Actor Suryakantam : తెలుగింటి అత్తగారు
ABN , First Publish Date - 2023-12-03T01:35:23+05:30 IST
సూర్యకాంతం అనగానే గయ్యాళి అత్త గుర్తుకొస్తుంది. అచ్చమైన తెలుగుదనం గుర్తుకొస్తుంది. తనదైన ప్రత్యేక శైలిలో అప్పటికీ.. ఇప్పటికీ.. గయ్యాళి అత్తకు ..

సూర్యకాంతం అనగానే గయ్యాళి అత్త గుర్తుకొస్తుంది. అచ్చమైన తెలుగుదనం గుర్తుకొస్తుంది. తనదైన ప్రత్యేక శైలిలో అప్పటికీ.. ఇప్పటికీ.. గయ్యాళి అత్తకు పర్యాయపదంగా మారిపోయిన సూర్యకాంతం శతజయంతి ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన ‘తెలుగింటి అత్తగారు’ పుస్తకంలోని కొన్ని భాగాలు.
అమ్మ మొట్టమొదట నెలకు 75 రూపాయల జీతానికి ‘జెమినీ ఫిలిం్‌స’లో నటించటానికి ఒప్పుకుంది. ఆ సమయంలో గాయని లీల గారు పరిచయం చేయటంవల్ల పి.పుల్లయ్య గారు, తాపీ ధర్మారావుగారు తమ సినిమాలో వేషం వేయమన్నారట. ‘నేను తెలుగులో చేయ్యను. హిందీ సినిమాల్లోనే నటిస్తాను’ అని అమ్మ వాదించిందట. ఏదో ఒక సినిమాలో అవకాశం వస్తే చాలని వందల మంది ఎదురుచూసేవారట ఆ రోజుల్లోనే. అటువంటిది... అంత ధైర్యంగా ‘హిందీలో అయితేనే చేస్తా’నని అనటంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. అమ్మ మాటలకు ‘పద్మశ్రీ ఫిలిమ్స్’ పి.పుల్లయ్య గారు... ‘ముందు తెలుగులో చెయ్యి. మంచి పేరు వచ్చిన తర్వాత హిందీలో చేద్దువుకాని’ అన్నారట. అదే ‘పద్మశ్రీ పిక్చర్స్’ బ్యానర్ మీద 1946లో ‘నారద నారద’ అనే సినిమా తీశారు. అదే అమ్మ మొదటి సినిమా. అమ్మ మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకుంది. కానీ ఈ మహానగరంలో ఒకసారి బస్సు ఎక్కుతున్నప్పుడు కింద పడిపోవటంతో ముక్కు మీద దెబ్బ తగిలి మచ్చ పడిందట. క్లోజ్‌పలో మచ్చ కనబడుతుంది కాబట్టి ఇక నాయిక పాత్రలకు పనికిరానని తనకు తానే నిర్ణయించుకొని క్యారెక్టర్ ఆరిస్టుగా మారిపోయింది.
సినిమాల్లో అంత నోరు పెట్టుకొని మాట్లాడేదా... కానీ స్వతహాగా అమ్మ చాలా రిజర్వ్‌డ్. అవసరమైనంతవరకే మాట్లాడేది. ఎక్కువగా ఎదుటివాళ్లు చెప్పేది వినేది. బాగా ఓర్పు. తనకు పాజిటివ్ అనిపించే మాటలే మాట్లాడేది. ఉదాహరణకి ఏడు సంఖ్యని అమ్మ అస్సలు పలికేది కాదు. ‘‘ఆరునొక్కటి’’ అనేది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆరునొక్కటి.. ఇలా సాగిపోయేది ఆవిడ లెక్క. ఏడు అంటే ఏడవటం అనే అర్థంలో మనం వాడుతుంటాం కాబట్టి అది పలికేది కాదు. ఇక శాపనార్థాలన్నీ సినిమాల వరకే కానీ మామూలుగా ఎవరినీ తిట్టేదే కాదు. ఎక్కువగా అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తుండేది. ఎవరితోనైనా ఏదైనా పొరపాటు జరిగితే ‘‘నీ మొహం... నీతో సంతకి పోనూ’’ అనేది. తనని తను కూడా... ‘‘నా మొహం నాతో సంతకు పోనూ’’ అనుకొనేది.
‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో మంథర వేషానికి అమ్మ వీపు మీద మెత్తని బూరుగు దూదితో చేసిన దిండ్లు కట్టారు షూటింగ్ మొదటి రోజు. మంథరకి గూని ఉండేది కదా... అందుకని. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అమ్మ దాంతోనే వంగి ఉండేది. సహజత్వం కోసం ఓపికగా భరించింది. ఒక్కసారి కూడా చిన్నగా అయినా విసుక్కొలేదు. పైగా భోజనం కూడా అలాగే చేసింది. కుర్చీలో పళ్లెం పెట్టుకొని తను కూర్చోకుండా వంగి తిన్నది. కానీ సాయంత్రానికి దర్శకుడు వసంతకుమార్ రెడ్డి గారు వచ్చి... ‘‘ఇదేంటి.. సూర్యాకాంతంగారు అట్లా వంగి ఉన్నారు? ఆవిడకి గూని పెడితే ఎలా?’’ అన్నారు. ‘మంథరకు గూని ఉండేది కదా’... అని ఆయన అసిస్టెంట్ చెప్పేసరికి.. ‘‘ఆవిడకు గూని పెడితే ముఖ కవళికలు, ఎక్స్ప్‌షన్స్ ఎలా తెలుస్తాయి? సూర్యకాంతం అంటేనే గయ్యాళితనం. ఆవిడను గూనితో చూపించనక్కరలేదు’’ అన్నారు. దాంతో అమ్మ నిటారుగా నిలబడే మంథర క్యారెక్టర్ నడిపించేసింది. ఆ సినిమా, ఆవిడ పాత్ర హిట్టయ్యాయి. అమ్మ ఇమేజ్ వల్ల గూని లేకపోవటం అనేది లోటుగా అనిపించలేదు.
