Nirmala Sitaraman: జయలలిత చీరను లాగారు, ఆ అవమానాన్ని మర్చిపోయారా?.. ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

ABN , First Publish Date - 2023-08-10T18:16:40+05:30 IST

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో ఎక్కడైనా మహిళలపై..

Nirmala Sitaraman: జయలలిత చీరను లాగారు, ఆ అవమానాన్ని మర్చిపోయారా?.. ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే వాటిని తీవ్రంగా పరిగణించాలే గానీ రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. ఇదే సమయంలో.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానాన్ని సైతం గుర్తు చేస్తూ.. డీఎంకే సభ్యులపై విమర్శనాస్త్రాలు సంధించారు.


తొలుత సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇందుకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. ‘‘మణిపూర్, రాజస్థాన్‌, ఢిల్లీతో సహా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే, దాన్ని తీవ్రంగా పరిగణించాలి. అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. ఇదే టైంలో నేను ఒక సంఘటన గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అది 1989 మార్చి 25వ తేదీ. ఆరోజు ప్రతిపక్ష నాయకురాలైన ఒక మహిళను నిండు సభలో అవమానించారు. అసెంబ్లీలో ఆమె చీరను లాగారు. అప్పుడు డీఎంకే సభ్యులు ఆమెను చూసి నవ్వారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని జయలలిత ప్రమాణం చేశారు. ఆమె చెప్పినట్టుగానే రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు’’ అని చెప్పారు.

కౌరవ సభ, ద్రౌపది గురించి మాట్లాడుతున్న మీరు.. జయలలిత గురించి మర్చిపోయారా? అని డీఎంకే సభ్యుల్ని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. అయితే.. జయలలిత గురించి ఆర్థికమంత్రి మాట్లాడుతున్నప్పుడు ‘అప్పట్లో జయలలిత అది అల్లిన డ్రామా’ అంటూ ప్రతిపక్షాలు కేకలు వేశారు. అయినా ఆమె పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. సెంగోల్‌ను న్యాయానికి చిహ్నంగా కొత్త పార్లమెంటులో అమర్చామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్నాళ్లూ దాన్ని మర్చిపోయి మ్యూజియంలో పెట్టిందని.. ఇది తమిళులను అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-08-10T18:16:40+05:30 IST