Supreme Court: సీల్డు కవర్లకు స్వస్తి పలుకుదాం!
ABN , First Publish Date - 2023-03-21T01:53:27+05:30 IST
కోర్టులకు సీల్డు కవర్లలో సమాచారం అందించే విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తీప్పుపట్టింది. ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని సూచించింది.
ఫిబ్రవరిలోగా ఓఆర్‌ఓపీ బకాయిలు ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 20: కోర్టులకు సీల్డు కవర్లలో సమాచారం అందించే విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తీప్పుపట్టింది. ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని సూచించింది. మాజీ సైనికులకు ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ (ఓఆర్‌ఓపీ) కింద బకాయిల చెల్లింపు విషయమై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. బకాయిల చెల్లింపుపై సీల్డు కవర్‌లో సమర్పించిన నోట్‌ను వెనక్కి తీసుకోవడంగానీ, బహిరంగంగా చదవడంగానీ చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ సీల్డు కవర్ల విధానం..ఆచరణలో ఉన్న న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. వ్యక్తిగతంగా తాను కూడా సీల్డుకవర్లకు వ్యతిరేకమని చెప్పారు. సీల్డ్ కవర్ల వ్యవహారానికి ముగింపు పలకాల్సి ఉందని, కోర్టు కార్యకలాపాల్లో పారదర్శకత ఉండాలని చెప్పారు. ప్రస్తుత కేసు కోర్టు ఉత్తర్వుల అమలుకు చెందిన విషయమని, ఇందులో రహస్యం ఏముంటుందని ప్రశ్నించారు. ఇతరుల ప్రాణాలకు హాని ఉంటుందన్న సందర్భాల్లో తప్ప రహస్య పత్రాలు, సీల్డు కవర్లను స్వీకరించబోమని అన్నారు. తొలుత సుప్రీంకోర్టు దీన్ని అమలు చేస్తే తరువాత హైకోర్టులు పాటిస్తాయని చెప్పారు. దాంతో ఏజీ వెంకటరమణి నోట్‌లోని విషయాలను చదవి వినిపించారు. ‘‘రక్షణ శాఖలో పెన్షనర్లకుపాత బకాయిల కోసం రూ.28వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకే విడతలో ఇంత మొత్తాన్ని చెల్లించడానికి బడ్జెట్ కేటాయింపులు సరిపోవు’’ అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బకాయిల చెల్లింపుపై గత ఏడాది ఇచ్చిన తీర్పును అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. 2019-22 సంవత్సరాల కాలానికిగానూ మాజీ సైనికులకు ఇవ్వాల్సిన రూ.28వేల కోట్ల బకాయిల చెల్లింపులను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి కాలపట్టికను కూడా నిర్ణయించింది. వాస్తవానికి మొత్తం బకాయిలను ఈ ఏడాది ఏప్రిల్ 30నాటికి ఏక మొత్తం రూపంలో చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం కాస్త వెసులుబాటు ఇచ్చింది.
సీజేఐని ప్రతివాదిగా చేర్చుతారా?
న్యాయవాదులను సీనియర్ అడ్వకేట్‌లుగా గుర్తింపు ఇచ్చే నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని ప్రతివాదిగా చేర్చడంపై సోమవారం త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది దురహంకార చర్య అని వ్యాఖ్యానించింది. న్యాయవాది మ్యాథ్యూ జె నెడుంపారా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.