Rajasthan: కాంగ్రెస్‌కు పైలట్ గుడ్‌బై..?
ABN , First Publish Date - 2023-06-06T14:35:39+05:30 IST
రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ గెహ్లాట్‌కు డెడ్‌లైన్ విధించిన సచిన్ పైలట్ ఎట్టకేలకు తనదారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈనెల 11న ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్‌లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ (Sachin pilot) మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు పతాక స్థాయికు చేరుకుంటున్నాయి. వసుంధరా రాజే సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ గెహ్లాట్‌కు డెడ్‌లైన్ విధించిన సచిన్ పైలట్ ఎట్టకేలకు తనదారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈనెల 11న ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రెండు పేర్లను కూడా ఆయన రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
సచిన్ పైలట్ సన్నిహత వర్గాల సమాచారం ప్రకారం, పైలట్ తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 11న దౌసలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ప్రొగ్రసివ్ కాంగ్రెస్ (Progressive Congress), రాజ్ జన సంఘర్ష్ (Raj Jana Sangharsh Party) అనే రెండు పేర్లను ఇప్పటికే ఆయన రిజిస్టర్ చేయించారు. కొత్త పార్టీ ఏర్పాటుపై కొద్దికాలంగా ఆయన తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన మాత్రం దీనిపై ఇంతవరకూ పెదవి విప్పలేదు. కాగా, అవినీతిపై తాను చేపట్టిన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు (కొత్త పార్టీ) చేసుకోవడం మినహా పైలట్‌కు మరో గత్యంతరం లేదని రాజకీయ పండితులు అంటున్నారు.
అంతర్గత విభేదాలు..
కొద్దికాలంలో రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. వసుంధరా రాజే సర్కార్ హయాంలో అవినీతిపై గెహ్లాట్ చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ఒకరోజు నిరాహార దీక్షను పైలట్ చేపట్టారు. ఐదు రోజుల పాదయాత్ర కూడా సాగించారు. మే 31వ తేదీలోగా తన డిమాండ్‌పై గెహ్లాట్ స్పందించాలని పైలట్ గడువు కూడా విధించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లబరచేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా గెహ్లాట్, పైలట్‌ను ఢిల్లీ పిలిపించుకుని చర్చలు జరిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని గెహ్లాట్, పైలట్ నిర్ణయించినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా ముందు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత రాజస్థా్న్ చేరుకున్న పైలట్....గెహ్లాట్ సర్కార్‌కు విధించిన గడువు ఈరోజుతో తీరనుందని, అవినీతి వ్యతిరేక పోరాటం ముందుకు తీసుకువెళ్తానని ప్రకటించడంతో కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాలు తగ్గుముఖం పట్టలేదనే సంకేతాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి.