలోని ఇతర సభ్యులను కాపాడుతున్నామంటూ వారు అబద్ధం చెప్తున్నారని కూడా అర్థమైంది’’ అని మేఘన్ వాపోయారు. క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) తన పట్ల ఎల్లప్పుడూ బాగానే ఉండేవారని తెలిపారు.
ఏడిచాను...
కేట్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్)ను మీరు ఏడిపించారా? అని అడిగినపుడు మేఘన్ బదులిస్తూ, అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో కేట్ అప్‌సెట్ అయ్యారని, తాను ఏడిచానని, తన మనసును అది గాయపరిచిందని చెప్పారు. మీడియాతో తన సంబంధాలను మలుపు తిప్పిన సంఘటన అదేనని చెప్పారు.
మేఘన్ గొప్ప సహాయకారి : హ్యారీ
ప్రిన్స్ హ్యారీ తన జీవితం గురించి ‘స్పేర్’ (Spare) అనే పుస్తకంలో వివరించారు. ఆయన ఈ ఏడాది జనవరిలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేఘన్ మార్క్‌లే తన జీవితాన్ని చక్కదిద్దారని చెప్పారు. రాజ కుటుంబంతో కలిసి ఉన్నపుడు తాను అంధకారంలో ఉండేవాడినని, అటువంటి పరిస్థితుల్లో తన నుంచి తనకు విముక్తి కల్పించి, తనను కాపాడిన గొప్ప వ్యక్తి మేఘన్ అని చెప్పారు. రాజ కుటుంబానికి బయట ఓ ప్రపంచం ఉందని, అక్కడి నుంచి వచ్చిన మేఘన్ తనకు ఎంతో సహాయకారిగా ఉన్నారని తెలిపారు. 2019లో మేఘన్ గురించి జరిగిన వాగ్వాదం సందర్భంగా తనను తన సోదరుడు ప్రిన్స్ విలియం కొట్టారని, దాంతో తాను క్రింద పడ్డానని చెప్పారు.
శుభకార్యానికి గైర్హాజరు
రాజ కుటుంబంలో ఈ జగడాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రిన్స్ హారీ, మేఘన్ మార్క్‌లే దంపతుల రెండో బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ డయానా (Princess Lilibet Diana)కు ఇటీవల బాప్టిజంలో క్రైస్తవ విధానంలో నామకరణం చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమానికి హ్యారీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. కింగ్ ఛార్లెస్-3 (King Charles III), క్వీన్ కేమిలా (Queen Camilla), ప్రిన్స్ విలియం (Prince William), కేట్ మిడిల్టన్ (Kate Middleton)లను కూడా ఆహ్వానించారు. కానీ వీరు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
లాస్ ఏంజెలిస్ ఆర్చ్ బిషప్ రెవరెండ్ జాన్ టేలర్ మార్చి 3న లిలిబెట్‌కు బాప్టిజం ఇచ్చారు. లిలిబెట్ వయసు 21 నెలలు. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది హాజరయ్యారు. మేఘన్ తల్లి డోరియా రగ్లండ్ (Doria Ragland), నటుడు, సినీ నిర్మాత టేలర్ పెర్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణానంతరం ప్రిన్స్ హ్యారీ తండ్రి బ్రిటన్ మహారాజు అయ్యారు. కాబట్టి హ్యారీ, మేఘన్ దంపతుల సంతానానికి ప్రిన్స్, ప్రిన్సెస్ బిరుదులు లభిస్తాయి. వీరికి నాలుగేళ్ల వయసుగల కుమారుడు ఆర్చీ (Archie) ఉన్నారు.
మనసే ముఖ్యం
దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే, జాత్యహంకారం, అసమానతలు వంటివి తొలగిపోవాలంటే సమాజంలో ఉన్నత స్థాయి సరిపోదు, మానసిక స్థాయి ఉన్నతంగా ఉండాలి.