Rahul Gandhi defamation case: రాహుల్‌కి బెయిల్ పొడిగింపు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-04-03T15:46:01+05:30 IST
పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ బెయిల్‌ను సూరత్ సెషన్స్ కోర్ట్ ఏప్రిల్ 13 వరకూ పొడిగించింది.
సూరత్: పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ బెయిల్‌ను సూరత్ సెషన్స్ కోర్ట్ పొడిగించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ విధించిన శిక్షపై కోర్ట్ స్టే విధించలేదు. అయితే రాహుల్‌పై నేరారోపణలపై ఏప్రిల్ 10 లోగా రిప్లై ఇవ్వాలంటూ ఫిర్యాదుదారుడు పూర్ణేష్ మోదీకి (Purnesh Modi) నోటీసులు జారీ చేసింది. కాగా సూరత్ సెషన్స్ కోర్టుకు రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, గుజరాత్ కాంగ్రెస్ నేతలు, ఇతర సీనియర్ నేతలు తరలివచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలపై సూరత్ కోర్ట్ తీర్పు నేపథ్యంలో రాహుల్ ఇటీవలే ఎంపీ సభ్యత్వం కూడా కోల్పోయారు. రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ‘‘ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.
కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్ 13న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ ‘మోదీ’ అనే ఇంటిపేరు ఉన్నవారందరూ దొంగలే అంటూ మోదీ ‘కమ్యూనిటీ’ని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 అక్టోబరులో రాహుల్‌గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారు కాబట్టి.. వేస్తే ప్రధానే దీనిపై కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని, పూర్ణేశ్ మోదీ కాదని రాహుల్ తరఫు న్యాయవాది వాదించారు. అలాగే.. మోదీ అనే ‘కమ్యూనిటీ’యే లేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని కోర్టుకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని బయటపెట్టడం తప్ప.. రాహుల్ వ్యాఖ్యల వెనుక వేరే ఎలాంటి దురుద్దేశాలూ లేవని వెల్లడించారు.
‘‘రాహుల్ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, అనిల్ అంబానీకి పరిమితం చేసుకుని ఉండాల్సింది. కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ’ అనే ఇంటిపేరు కలిగి ఉన్న వ్యక్తులకు బాధకలిగించే వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ పరువునష్టానికి పాల్పడ్డారు’’ అని న్యాయమూర్తి వర్మ తన తీర్పులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉంటుందనే విషయం.. దాని ద్వారా ఏమేరకు ప్రయోజనాలు పొందగలననే విషయం కూడా ఆయనకు తెలుసని తీర్పులో వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్ చేసిన ‘చౌకీదార్ చోర్‌హై’ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి.. అప్పట్లో రాహుల్ బేషరతు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.
రాహుల్ వ్యాఖ్యల వల్ల.. ఫిర్యాదిదారుకు ఎలాంటి బాధ, నష్టం కలగలేదని, రాహుల్ గతంలో ఎలాంటి కేసులోనూ దోషి కాడని.. కాబట్టి తేలికపాటి శిక్ష విధించాలని రాహుల్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో కూడా న్యాయమూర్తి ఏకీభవించలేదు. కాగా.. తీర్పు వెలువడే సమయంలో నాడు రాహుల్ గాంధీ కోర్టుహాల్‌లోనే ఉన్నారు.
రాహుల్ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇవే వివాదాస్పద వ్యాఖ్యలపై సూరత్ కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని(vacate the government allotted bungalow) లోక్‌సభ హౌజింగ్ కమిటీ(Lok Sabha Housing Committee) నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.