Elections : లోక్ సభ, శాసన సభల ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-03T15:16:55+05:30 IST
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు వంటివాటిని చూసి లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమిలో చురుకుదనం, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు వంటివాటిని చూసి లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం అలాంటిదేమీ లేదని, లోక్ సభ ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తన పదవీ కాలంలో చివరి రోజు వరకు దేశ ప్రజలకు సేవలందిస్తారని తెలిపారు.
అనురాగ్ ఠాకూర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రానున్న శాసన సభల ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం కోసం వాయిదా వేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొన్ని రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను ముందుకు, వెనుకకు జరుపుతారని జరుగుతున్న ప్రచారమంతా మీడియా అభిప్రాయమని తెలిపారు.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, దేశంలోని సంబంధిత అన్ని వర్గాలతోనూ ఈ కమిటీ విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఈ కమిటీలో సభ్యునిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ప్రతిపక్ష గళానికి కూడా చోటు కల్పించడం వల్ల మోదీ ప్రభుత్వ విశాల హృదయం స్పష్టమవుతోందన్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సరైన సమయంలో వెల్లడిస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్