సిక్కింలో క్లౌడ్ బరస్ట్
ABN , First Publish Date - 2023-10-05T02:36:00+05:30 IST
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి మేఘాలు గర్జించడం(క్లౌడ్ బర్‌స్ట)తో తీస్తానది ఉప్పొంగి ప్రవహించింది..
14 మంది దుర్మరణం.. 120 మంది గల్లంతు.. గల్లంతైన వారిలో 22 మంది సైనికులు
సిలిగురి వద్ద దెబ్బతిన్న నేషనల్ హైవే
దేశంతో సిక్కింకు సంబంధాలు కట్
గ్యాంగ్‌టక్, అక్టోబరు 4: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకాశానికి చిల్లులు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి మేఘాలు గర్జించడం(క్లౌడ్ బర్‌స్ట)తో తీస్తానది ఉప్పొంగి ప్రవహించింది. నది నీటిమట్టం 15-20 అడుగుల మేర పెరిగి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలకు తీస్తానది పరీవాహక ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల 16 మంది మృతిచెందగా.. 10 మంది గాయపడ్డారు. మరో 120 మంది గల్లంతయ్యారు. వారిలో 22 మంది ఆర్మీ జవాన్లున్నారు. కుండపోత కారణంగా సిలిగురి వద్ద జాతీయ రహదారి-10 చాలా చోట్ల దెబ్బతిన్నది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా రోడ్డు కుంగిపోయింది. మరికొన్ని చోట్ల తెగిపోయింది. దీంతో.. సిక్కింతో దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
లొహాంక్ సరస్సు వద్ద మొదలై..
ఒక ప్రదేశంలో.. గంట వ్యవధిలో 10 సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్‌స్టగా చెబుతారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక సిక్కిం వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. 1.30 సమయంలో కుండపోత కారణంగా ఉత్తర సిక్కింలోని లొహాంక్ సరస్సు నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రవాహం తీస్తానదిలోకి చేరింది. దాంతో చుంగ్‌థాంగ్ డ్యామ్‌కు వరద పోటెత్తింది. చూస్తుండగానే నీటిమట్టం మీటర్లలో పెరిగింది. 778 మీటర్ల మేర నీటిమట్టం నమోదవ్వడం.. 50 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వరదనీరు రావడంతో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. బుధవారం మధ్యాహ్నానికి ఎగువన వర్షాలు కొనసాగడం, ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరగడంతో పలు చోట్ల డ్యామ్ దెబ్బతిన్నది. డ్యామ్ భాగాలు కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మంగళవారం అర్ధరాత్రి డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో.. సింగ్టమ్‌లోని బర్దంగ్ వద్ద ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది. తీస్తానది వరదల కారణంగా బుధవారం రాత్రి వరకు 16 మంది మృతిచెందినట్లు తేలిందని గ్యాంగ్‌టక్ సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ మహేంద్ర ఛెత్రి తెలిపారు. మరో 10 మందికి గాయాలయ్యాయని, 45మందిని విపత్తు నివారణ బృందాలు కాపాడాయని పేర్కొన్నారు. తీస్తానది వరద ఉధృతికి బలువాతర్ వంతెన, ఇంద్రాణీ స్టీల్ బ్రిడ్జి సహా 14 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ల్యాంకో జలవిద్యుత్తు కేంద్రం సమీపంలోని మరో బ్రిడ్జి కూడా దెబ్బతిన్నదని వివరించారు. బుధవారం సాయంత్రానికి తూర్పు సిక్కింలోని ఖానితర్ వద్ద కూడా తీస్తానది నీటిమట్టం 298.4 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. పశ్చిమబెంగాల్ ఉత్తరప్రాంతంలోని తీస్తానది పరీవాహక ప్రాంతాలకు కూడా వరద ముప్పు పొంచి ఉందని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశామని వివరించారు. బంగ్లాదేశ్‌కు కూడా తీస్తానది వరదతో ముప్పు ఉందన్నారు.
ఇతర ప్రాంతాలతో రాకపోకలు కట్
సిక్కింతో దేశంలోని ఇతర ప్రాంతాలను కలిపే సిలిగురి వద్ద జాతీయ రహదారి(ఎన్‌హెచ్-10) చాలా చోట్ల దెబ్బతిన్నది. పలుచోట్ల రోడ్డు కుంగిపోయి, భారీ గోతులు పడ్డాయని, కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోయిందని పలువురు పర్యాటకులు వెల్లడించారు. గురువారం కూడా సిక్కిం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిక్కిం వరదలను ఆ రాష్ట్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. అంతకు ముందు ప్రధాని మోదీ సిక్కిం సీఎం పీఎస్ తమాంగ్‌కు ఫోన్ చేశారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత సిక్కింను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే మూడు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు తీస్తానది పరీవాహక ప్రాంతాల్లో మోహరించాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి.. సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నాయి.
మరో మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పశ్చిమ బెంగాల్, ఒడిసా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ బుధవారం భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిసాలోని 11 జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉన్నాయని వివరించింది. ఝార్సుగూడ, సంబల్‌పూర్, బౌధ్, ధేన్కనాల్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపడ, కటక్, జగత్‌సింగ్‌పూర్‌లలో గురువారం కూడా వర్ష సూచనలున్నట్లు తెలిపింది. ఝార్ఖండ్‌లోని గార్వా జిల్లాలో అత్యధికంగా 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ భారీ వర్షాలు కురిశాయని చెప్పింది