BBC Documentary row: డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2023-02-03T14:39:41+05:30 IST
బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని..
న్యూఢిల్లీ: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం (BBC Documentary row)పై కేంద్రానికి సుప్రీంకోర్టు (Supreme court) నోటీసులు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశాలిచ్చింది. కేంద్ర తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.
'ఇండియా: ది మోడీ క్వశ్చన్' అనే పేరుతో 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం సృష్టించింది. కేంద్రం ఈ డాక్యుమెంటరీని, ఇందుకు సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేసింది. ఈ డాక్యుమెంటరీ తప్పుదారి పట్టంచే విధంగాను, కుట్రపూరితంగానూ ఉందని, రాజ్యంగవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని విమర్శిస్తూ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఇంగ్లాండులోనూ భారత సంతతి ప్రజలు ఆక్షేపణ తెలిపారు. జనవరి 21వ తేదీని ఐటీ రూల్స్ 2021 ప్రకారం తమకున్న విశేషాధికారాలతో యూట్యూబ్, ట్విట్టర్‌లో డాక్యుమెంటరీలకు సంబంధించిన లింక్స్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం చర్య మీడియా స్వేచ్ఛకు, సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును కాలరాయడమేనని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం నిషేధం తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.