Governor: మళ్లీ ఢిల్లీ వెళ్లిన గవర్నర్
ABN , First Publish Date - 2023-11-26T07:19:33+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) శనివారం ఢిల్లీకి ఆకస్మికంగా బయలుదేరివెళ్లారు. ఈ వారంలో ఆయన
- సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల సంకేతాలతో డైలమా
- నేడు అమిత్‌షాతో భేటీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) శనివారం ఢిల్లీకి ఆకస్మికంగా బయలుదేరివెళ్లారు. ఈ వారంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈనెల 19న ఆయన ఢిల్లీ వెళ్లి, సోమవారం మధ్యాహ్నం చెన్నై(Chennai)కి తిరిగొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే పంజాబ్, కేరళ గవర్నర్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారి తీరును తూర్పారబట్టింది. అదే తరహాలో గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకమైన తీర్పు వెలువడే అవకాశాలే ఉన్నాయంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) కూడా చెబుతున్నారు. పంజాబ్ గవర్నర్‌కు వ్యతిరేకంగా జారీ అయిన తీర్పును ఉటంకించే సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించనున్నామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కీలకమైన బిల్లులను గవర్నర్ రవి తిప్పిపంపడం, శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ రెండోమారు ఆ బల్లులను యథాతథంగా ఆమోదించి పంపిన నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులున్న శాసనసభకే సర్వాధికారాలు ఉన్నాయని, ఆ సభలో ఆమోదించే బిల్లులను గవర్నర్ పరిశీలించి ఆమోదించడం మినహా మరో గత్యంతరం లేదంటూ పంజాబ్ గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఇటీవలే తేల్చిచెప్పింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ రవి రెండోమారు ఒకరోజు పర్యటన నిమిత్తం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ఢిల్లీకి పయనమయ్యారు. గవర్నర్‌తోపాటు ఆయన ప్రత్యేక కార్యదర్శి, భద్రతావిభాగం అధికారి కూడా బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అవుతున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల వ్యవహారంలో తను తీసుకోవాల్సిన నిర్ణయం తదితరాలపై గవర్నర్ కేంద్ర హోంమంత్రితో చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఆయన ఢిల్లీలో బయలుదేరి చెన్నైకి రానున్నారు.