Rajouri Attack: విద్వేషాలను రెచ్చగొట్టిన ఫలితమే ఇది...

ABN , First Publish Date - 2023-01-02T20:13:18+05:30 IST

శ్రీనగర్: రాజౌరీలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు నలుగురు హిందువులపై తుపాకీ గుళ్ళ వర్షం కురిపించి పొట్టన పెట్టుకున్న ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా..

Rajouri Attack: విద్వేషాలను రెచ్చగొట్టిన ఫలితమే ఇది...

శ్రీనగర్: రాజౌరీ (Rajouri)లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు నలుగురు హిందువులపై తుపాకీ గుళ్ళ వర్షం కురిపించి పొట్టన పెట్టుకున్న ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) స్పందించారు. విద్వేషం, హిందూ-ముస్లింల విభజన ఫలితమే ఈ ఘటన అని అన్నారు. ''దేశంలో చాలా జరుగుతున్నాయి. అమాయకులను చంపుతున్నారు. హిందూ-ముస్లింల మధ్య దూరం పెరిగిపోతోంది. దీనికి హోం మంత్రి ఒక పరిష్కారం కనుగోవాలి'' అని ఆయన అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం నేరుగా రాజౌరి ఉగ్ర ఘటన ఖండించలేదు. హిందూ-ముస్లిం విభజన ఫలితంగానే ఈ ఘటన అని పేర్కొన్నారు. ''ఇక్కడ ముస్లింలను ప్రతిరోజూ చంపుతున్నారు. మన హిందూ సోదరులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక నిర్దిష్ట పార్టీ ఈ ఘటనలను తమ స్వప్రయోజనాలను కోసం ఉపయోగించుకుంటూ హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తోంది'' అని అన్నారు.

కాగా, రాజౌరీలో హిందువులను ఉగ్రవాదులు చంపడానికి ముందు ఆధార్ కార్డుల ద్వారా వారు హిందువులేనని నిర్ధారించుకున్నారని, ఆ తర్వాతే వారిపై కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఉగ్రవాదులు తొలుత అప్పర్ డాంగ్రీలోని ఓ ఇంటిపై దాడి చేసి, ఆ తర్వాత 25 మీటర్ల దూరంలో మరోమారు కాల్పులు జరిపారు. అనంతరం మరో 25 మీటర్ల దూరం వెళ్లి మరో ఇంటిపై కాల్పులు జరుపుతూ గ్రామం నుంచి పారిపోయారు. కేవలం 10 నిమిషాల్లోనే ఉగ్రవాదులు తమ పని పూర్తి చేసుకుని పరారయ్యారు.

Updated Date - 2023-01-02T20:14:41+05:30 IST