Sugarcane price: చెరకు రైతులకు ఈ సీజన్ పండగే...
ABN , First Publish Date - 2023-06-28T18:17:30+05:30 IST
చెరకు పండించే రైతులకు కేంద్రం తీపివార్త చెప్పింది. చెరకు 'ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్' ధరను క్వింటాల్‌కు రూ.10 పెంచింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్‌కు ఈ పెంపు వర్తిస్తుంది. ఆ ప్రకారం చెరకు రైతులకు మిల్లులు క్వింటాల్‌కు రూ.315 చెల్లించాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: చెరకు(Sugarcane) పండించే రైతులకు కేంద్రం తీపివార్త చెప్పింది. చెరకు 'ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్' (FRP) ధరను క్వింటాల్‌కు రూ.10 పెంచింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్‌కు ఈ పెంపు వర్తిస్తుంది. ఆ ప్రకారం చెరకు రైతులకు మిల్లులు క్వింటాల్‌కు రూ.315 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో చెరకు ఎప్ఆర్‌పీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం, 2022-23 మార్కెటింగ్ ఇయర్ (అక్టోబర్-సెప్టెంబర్)లో ఉన్న ధర కంటే 2023-24 సీజన్‌లో 3.28 శాతం పెంపు జరిగింది. క్వింటాల్ ధర రూ.315గా నిర్ణయించారు.
చెరకు ఎఫ్ఆర్‌పీ మునుపెన్నడూ లేనంతగా ఈసారి పెంచడం జరిగిందని మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 5 కోట్ల మంది చెరకు రైతులు, వారిపై ఆధారపడే కుటుంబాలు, చక్కెర మిల్లుల్లో పనిచేసే 5 లక్షల మంది కార్మికులు, అనుబంధ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గత ఏడాది చెరకు ఎఫ్ఆర్‌పీ క్వింటాల్‌కు రూ.305 ఉన్నట్టు తెలిపారు. 2014-15 సీజన్‌లో క్వింటాల్ రూ.210 ఉన్న చెరకు ఎఫ్ఆర్‌పీ ఈ సీజన్‌లో రూ.315కు చేరిందన్నారు.
ప్రధానమంత్రి ఎప్పుడూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, వ్యవసాయం, రైతులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. పెండింగ్ బకాయిలపై చెరకు రైతులు నిరసనలు చేసిన సందర్భాలే లేవని చెప్పారు. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం కమిషన్ ఫర్ అగ్నికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ఎఫ్ఆర్పీని నిర్ణయిస్తుంటారు.