షూటింగ్ ఉన్నప్పుడు అమ్మ స్పెషల్ ఐటమ్స్ చేసి... సెట్స్‌కు తీసుకువెళ్లి అందరికీ పెడుతూ తనూ తినేది. ఇంటికి వచ్చిన బంధువులకు నిమిషాల్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం చేసి పెట్టేది. రాత్రికి పనులన్నీ పూర్తయ్యాక కూడా అలసిపోయినట్లు కనిపించేది కాదు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటమే ఆవిడ స్వభావం. ఇంట్లో అందరం పొద్దున పెరుగన్నమే తినేవాళ్లం. ఎవరైనా ఇంటికి వస్తే ‘మజ్జిగ తాగుతారా? భోం చేస్తారా’ అని అడిగేది అమ్మ. కాఫీ, టీలు ఇచ్చేది కాదు. తను ఎప్పుడూ సింపుల్‌గా ఉండేది. ఇంటికి శత్రువులు వచ్చినా వారిని ఆదరించి అన్నం పెట్టేది. ఇంట్లో అందరం కలిసి అన్నం తినాలనేది అమ్మ కోరిక. ఒక్కొక్కసారి తన వంట తనకే నచ్చేది కాదు. వెంటనే నాతో... ‘‘నాన్నా... నెయ్యి వేసి మాగాయి అన్నం కలిపి పట్రా’’ అని చెప్పేది. అమ్మకి నెయ్యి- మాగాయి.. నెయ్యి- అవకాయంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్క రోజు కూడా నెయ్యి లేకుండా అన్నం తినలేదు. ఎన్ని మానేసినా చివరివరకు నెయ్యి మాత్రం మానలేదు. అప్పట్లో సినిమా వాళ్లంతా చెన్నై టీనగర్‌లో ఉండేవారు. మేము మాత్రం మైలాపూర్ సిఐటీ కాలనీలో ఉండేవాళ్లం. పూర్వం మా ఇంటి మొత్తానికి ఒక్క గదిలోనే.. అది కూడా హాల్లో మాత్రమే ఏసీ ఉండేది. రేడియో కూడా అక్కడే ఉండేది. రేడియోలో వచ్చే కార్యక్రమాలు అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్లం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే చలనచిత్రం వినేవాళ్లం. వేసవి కాలంలో అందరూ ఆ గదిలో చేరి కబుర్లు చెప్పుకొనేవాళ్లం.
సహజత్వం కోసం మా అమ్మ ఒక్కతే కాదు... కళాకారులంతా ఎంతగానో తాపత్రయపడేవారు. నా కళ్లారా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూశాను... ‘‘ఎస్పీ పరశురామ్’’ సినిమాలో అమ్మ... చిరంజీవిగారికి, ఆయన చెల్లెలికి పెద్దమ్మగా చేసింది. నిజానికి అది ‘ఆయా’ పాత్ర. కానీ చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరినీ పెంచటంవల్ల ‘పెద్దమ్మ’ అని అప్యాయంగా పిలుస్తూ ఉంటారు. సినిమాలో చిరంజీవి గారు ఒక సందర్భంలో అమ్మని గట్టిగా మందలిస్తారు. అందుకు అమ్మ పాత్ర బాధపడుతుంది. ఆ తరువాతి సన్నివేశంలో ఆయన అమ్మ కాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడుతూ క్షమించమని అడుగుతారు. అలా నటించినప్పుడు... ‘‘వద్దు నాయనా... నువ్వలా నా కాళ్ల దగ్గర కూర్చోకూడదు. నువ్వు చిరంజీవివి’’ అని అమ్మ ఎంతగానో చెప్పింది. కానీ ఆయన... ‘‘లేదమ్మా... నేనిది చేయాలి. నా పాత్ర చేస్తుంది. ఇలా చేస్తేనే నాకు గౌరవంగా ఉంటుంది. సన్నివేశాన్ని బట్టి కాకపోయినా మీరు పెద్దవారు. గొప్ప యాక్టర్. మీ కాళ్లకు నేను దండం ఎందుకు పెట్టకూడదు’’ అంటూ అమ్మ కాళ్లని పట్టుకొని క్షమాపణ చెప్పే సన్నివేశాన్ని పూర్తి చేశారు. తను మెగాస్టార్ అన్న భేషజాన్ని చూపకుండా నటిగా అమ్మ గొప్పతనాన్ని, సీనియారిటీని ఆయన గుర్తించి గౌరవించారు.
రచయిత సూర్యకాంతం కుమారుడు
డాక్టర్ అనంత పద్మనాభమూర్తి