Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధూ, డీకే వర్గాల పోటాపోటీ
ABN , First Publish Date - 2023-04-04T11:09:47+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉద్ధృతమవుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉద్ధృతమవుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేతలు డీకే శివ కుమార్ (DK Shivakumar), సిద్ధరామయ్య (Siddaramaiah) మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరిద్దరూ తమకు మద్దతిచ్చేవారు ఎన్నికల్లో గెలిచే విధంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తున్నట్లు వెల్లడవుతోంది.
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. 224 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో తన వర్గానికి టిక్కెట్లు ఇప్పించుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు (state Congress president) డీకే శివ కుమార్ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అదే పనిలో తీరిక లేకుండా గడుపుతున్నారు.
టిక్కెట్లను ఆశిస్తున్నవారి మద్దతుదారులు ఇటీవల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) కార్యాలయం వద్ద నిరసనలకు దిగుతున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు నియోజకవర్గం, చిక్కమగళూరు జిల్లాలోని తారికేరే నియోజకవర్గం టిక్కెట్లను ఆశిస్తున్నవారి మద్దతుదారులు సోమవారం కేపీసీసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
మొలకల్మూరు ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ (బీజేపీ)ని కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నియోజకవర్గం నుంచి యోగేశ్ బాబుకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోలార్‌లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం నిరసన గళం వినిపించారు. తమ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్యను పోటీ చేయించాలని వీరు డిమాండ్ చేశారు. బయటివారికి టిక్కెట్ ఇవ్వవద్దంటూ చిక్కమగళూరు కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేశారు.
జేడీఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌వీ దత్త మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. అదేవిధంగా శాసన సభ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ ప్రసంగం కూడా ఆసక్తికరంగా మారింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తేవాలని వీరు చెప్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా శివ కుమార్ కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా బెళగావి, తదితర జిల్లాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులపై శివ కుమార్ దృష్టి సారించినట్లు చెప్తున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో సహాయపడతానని ఆయన హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
రమేశ్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ, సిద్ధరామయ్యను పక్కనబెడితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందన్నారు. సిద్ధరామయ్య పార్టీని వీడితే కాంగ్రెస్‌కు ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టిన గతే కర్ణాటకలో కూడా పడుతుందన్నారు. సిద్ధరామయ్య కోలార్ నుంచి పోటీ చేయకపోతే జిల్లాలో పార్టీ పుట్టి మునుగుతుందని హెచ్చరించారు. సిద్ధరామయ్య 2018లో మాదిరిగానే ఇప్పుడు కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాల మధ్య భేదాభిప్రాయాలు సద్దుమణగడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు అర్బన్‌లోని పులకేశినగర్ స్థానం నుంచి బరిలోకి ఎవరిని దించాలనే అంశంపై ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా ఉందని సమాచారం. సిద్ధరామయ్య విధేయుడు అఖండ శ్రీనివాస్ మూర్తి, శివ కుమార్ వర్గీయుడు ఆర్ సంపత్ రాజు ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అఖండ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యే కాగా, సంపత్ బెంగళూరు మాజీ మేయర్. ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అఖండ శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు.
సుమారు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేయవలసి ఉంది. దీనిపై చర్చించేందుకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమవుతుంది.
ఇవి కూడా చదవండి :
Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?
West Bengal: హుగ్లీలో చెలరేగిన హింసాకాండ...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు