Kaveri: ‘కావేరి’కి భారీగా వరద నీరు.. దోనె సవారీ, పర్యాటకులకు నిషేధం
ABN , First Publish Date - 2023-07-27T13:12:17+05:30 IST
హొగెనేకల్ జలపాతం వద్ద కావేరి(Kaveri) జలాల ఉధృతి అధికంగా ఉండడంతో దోనెల సవారీ, పర్యాటకుల సందర్శనకు నిషేధించారు. కర్ణాటక రా
పెరంబూర్(చెన్నై): హొగెనేకల్ జలపాతం వద్ద కావేరి(Kaveri) జలాల ఉధృతి అధికంగా ఉండడంతో దోనెల సవారీ, పర్యాటకుల సందర్శనకు నిషేధించారు. కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజసాగర్, కబిని డ్యాంలు పూర్తిస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, వాటి నుంచి మిగులు జలాలు కావేరి నదిలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణరాజసాగర్ నుంచి 2,853 ఘనపుటడుగులు, కబిని నుంచి 20 వేల ఘనపుటడుగులు కావేరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీరు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పిల్లిగుండు మీదుగా హొగెనేకల్ జలపాతం వద్దకు చేరుకుంటున్నాయి. మంగళవారం సాయంత్రం హొగెనేకల్‌కు 7,500 ఘనపుటడుగులగా వస్తున్న నీరు బుధవారం ఉదయం 9 వేల ఘనపుటడుగులకు పెరిగింది. కావేరి జలాల ఉధృతితో హొగెనేకల్(Hogenekal) జలపాతం వద్ద దోనెల సవారీ, పర్యాటకుల సందర్శనకు నిషేధం విధిస్తున్నట్లు ధర్మపురి జిల్లా కలెక్టర్ శాంతి(Dharmapuri District Collector Santi) ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక నుంచి నీటి జలాల విడుదల అధికం చేయడంతో హొగెనేకల్‌కు వచ్చే కావేరి ఉదృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
సాగుకోసం...
సేలం జిల్లా మేట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి డెల్టా జిల్లాల సాగు కోసం విడుదల చేస్తున్న నీటిని 10 వేల నుంచి 12 వేల ఘనపుటడుగులకు పెంచారు. కాగా, కర్ణాటక డ్యాం నుంచి విడుదల చేసిన నీరు పిల్లిగుండు, హొగెనేకల్ మీదుగా మేట్టూరు డ్యాంకు చేరుకుంటున్నాయి. బుధవారం గణాంకాల ప్రకారం డ్యాంలో 66.86 అడుగులు (పూర్తి సామర్థ్యం 120 అడుగులు) నీటినిల్వలున్నట్లు, కావేరి జలాల రాకతో నీటిమట్టాలు పెరిగే అవకాశముందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.