Share News

Rainfall: రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:46 AM

రాష్ట్రంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Rainfall: రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

  • తేలికపాటి నుంచి మోస్తరుగా కురిసే అవకాశం

  • నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కురిసిన వాన

హైదరాబాద్‌ సిటీ, నిర్మల్‌ , మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నైరుతి మధ్యప్రదేశ్‌ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ద్రోణి ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా ఉత్తర ఒడిశా వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌, కుమరంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలతోపాటు మరికొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


ఈ నెల 23 వరకు సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 24 నుంచి మళ్లీ పెరుగుతాయని పేర్కొన్నారు. కాగా నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో గురువారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నంఎండలు దంచికొట్టగా.. రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిర్మల్‌తోపాటు ముథోల్‌, దిలావర్‌పూర్‌, ఖానాపూర్‌ ప్రాంతాల్లో వాన పడింది. ఉరుములు, మెరుపులతో మొదలైన వాన దాదాపు 15 నిమిషాలు కొనసాగింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు డిచ్‌పల్లి, మాధవ్‌నగర్‌, మాక్లూర్‌, బోధన్‌లోనూ వర్షం కురిసింది. కొద్దిపాటి వాన వరి పంటకు మేలు చేయగా, మొక్కజొన్న రైతులను ఆందోళనకు గురిచేసింది.

Updated Date - Mar 21 , 2025 | 04:46 AM