Opposition Unity : ‘ఐ లవ్ యూ’ చెప్పేదెవరు : కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-02-18T15:46:48+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాల గురించి ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పాట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాల గురించి ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఐకమత్యంగా పోరాడవలసిందేనని కాంగ్రెస్, జేడీయూ భావిస్తున్నాయి. అయితే ముందుగా ఎవరు ‘ఐ లవ్ యూ’ చెబుతారని కాంగ్రెస్ (Congress) ప్రశ్నిస్తుండగా, ‘మేం ఎదురు చూస్తున్నాం’ అని జేడీయూ (JDU) అంటోంది.
బీజేపీ (BJP)ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్‌కు జేడీయూ, ఆర్జేడీ (RJD) పిలుపునిచ్చాయి. వెనువెంటనే కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid) సానుకూలంగా స్పందించారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పాట్నాలో గురువారం నుంచి శనివారం వరకు సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మాట్లాడుతూ, బీజేపీపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్‌ను కోరారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ ఆలస్యం చేయకూడదన్నారు. తాము ఎదురు చూస్తున్నామని, తాము ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశామని చెప్పారు. సల్మాన్ ఖుర్షీద్‌ను ఉద్దేశించి, ‘‘మీ ద్వారా కాంగ్రెస్‌కు మా వినతి’’ అని చెప్పారు. ప్రతిపక్షాలు ఏకమైతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 100 స్థానాల కన్నా తక్కువే వస్తాయని చెప్పారు. బిహార్‌లో ప్రతిపక్ష పార్టీలన్ని సమైక్యంగా పని చేస్తున్నాయన్నారు. 2024లో ప్రతిపక్ష పార్టీలన్నీ సమైక్యంగా పోరాడాలన్నారు. అప్పుడు మాత్రమే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav), జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) కూడా పాల్గొన్నారు. నితీశ్ ప్రభుత్వానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వెలుపలి నుంచి మద్దతిస్తోంది.
తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, డ్రైవింగ్ సీటులోకి ప్రాంతీయ పార్టీలు రావడానికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలన్నారు. బీజేపీతో ప్రత్యక్ష పోరు ఉన్న చోట్ల కాంగ్రెస్ పోటీ చేయాలని, ఇక కాంగ్రెస్ ఆలస్యం చేయకూడదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఖుర్షీద్ మాట్లాడుతూ, మీరు కోరుకుంటున్నదానినే కాంగ్రెస్ కూడా కోరుకుంటోందన్నారు. ప్రేమలో కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయన్నారు. ముందుగా ఎవరు ‘ఐ లవ్ యూ’ చెప్పాలి? అన్నారు. ప్రతిపక్షాలు త్వరగా ఏకతాటిపైకి రావాలనడంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Sharad Pawar : ఎన్నికల గుర్తు మార్పుపై ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ సలహా
George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు