Britain : రిషి సునాక్‌కు పదవీ గండం?

ABN , First Publish Date - 2023-01-09T11:33:30+05:30 IST

బ్రిటన్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ (Rishi Sunak)కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురు దెబ్బ

Britain : రిషి సునాక్‌కు పదవీ గండం?
Rishi Sunak

న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ (Rishi Sunak)కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబరులో అప్పటి ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషితోపాటు ఉప ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి స్టీవ్ బార్‌క్లే, మరికొందరు ప్రముఖులు గెలిచే అవకాశం లేదని వెల్లడైంది. ఈ పోల్ ఫలితాలను బ్రిటిష్ వార్తా పత్రికలు ప్రచురించాయి.

బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఫోకల్‌డేటా (Focaldata) నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం, రిషి సునాక్, డొమినిక్ రాబ్, స్టీవ్ బార్‌క్లే, ఫారిన్ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలేస్, బిజినెస్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్, కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ థెరెసా కొఫ్ఫీ తమ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది.

కేబినెట్ మంత్రులు జెరెమీ హంట్, భారతీయ మూలాలుగల సువెల్లా బ్రవర్మన్, మైఖేల్ గోవ్, నాధిమ్ జవావి, కెమి బడెనోచ్ మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. 10 ముఖ్యమైన స్థానాల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూమి స్మిత్ మాట్లాడుతూ, తుడిచిపెట్టుకుపోవడమే రిషి సునాక్ మంత్రివర్గానికి తగినదని చెప్పారు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలని, అంతర్జాతీయ విలువలను పాటించాలని నూమి స్మిత్ ప్రచారం చేస్తున్నారు.

రిషి సునాక్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, చట్టవిరుద్ధ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ‘‘మన పిల్లలు, మనుమల కోసం మెరుగైన భవిష్యత్తును నా ప్రభుత్వం నిర్మిస్తుంది’’ అని చెప్పారు. తన ప్రభుత్వం సాధించే ఫలితాల ఆధారంగా తీర్పు చెప్పాలని ప్రజలను కోరారు. ‘‘మీ ప్రాధాన్యతలే, నా ప్రాధాన్యతలు. కలిసికట్టుగా మనం మెరుగైన భవిష్యత్తును నిర్మించుకుందాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-01-09T11:33:34+05:30 IST