Share News

Heavy rain: 20 జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2023-11-23T08:55:57+05:30 IST

రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఈనెల 23న గురువారం కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక

Heavy rain: 20 జిల్లాలకు భారీ వర్షసూచన

- బంగాళాఖాతంలో 26న అల్పపీడనం

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఈనెల 23న గురువారం కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా చెన్నై(Chennai)తో పాటు 20 జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. తిరునల్వేలి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. గురువారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ 20 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చెన్నైలో బుధవారం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, కొన్ని ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలావుండగా బుధవారం కన్నియాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. భారీ నుంచి అతిభారీ వర్షం అంటే కనిష్ఠంగా 11 సెంటీమీటర్లు, గరిష్టంగా 20 సెంటీమీటర్ల వర్షపాతంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

nanu1.jpg

అల్పపీడనం...

ఇదిలా ఉండగా ఈనెల 26న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయుపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెనుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అండమాన్‌ సమీపంలో ఏర్పడే ఆ అల్పపీడనం నైరుతి దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో చేపలవేట సాగిస్తున్న జాలర్లంతా ఈ నెల 25 లోపలే తీరానికి తిరిగిరావాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

22 విమాన సర్వీసులు ఆలస్యం

ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ప్రతికూల వాతావరణం నెలకొనడంతో చెన్నై నుంచి బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళాల్సిన 12 విమాన సర్వీసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన విమానాలతో కలిపి మొత్తం 22 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అదేవిధంగా దక్షిణాది జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా వ ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. కాగా, ఈనెల 27వ తేదీ వరకు ఈ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated Date - 2023-11-23T08:55:59+05:30 IST