Tripura Elections: మోదీ స్పీచ్‌లో ఏముంది..అబద్ధాలు తప్ప: మాజీ సీఎం
ABN , First Publish Date - 2023-02-12T18:27:17+05:30 IST
త్రిపురలో జరిగిన రెండు ఎన్నికల ర్యాలీలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మానిక్ సర్కార్ ఘాటుగా...
అగర్తలా: త్రిపురలో జరిగిన రెండు ఎన్నికల ర్యాలీలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మానిక్ సర్కార్ (Manik Sarkar) ఘాటుగా స్పందించారు. అన్నీ అవాస్తవాలు, అబద్ధాల ప్రాతిపదికగానే ప్రధాని ప్రసంగం సాగిందని, రాష్ట్రంలో బీజేపీ అవకతవకల పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఆయన ప్రయత్నించారని అన్నారు. అబద్ధాల ప్రాతపదికగా ప్రకటనలు చేయడం మంచిది కాదని, ప్రజలను తప్పుదారి పట్టించరాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిన మానిక్ సర్కార్ హితవు పలికారు.
త్రిపురకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1998-2018) అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా చెప్పానని, ఆ తర్వాత 2013-14లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు సమావేశమయ్యానని ఆయన చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే 2018లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశానికి విద్యుత్ సరఫరా చేశామని మోదీ చెప్పుకుంటున్నారని అన్నారు. దశాబ్దాల తిరుగుబాట్లకు లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో కళ్లెం వేశామని, సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం-1958ని 2015 మే 27న ఉపసంహరించుకున్నామని తెలిపారు. మోదీ ఒకపర్యాయం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో త్రిపురలో ఏవిధంగా తిరుగుబాట్లకు కళ్లెం వేశారంటూ తనను అడిగారని తెలిపారు. మోదీ విజ్ఞప్తి మేరకు అందుకు సంబంధించిన సమగ్ర నివేదకను కూడా ఆయనకు తాను అందజేశానని మానిక్ సర్కార్ చెప్పారు.
''త్రిపురలో తిరుగుబాట్లకు ఒక మంత్రితో సహా పార్టీకి చెందిన 350 మందికి పైగా కార్యకర్తలు, మద్దతుదారులు, లెఫ్ట్ కార్యకర్తలు, వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. మిలిటెన్సీని అణిచివేయడానికి లెఫ్ట్ ప్రభుత్వం ఎంత కష్టపడిందో యావద్దేశానికి తెలుసు. మోదీ మాత్రం లెఫ్ట్ హయాంలో శాంతి లేకుండా పోయిందని చెబుతున్నారు'' అని మానిక్ సర్కార్ తప్పుపట్టారు. లెఫ్ట్ హయాంలో త్రిపురలో ప్రజాస్వామ్యం అనేదే లేదని ప్రధాని చెప్పినది నిజమైతే.. 2018లో లెఫ్ట్ అధికారంలో ఉన్న రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంగిల్ రాజ్ మొదలైందని, అడవుల్లో అయినా కొంత క్రమశిక్షణ ఉంటుందేమో కానీ కాషాయం పార్టీ పాలనలో త్రిపురలో చట్టబద్ధమైన పాలన కాగడా వేసినా కనిపించదన్నారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణకే ఆ స్ట్రాటజీ...
కాంగ్రెస్, లెఫ్ట్ సీట్ల సర్దుబాటు ఒప్పదంపై ప్రధాన మంత్రి చేసిన ఆరోపణలను మానిక్ సర్కార్ తిప్పికొట్టారు. త్రిపురలో బీజేపీని ఓడించి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, చట్టపాలన కోసం కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయమే ఆయన ప్రసంగాల్లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ 299 వాగ్దానాలు చేసిందని, కానీ ఎందుకు వాటిని నిలబెట్టుకోలేదో మాత్రం మోదీ తన ప్రసంగంలో చెప్పలేదని అన్నారు. 2018 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ దుండగలు రిగ్గింగ్ చేశారని, ఎన్నికలనేవి ఒక ఫార్స్‌లా మారాయని అన్నారు. విపక్ష పార్టీల రాజ్యాంగ హక్కులను కూడా బీజేపీ ప్రభుత్వం అణిచివేసి, వందలాది పార్టీ కార్యాలయాలను పట్టపగలే కూల్చేయడం, అగ్నికి ఆహుతి చేయడం చేసిందని మాజీ సీఎం ఆరోపించారు. ప్రధాన మంత్రి ప్రజలకు ఏమి చెప్పి ఒప్పించాలని ప్రయత్నించినా ఫిబ్రవరి 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు.