Old Parliament Building: పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తారా.. నివేదికలు ఏం చెప్తున్నాయి?
ABN , First Publish Date - 2023-09-18T18:25:45+05:30 IST
కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినప్పటి నుంచి పాత భవనం సంగతేంటి? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తూ వస్తోంది. ఇక రేపటి (మంగళవారం) నుంచి కొత్త భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారనున్న నేపథ్యంలో..
కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినప్పటి నుంచి పాత భవనం సంగతేంటి? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తూ వస్తోంది. ఇక రేపటి (మంగళవారం) నుంచి కొత్త భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారనున్న నేపథ్యంలో.. పాత భవనంపై చర్చలో జోరందుకున్నాయి. ఇంతకీ దాన్నేం చేస్తారు.. కూల్చేస్తారా, లేకపోతే మరే ఇతర వ్యవహారాల కోసం వాడుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఈ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయడం జరగదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ కార్యక్రమాల కోసం మరింత ఉన్నతంగా తిరిగి అమర్చబడుతుందని తెలిసింది.
ఈ పాత పార్లమెంట్ భవనం దేశపు పురావస్తు సంపద కాబట్టి.. ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించబడుతుందని ప్రభుత్వం నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతెందుకు.. 2021లో అప్పటి కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రస్తుత నిర్మాణాన్ని మరమ్మత్తు చేసి, ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. హెరిటేజ్-సెన్సిటివ్ పునరుద్ధరణ కోసం జాతీయ ఆర్కైవ్‌లను కొత్త పార్లమెంట్ భవనానికి మార్చనున్నారని.. తద్వారా పాత పార్లమెంటు భవనంలో మరింత స్థలం ఖాళీ అవుతుందని అన్నారు. అప్పుడు ఈ పాత భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చడానికి వీలు అవుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
కాగా.. ఈ పాత పార్లమెంట్ భవన నిర్మాణం 1927లో పూర్తయ్యింది. ఈ 96 ఏళ్ల కాలంలో ఈ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు మరెన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. బ్రిటీష్ వాస్తుశిల్పులైన సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ కలిసి ఈ ఐకానిక్ భవనాన్ని రూపొందించారు. ఇది స్వాతంత్ర్య పోరాటానికి మాత్రమే కాకుండా, ఆ తర్వాత దేశం ఎదుగుదలకు కూడా సాక్ష్యమిచ్చింది. ఈరోజు లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. పాత భవనానికి ఉద్వేగభరిత ప్రసంగంతో వీడ్కోలు పలికారు. ఎంపీలందరూ సరికొత్త ఆశ, విశ్వాసంతో కొత్త భవనంలోకి అడుగుపెడతారని అన్నారు. ఇది నిర్మించింది బ్రిటీష్ పాలకులే అయినా.. దీని కట్టడానికి పడ్డ శ్రమ, డబ్బు మన దేశవాసులదేనని నిజాన్ని మర్చిపోకూడదన్నారు.
ఇదిలావుండగా.. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది మే నెలలో ప్రారంభించారు. ఈ కొత్త భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, అలాగే రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. త్రిభుజాకారంలో ఉన్న ఈ నాలుగు అంతస్తుల భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీనికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.