Cricketer Heart Attack: తీవ్ర విషాదం.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో క్రికెటర్ మృతి
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:57 PM
గత కొంతకాలం నుంచి గుండెపోటు సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ కాలం నుంచి ఈ తరహా కేసులు విపరీతంగా పెరిగాయి. బలంగా, ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం గుండెపోటు బారిన..
Cricketer Heart Attack: గత కొంతకాలం నుంచి గుండెపోటు సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ కాలం నుంచి ఈ తరహా కేసులు విపరీతంగా పెరిగాయి. బలంగా, ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. డాన్స్ చేస్తూనో, ఆటలు ఆడుతూనో, కొందరు ఉన్నపళంగానే కుప్పకూలిపోవడం వంటి విషాద ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదమే ఒకటి చోటు చేసుకుంది. ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో శనివారం సాయంత్రం ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఇందల్ సింగ్ జాదవ్ బంజారా అనే 22 ఏళ్ల కుర్రాడు బౌలింగ్ చేసేందుకు రంగంలోకి దిగాడు. మొదట్లో అతడు బాగానే కనిపించాడు కానీ, బౌలింగ్ చేసే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో.. తోటి ఆటగాళ్లందరూ కలిసి వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే మృతి చెందినట్టు బద్వా సివిల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వికాస్ తల్వేర్ తెలిపారు. గుండెపోటుతోనే అతడు మృతి చెందాడని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం బంజారా మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇందల్ సింగ్ బంజారా ‘బర్ఖడ్ తండా గ్రామ’ అనే జట్టు తరఫున ఆడాడని.. తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు అతడు ఆరోగ్యంగా, చాలా చురుకుగా కనిపించాడని శాలిగ్రామ్ గుర్జర్ అనే గ్రామస్థుడు తెలిపాడు. కానీ.. బౌలింగ్ చేసే సమయంలో తనకు ఛాతీ నొప్పి వస్తోందని చెప్పి, బంజారా ఒక చెట్టు కింద కూర్చున్నాడని చెప్పాడు. తమ జట్టు గెలిచిన తర్వాత బంజారా పరిస్థితి మరింత దిగజారడంతో.. తనని ఆసుపత్రికి తీసుకెళ్లమని అతడు ఇతర ఆటగాళ్లను కోరాడని, దాంతో బద్వా సివిల్ ఆసుపత్రికి తరలించాడని పేర్కొన్నాడు. కానీ.. మార్గమధ్యంలోనే బంజారా మృతిచెందాడని గుర్జార్ వివరించాడు. చేతికి అందివచ్చిన కుర్రాడు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. బంజారా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.