Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్ వెళ్లిపోతున్న మెయిటీలు..
ABN , First Publish Date - 2023-07-23T10:38:40+05:30 IST
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు. గతంలో మిజో నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో పనిచేసినవారు ఇప్పుడు పీస్ అకార్డ్ ఎంఎన్ఎఫ్ రిటర్నీస్ అసోసియేషన్ (PAMRA)గా ఏర్పడి, ఈ హెచ్చరికను జారీ చేశారు. దీంతో మెయిటీలు శనివారం మిజోరాం నుంచి మణిపూర్ వెళ్లిపోవడం ప్రారంభించారు.
భయంతో మిజోరాం నుంచి మణిపూర్ వెళ్లిపోతున్న మెయిటీల కోసం చార్టర్డ్ విమానాలను పంపించేందుకు మణిపూర్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెయిటీల సంఘం నేతలను సంప్రదించింది. అవసరమైతే విమానాలను పంపిస్తామని హామీ ఇచ్చింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో దాదాపు 2,000 మంది మెయిటీలు ఉన్నట్లు అంచనా. వీరు అస్సాంలోని బారక్ లోయకు చెందినవారు. వీరిలో కొందరు ఐజ్వాల్‌లో ప్రభుత్వోద్యోగాలు చేస్తుండగా, కొందరు చదువుకోవడం కోసం వెళ్లారు.
మణిపూర్‌లోని కుకీ-జోమీస్‌కు మణిపూర్‌లోని కుకీలతో గొప్ప అనుబంధం ఉంది. అయితే మెయిటీలు మిజోరాం ప్రజలను ప్రశంసిస్తున్నారు. మిజోలు చాలా మంచివారని, సౌమ్యంగా ఉంటారని, కానీ మిలిటెంట్ల హెచ్చరికల వల్ల తాము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామని చెప్పారు. కొందరు మెయిటీలు తమ వస్తువులను అద్దె ఇళ్లలోనే వదిలిపెట్టి కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారని చెప్పారు. మరికొందరు మెయిటీలు బారక్ లోయ గుండా రోడ్డు మార్గంలో తరలి వెళ్లిపోతున్నారని, కొందరు ఐజ్వాల్ విమానాశ్రయంలో ఆశ్రయం కోరుతున్నారని చెప్పారు.
ఇదిలావుండగా, మిజోరాం హోం శాఖ కమిషనర్ హెచ్ లాలెంగ్మవియా స్పందిస్తూ, తాను PAMRAతో మాట్లాడానని, ఈ సంస్థ విడుదల చేసిన లేఖను మెయిటీలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాము మెయిటీలను బెదిరించలేదని, వారి భద్రత గురించి ఆందోళనతో, సదుద్దేశంతోనే ఈ లేఖను రాశామని చెప్పారని తెలిపారు. ఈ లేఖ ప్రభావం ప్రతికూలంగా ఉన్నందువల్ల దానిని ఉపసంహరించుకోవాలని చెప్పామన్నారు.
మిజోరాం హోం డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనలో, ఆల్ మిజోరాం మణిపురి అసోసియేషన్‌తో తాము చర్చించామని తెలిపింది. మెయిటీల భద్రతకు హామీ ఇచ్చినట్లు తెలిపింది. వదంతులను నమ్మవద్దని, రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవద్దని, తోటి మెయిటీలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరింది.
ఇవి కూడా చదవండి :
Irshalwadi landslide : పెద్ద మనసు చాటుకున్న సీఎం
Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల